close

ప్రధానాంశాలు

కుదుటపడుతున్న భైంసా

కొనసాగుతున్న పోలీసు బందోబస్తు

భైంసా పట్టణం, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో పరిస్థితి కుదుటపడుతోంది. రెండు రోజుల కిందట ఇరువర్గాల మధ్య ఘర్షణలతో అట్టుడికిన పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. సమస్య తీవ్రతను గుర్తించిన ఉన్నతాధికారులు సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం 7గంటలవరకు పట్టణంలో కర్ఫ్యూ విధించడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. వరంగల్‌ ఐజీ నాగిరెడ్డి, డీఐజీ ప్రమోద్‌కుమార్‌, జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు, జిల్లా జేసీ భాస్కరరావు భైంసాలోనే మకాంవేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలో మంగళవారం పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, ప్రార్థనా మందిరాలు, ఆలయాల వద్ద పోలీసు పికెటింగులతోపాటు పట్టణ శివార్లలోని వివిధ మార్గాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భాజపా మంగళవారం నిర్మల్‌జిల్లా బంద్‌కు పిలుపునిచ్చినా పండగ ఉండటంతో బంద్‌ ప్రభావం కనిపించలేదు. మంగళవారం రాత్రి ఎలాంటి కర్ఫ్యూఉండదని, 144 సెక్షన్‌ మాత్రం అమల్లో ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌ గృహ నిర్బంధం
గోషామహల్‌, న్యూస్‌టుడే: భైంసాలో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో మంగళవారం ‘చలో భైంసా’కు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచే అప్పర్‌ ధూల్‌పేట ఆరామ్‌ఘర్‌ కాలనీలోని ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు రాజాసింగ్‌ ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయనకు పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం రాజాసింగ్‌ మాట్లాడుతూ.. ఎంఐఎం, తెరాస నేతలకు భైంసాలో పర్యటించేందుకు పోలీసులు అనుమతి ఇస్తున్నారని, తమను అడ్డుకోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.

భైంసా అల్లర్లపై ఆరు కేసుల నమోదు
ఈనాడు, హైదరాబాద్‌: నిర్మల్‌ జిల్లా భైంసాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం మంగళవారం సాయంత్రం నాటికి 37 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ నెల 12న రాత్రి పది గంటల సమయంలో భైంసాలోని కోర్బా గల్లీలో మొదట ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. సమాచారం అందుకున్న భైంసా టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ వేణుగోపాల్‌, కానిస్టేబుల్‌ కృష్ణతో కూడిన పోలీసు బృందం అక్కడకు చేరుకుని అల్లర్లను అదుపు చేసే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఇరువర్గాలు విసిరిన రాళ్ల కారణంగా వీరిద్దరికీ గాయాలయ్యాయి. ఆ ఘటనపై ఇద్దరు వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు 12 మందిపై కేసులు నమోదయ్యాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.