close

ప్రధానాంశాలు

కాల విజ్ఞాన వాహిని మన సంక్రాంతి

భూభ్రమణం, పరిభ్రమణం, సూర్యగమనంపై వేల ఏళ్ల క్రితమే సంపూర్ణ అవగాహన!

నిషి జిజ్ఞాసువు.. జగత్తు నిగూఢం.. విజ్ఞానాస్త్రంతో దీన్ని శోధించే ప్రయత్నం నిరంతర యజ్ఞం. భువిపై నివసిస్తున్న మనకు సూర్యుడు వెలుగును మాత్రమే పంచడం లేదు.. ఆయన రుతుకర్త కూడా. ఈ విషయాన్ని వేల ఏళ్ల క్రితమే తెలుసుకున్నారు మన పూర్వీకులు. ఈ క్రమంలో సూర్యుని గమనంలో వచ్చే ఒక ప్రముఖ మార్పును..  అది తెచ్చే విశిష్టతను పండుగ చేసుకోవడమనే ఆచారంతో ముడిపెట్టి కృతజ్ఞత చాటుకున్నారు. అదే సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఆ సమయం అందరికీ పండుగ రోజు. దీంతోటే ఉత్తరాయణమూ ప్రారంభమవుతుందంటారు. ఆధునిక ఖగోళ విజ్ఞానం ప్రకారం.. డిసెంబరు 22న సూర్యుని నిట్టనిలువు కిరణాలు భూమి దక్షిణార్ధ గోళంలోని మకరరేఖను తాకుతాయి. ఆ రోజు నుంచి సూర్య గమనం ఉత్తర దిశగా సాగుతుంది. అంటే ఉత్తరాయనం ప్రారంభమవుతుంది. మరి మన సంప్రదాయంలో జనవరి 14 లేక 15న వచ్చే సంక్రాంతితో ఉత్తరాయనాన్ని ఎందుకు ముడిపెట్టారు. ఈ సంక్రాంతి పర్వదినాన ఆ విషయాలు తెలుసుకుందాం.

చరాచర ప్రాణికోటికి ఆధారం భూగ్రహం.. భూమికి ఆధారం సూర్యుడు. భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న బంధాన్ని.. భూమి భ్రమణాన్ని (తన చుట్టూ తాను తిరగడం), పరిభ్రమణాన్ని (సూర్యుని చుట్టూ తిరగడం), వాటి ఫలితాలను వేల సంవత్సరాల క్రితమే అత్యంత కచ్చితంగా గుర్తించారనడానికి ఆధారం.. ఆనాటి నుంచే ఉత్తరాయనాన్ని, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశాన్ని (సంక్రాంతి) పండుగగా చేసుకోవడం.
ప్రస్తుత కలియుగానికి ముందు ద్వాపర యుగంలో, తాను కోరుకున్నప్పుడు ప్రాణాన్ని త్యజించే శక్తి కలిగిన బీష్ముడు యుద్ధరంగంలో నేలకొరిగి.. ప్రాణాలు విడిచేందుకు ఉత్తరాయన పుణ్య కాలం వచ్చే వరకూ ఎదురుచూశాడని మహాభారతం చెబుతున్న విషయమూ తెలిసిందే.

ఆధునిక ఖగోళ విజ్ఞానం ప్రకారమూ.. భూ పరిభ్రమణంలో ఇది ఒక విశేష ఘట్టం. సూర్యుడు భూమి దక్షిణార్ధగోళంలోని మకర రేఖను ముద్దాడి.. ఎగువకు ప్రయాణిస్తూ కర్కట రేఖ వరకూ సాగే పయనం. భూమి ఉత్తర గోళం దిశగా సూర్యుని గమనం.. అదే ఉత్తరాయనం.

* నిజానికి సూర్యుడు తిరగడు. భూమి పశ్చిమం నుంచి తూర్పునకు తన చుట్టూ తాను తిరుగుతుండడంతో సూర్యుడు భూమిపై తూర్పు నుంచి పశ్చిమానికి తిరుగుతున్నట్లు కనిపిస్తాడు. మనం రైలులో ప్రయాణిస్తూ కిటికీలో చూస్తుంటే.. పక్కన ఉన్న చెట్లు, ఇళ్లు వెనక్కు వెళ్లినట్లు కనిపిస్తాయి కదా.. అలా అన్నమాట.

మనకు వర్షాలు పడాలంటే మేఘాలు రావాలి. ఆ మేఘాలు ఏర్పడాలంటే సూర్య కిరణాలు భూమిపై, సముద్రాల్లోని నీటిని ఆవిరిగా మార్చాలి. ఆ ప్రక్రియ మొదలయ్యే కాలం ఉత్తరాయనం. అంటే మేఘాల పంటకు సూర్యుడు విత్తనాలు వేసే కాలం అనవచ్చేమో. అలానే రైతు ఇంటికి పంటలు వచ్చే కాలం కూడా.

సాధారణంగా జనవరి 14 లేక ఒక రోజు అటూఇటుగా సంక్రాంతి వస్తోంది. ఉత్తరాయనం సంక్రాంతితో ప్రారంభమవుతుందని హిందూ పంచాంగాలు చెబుతున్నాయి. అయితే ఆధునిక ఖగోళ విజ్ఞానం ప్రకారం డిసెంబరు 21 లేక 22న సూర్యుడి ఉత్తర యానం ప్రారంభం అవుతోంది. ఈ తేడాకు కారణాలను గుర్తించడానికి పరిశోధనలూ జరుగుతున్నాయి. సాధారణంగా సౌరమానం, చంద్రమానం లేక రెండింటినీ అనుసరించి క్యాలెండర్లు తయారవుతాయి. వీటి గణనలూ విభిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాయనం రాకకు, సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణానికి మధ్య తేదీల్లో వ్యత్యాసం వస్తుందన్న భావనలు ఉన్నాయి. 


ఒకేసారి రెండు వేగాలతో భూమి పయనం

* మనిషి కూడా ఇంతేగా (వ్యక్తిగత జీవితం, సంఘ జీవితం రెండింటా పయనించాలిగా) మనం నివసిస్తున్న ఈ భూమి.. అనంత విశ్వంలో భాగమైన సూర్యుని కుటుంబంలో ఒక గ్రహం. సూర్యుని ఆకర్షణ శక్తి కారణంగా బంధించినట్లుగా నిర్దిష్ట మార్గం (కక్ష్య)లో సూర్యుని చుట్టూ తిరుగుతోంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ.. దీర్ఘవృత్తాకార కక్ష్యలో సూర్యుని చుట్టూనూ తిరుగుతోంది. తన చుట్టూ తాను గంటకు 1610 కిమీ వేగంతో.. దాదాపుగా 14.4 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని చుట్టూ గంటకు సరాసరిన 1,07,000 కిమీ వేగంతో (సెకనుకు 29.8) తిరుగుతోంది.

రాశుల ఆధారంగా
భూమి సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి చేయడం అంటే 360 డిగ్రీలు తిరిగివస్తుంది. రోజుకు 1 డిగ్రీ, నెలకు దాదాపుగా 30 డిగ్రీల చొప్పున 12 నెలల్లో భూమి సూర్యుడిని చుట్టి వస్తుంది. ఈ క్రమంలో ఒక్కో నెలలో సూర్యుడు ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడని పూర్వీకులు గుర్తించారు. అలా సంవత్సరంలో 12 రాశుల్లో ప్రయాణిస్తాడని చెప్పారు. ఇక్కడ రాశి అంటే కొన్ని నక్షత్రాల సమూహం. ఆ సమూహాలను ఊహారేఖలతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి వాటికి మేషం, మీనం, మకర.. ఇలా 12 పేర్లు పెట్టారు. (ఆధునిక విజ్ఞానమూ భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని కొన్ని స్థిర నక్షత్రాల ఆధారంగానే లెక్కకడుతోంది).

ఖగోళ విజ్ఞానం పరంగా చెప్పాలంటే..
ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూమి కేంద్రం (నాభి) ద్వారా పోయే ఊహారేఖను భూమి అక్షం (యాక్సిస్‌) అంటాం. దీని ఆధారంగా భూమి తన చుట్టూ తాను బొంగరంలా తిరుగుతుంది. అలానే సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేస్తుంది. ఇలా తిరిగే సమయంలో భూమి నిలువుగా ఉండదు. 23.44 డిగ్రీల తూర్పు ఒంపుతో ఉంటుంది. రుతువులు ఏర్పడడానికి, వివిధ ప్రాంతాల్లో పగటి సమయాల్లో తేడాలకు ఇదే కారణం. భూమి అక్షం వాలి ఉండడం వల్ల సూర్యుని 90 డిగ్రీల నిట్టనిలువు కిరణాలు కర్కటరేఖ, మకరరేఖలను దాటి ప్రసరించవు. దీని ప్రకారం ఏడాదిలో 6 ముఖ్య ఘట్టాలు ఏర్పడతాయి.

డిసెంబరు 22: సూర్యుడి మధ్యాహ్న సమయం నిట్టనిలువు కిరణాలు భూమి దక్షిణార్థ గోళంలోని మకర రేఖపై 90 డిగ్రీల కోణంలో పడతాయి. దీనిని శీతాకాల అయనాంతం అంటారు. దీనినే ఉత్తరాయనం అంటారు.
జనవరి 5: భూమికి, సూర్యునికి మధ్య అతి తక్కువ దూరం (14.71 కోట్ల కిమీ) ఉండే స్థితి పరిహేళి ఏర్పడుతుంది. శీతాకాల అయనాంతానికి రెండు వారాలకు ఇది వస్తుంది. మన దగ్గర ఈ రోజునే వైకుంఠ ఏకాదశి లేక ఉత్తర
ద్వార దర్శనంగా జరుపుకుంటాం.
మార్చి 21 లేక 22: సూర్యుని నిట్టనిలువు కిరణాలు భూమధ్య రేఖపై 90 డిగ్రీల కోణంలో పడతాయి. దీంతో ప్రపంచమంతా రాత్రి పగలు సమయం సమంగా ఉంటుంది. వీటిని విషవత్తులు అంటారు. మిగతా రోజుల్లో రాత్రి, పగటి సమయాల్లో మార్పులు ఉంటాయి.
జూన్‌ 21 లేక 22: సూర్యుని నిట్టనిలువు కిరణాలు ఉత్తరార్థ గోళంలోని కర్కట రేఖపై పడతాయి. అప్పటి నుంచి సూర్య గమనం దక్షిణ దిశగా సాగుతుంది.
జులై 4: భూమికి, సూర్యునికి మధ్య ఎక్కువ దూరం ఉండే స్థితి అపహేళి ఏర్పడుతుంది.
సెప్టెంబరు 22 లేక 23: జూన్‌ 21 లేక 22న వచ్చినట్టే సెప్టెంబరు 22 లేక 23 తేదీల్లో సూర్యుని నిట్టనిలువు కిరణాలు భూమధ్య రేఖపై పడతాయి.


సూర్యమానం, చాంద్రమానం క్యాలెండర్లకు తేడాలు ఇవీ..

భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాలు.. సూర్య గమనం ప్రకారం 24 గంటలు.. ఎందుకంటే
* స్థిర నక్షత్రాల ఆధారంగా కొలిచినప్పుడు.. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు పడుతుంది. అదే సూర్యగమనం ప్రకారం లెక్కకడితే 24 గంటలు అవుతుంది. సూర్యుడు ఆకాశంలో ముందు రోజు కనపడిన ప్రదేశంలో ఈ రోజు కనపడడానికి 24 గంటలు పడుతుంది. ఈ తేడా ఎందుకు అంటే? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుంది కదా. ఈ క్రమంలో సూర్యుని కక్ష్యలో భూమి రోజుకు ఒక డిగ్రీ ముందుకు వెళుతుంది. ఈ కారణంగా భూమిపై ఈ రోజు నిర్దిష్ట సమయానికి నిర్దిష్ట ప్రాంతంలో పడిన సూర్యకిరణాలు రెండో రోజు భూమి భ్రమణం పూర్తయ్యేసరికి అదే స్థానంలో పడవు (భూమి ముందుకు వెళ్లిన కారణంగా). ముందురోజులానే అదే సమయానికి, అదే ప్రదేశంలో సూర్యకిరణాలు పడాలంటే ఒక డిగ్రీ దూరం ప్రయాణించాలి. అందుకు సుమారు 4 నిమిషాలు అదనంగా పడుతుంది. అందువల్ల సూర్య గమనానికి 24 గంటలు పడుతుంది. ఈ తేడా వల్లే సంవత్సరం రోజుల్లో (365.25) భూమి తన చుట్టూ తాను 366.25 సార్లు తిరుగుతుంది.

* భారత్‌లో చాంద్రమానం క్యాలెండర్‌ని అనుసరిస్తున్నాం. పౌర్ణమికి పౌర్ణమికి మధ్య 29.5 రోజుల తేడా ఉంటుంది. సంవత్సరంలో 12 పౌర్ణములకు పట్టే (చాంద్రమానంలో ఏడాది) కాలం 354 రోజులు మాత్రమే. కానీ సూర్యుడి చుట్టూ భూమి ఒకసారి తిరిగి రావడానికి 365.25 రోజులు పడుతుంది. ఈ క్రమంలో చాంద్రమానానికి, సూర్యమానానికి మధ్య ఏడాదిలో 11.25 రోజుల తేడా వస్తోంది. ఈ నేపథ్యంలో చాంద్రమానంలో ఈ తగ్గుతున్న రోజుల్ని కలపడానికి.. ప్రతి రెండున్నరేళ్లకు ఒకసారి అధిక మాసాన్ని కలుపుతున్నారు. అప్పుడు సూర్యమానం క్యాలెండర్‌తో రోజులు సరిపోతాయి.

* సూర్యమానంలో సంవత్సరానికి 365.25 రోజులు కదా. అంటే సంవత్సరానికి ఒక పావు రోజు అధికంగా ఉంటుంది. ఇలాంటి నాలుగు పావు రోజుల్ని కలిపి ఒక రోజుగా నాలుగేళ్లకోసారి లీపు సంవత్సరంలో (ఆ సంవత్సరం ఫిబ్రవరిలో 29 రోజులు) కలుపుతున్నారు. సంవత్సర కాలాన్ని, రుతువులను సూర్యమానమే స్పష్టంగా చెబుతోంది. అందుకే సూర్య గమనం ఆధారంగా చెప్పే సంక్రాంతి పర్వదినంలో ఒకరోజు అటూఇటూ తప్ప ఎక్కువ మార్పు ఉండదు.


టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌లో పరిశోధకులు డా.మయాంక్‌ వాహియా పరిశోధన ప్రకారం

ఆర్యభట్ట నాటి కాలంలో (క్రీ.శ. 500 సంవత్సరంలో) ఉత్తరాయనం, మకర రాశిలోకి సూర్యుని పయనం ఒకే రోజు కావడంతో ఆ సిద్ధాంతం అలా కొనసాగుతోంది. వాస్తవానికి ఉత్తరాయనం డిసెంబరు 22నే వస్తుండగా.. 1500 ఏళ్లలో సూర్యుడు మకర రాశిలోకి పయనించే కాలం ముందుకు జరుగుతూ జనవరి 14 లేక 15కి వచ్చిందని ‘స్టెల్లారియం’ అనే సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఆయన గుర్తించారు.

అమెరికాలో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్న జగన్నాథ రామశాస్త్రి అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌ ప్రకారం.. వివిధ సంవత్సరాల్లో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తేదీలు
సంవత్సరం    సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తేదీ
5,299 బీసీ      అక్టోబరు 3
4000 బీసీ      అక్టోబరు 20
2000 బీసీ      నవంబరు 18
1000 బీసీ      డిసెంబరు 16
1 సీఈ        డిసెంబరు 17
1099         జనవరి 1
1199         జనవరి 3
1399         జనవరి 5
1999         జనవరి 14


అందుకే భూ‘మాత’

భూమి.. తన చుట్టూ తాను తిరగడాన్ని 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లలో, సూర్యుని చుట్టూ తిరగడాన్ని 365 రోజుల 6 గంటల 54 సెకన్లలో పూర్తి చేస్తోంది. ఎన్నడూ క్షణం కూడా ఆలస్యం కావడంలేదు. భూమి, సూర్యుడు, చంద్రుడు విశ్రాంతి లేకుండా 24 గంటలూ కచ్చితంగా పనిచేస్తూ.. మనం పని చేసుకోవడానికి పగలు, విశ్రాంతి తీసుకోవడానికి రాత్రి, పంటలు పండించుకోవడానికి రుతువులు ఇలా అన్నింటినీ ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే తల్లి గర్భం దాల్చి, బిడ్డను 9 నెలలు తన కడుపులో వృద్ధి చేసి, భూమ్మీద పడ్డాక రేయింబవళ్లు కంటికి రెప్పలా కనిపెట్టుకుని పెంచుతున్నట్లు లేదూ! మరి అలాంటప్పుడు మన పూర్వీకులు భూమిని తల్లి అని, సూర్యుడిని ప్రత్యక్ష భగవానుడని పోల్చడంలో తప్పేముంది?


- ఈనాడు ప్రత్యేక విభాగం

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.