close

ప్రధానాంశాలు

ఏకగ్రీవాలు ఏకపక్షం

పురపోరులో కారుదే జోరు
   77 స్థానాలు తెరాసకు.. మూడుచోట్ల ఎంఐఎం
  ఫలించిన బుజ్జగింపులు
  ఇల్లెందులో అన్నింటా తెరాస రెబల్స్‌
  కొత్తగూడెంలో కాంగ్రెస్‌, వామపక్షాలు, తెదేపా కూటమిగా బరిలోకి
  అక్కడక్కడా అభ్యర్థుల కన్నీళ్లు... ఆత్మహత్యాయత్నాలు
  ముగిసిన ఉపసంహరణలు
  బరిలో మిగిలిన వారు 13,036 మంది
ఈనాడు యంత్రాంగం

పురపాలక పోరులో తెరాస ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఏకగ్రీవాల్లో మూడు మినహా అన్ని స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో 80 స్థానాలు ఏకగ్రీవం కాగా తెరాస 77 సొంతం చేసుకుంది. ఎంఐఎం మూడింటిని దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బుజ్జగింపులు.. సముదాయింపులు.. నచ్చచెప్పడం.. భవిష్యత్తు అవకాశాలను ఆశగా చూపి తిరుగుబాటు అభ్యర్థులను విరమింపజేేసేందుకు తెరాస, కాంగ్రెస్‌, భాజపా చేసిన ప్రయత్నాలు చాలా వరకు ఫలించాయి. పోటాపోటీగా ఉన్న చోట్ల స్వతంత్రులతోనూ నామినేషన్లు ఉపసంహరింపచేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం పలు చోట్ల అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 22న ఎన్నికలు జరిగే 120 పురపాలక సంఘాలు, తొమ్మిది నగరపాలక సంస్థల్లో బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు.

పురపాలక సంఘాల్లో 2,727 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా వీటిలో 79 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కార్పొరేషన్లలో 325 డివిజన్లకు 324 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి.
* మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లో ఒక డివిజన్‌ ఏకగీవ్రంగా.. తెరాస దక్కించుకుంది. పరకాలలో 22 వార్డులుండగా 11 చోట్ల తెరాస అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. చెన్నూరులో 7, సత్తుపల్లిలో 6 వార్డులు తెరాసకు దక్కాయి. మేడ్చల్‌లో 5వార్డులు, రంగారెడ్డి జిల్లాలో 3 తెరాస ఖాతాలో జమయ్యాయి.
* సిరిసిల్లలో 4చోట్ల తెరాస అభ్యర్థులు ఎన్నికయ్యారు. బీ-ఫారాలు దక్కకపోవడంతో పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు పురపాలికలో ఎమ్మెల్యే బానోతు హరిప్రియ 24 వార్డులకు తెరాస అభ్యర్థులను బరిలో దింపారు. ఇక్కడ తెరాస నేత మడత వెంకటగౌడ్‌ తన వర్గానికి టికెట్లు దక్కలేదని 24 వార్డుల్లో అభ్యర్థులను పోటీ¨కి నిలిపారు. కొత్తగూడెం పురపాలికలో కాంగ్రెస్‌, సీపీఐ, తెదేపా, సీపీఎం కూటమిగా ఏర్పడి అభ్యర్థులను బరిలో దింపాయి.

 

దక్కలేదని నిరసనలు
* ఆదిలాబాద్‌ తాజా మాజీ పురపాలక అధ్యక్షురాలు రంగినేని మనీషకి తెరాస బీ-ఫారం దక్కక పోవడంతో నామపత్రాన్ని ఉపసంహరించుకొని కంటతడి పెట్టారు. ఎమ్మెల్యే జోగు రామన్న తన కొడుకును ఛైర్మన్‌ చేయాలనే ఉద్దేశంతో తనకు బీ-ఫారం ఇవ్వలేదని ఆరోపించారు.
* జనగామలో టికెట్టు దక్కలేదని తెరాస మహిళా నేతలు గంగాభవాని, మేడ గంగ.. ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ఇంటి ఎదుట నిరసనకు దిగారు. గంగాభవాని పార్టీ కండువాతోనే గొంతు బిగించుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు.
* నర్సంపేటలో టికెట్టు దక్కని తెరాస ఆశావహులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. తన సతీమణికి టికెట్టు దక్కకపోవడంతో మహబూబ్‌నగర్‌ తెరాస మాజీ పట్టణ అధ్యక్షుడు జి.టి.కృష్ణ పార్టీకి రాజీనామా చేయగా ఆయన భార్య సువర్ణ కాంగ్రెస్‌ అభ్యర్థిగా 36వ వార్డు నుంచి బరిలో నిలిచారు. గద్వాల జిల్లా అయిజ ఎంపీపీ తిరుమల్‌రెడ్డి తన పార్టీకి పనిచేసినవారికి టికెట్లు ఇవ్వలేదని ఆరోపిస్తూ ఎంపీపీ, ఎంపీటీసీ, తెరాస సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఇద్దరి ఆత్మహత్యాయత్నం
* మేడ్చల్‌లో 14వ వార్డు నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన లక్టు విజయ్‌కుమార్‌కు తెరాస బీ-ఫారం దక్కకపోవడంతో కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట పురపాలికలో 39 వార్డుకు తెరాస నుంచి టికెట్టు ఆశించిన రహీంకు చివరి నిమిషంలో చుక్కెదురు కావడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఇద్దరూ తెరాసనే.. స్వతంత్రులుగానే
సత్తుపల్లిలోని ఆరు, తొమ్మిదో వార్డుల నుంచి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఇద్దరికీ తెరాస బీ ఫారాలు ఎవరికీ ఇవ్వలేదు. దీంతో వీరు స్వతంత్రులుగా తలపడుతున్నారు.

భాజపా జిల్లా అధ్యక్షుడిపై దాడికి యత్నం
కామారెడ్డి వార్డు స్థానాల టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా భాజపా అధ్యక్షుడు లక్ష్మారెడ్డిపై టికెట్లు దక్కని నేతల అనుచరులు దాడికి ప్రయత్నించారు. బీ-ఫారాలను చించేందుకు ప్రయత్నించగా పోలీసులు చెదరగొట్టారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పురపాలిక 36వ వార్డులో భాజపా అభ్యర్థిని లక్కీ డ్రాలో ఎంపిక చేశారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో భాజపా అభ్యర్థిని ఉపసంహరణ అంశం గొడవకు దారితీసింది.


బీ- ఫారం చించేసిన కాంగ్రెస్‌ నేత

మెదక్‌లో 16వ వార్డులో ఉదయం చంద్రకళ పేరుతో బీ-ఫారాన్నిచ్చి, మధ్యాహ్నం రద్దు చేసి ఒద్ది వసంత్‌రాజ్‌కు ఇవ్వడంతో గొడవ జరిగింది. మాజీ కౌన్సిలర్‌, కాంగ్రెస్‌ నాయకుడు శేఖర్‌ కార్యాలయానికి వచ్చి రిటర్నింగ్‌ అధికారి బల్లపై ఉన్న బీ-ఫారాన్ని చించివేశారు. బీ-ఫారాం జిరాక్స్‌ ప్రతిని పరిగణనలోకి తీసుకున్నారు.


బరిలో 13,056 మంది

పురపాలక ఎన్నికల్లో ఈ నెల 22న ఎన్నికలు జరిగే 120 పురపాలక సంఘాలు, 9 కార్పొరేషన్లలోని 3052 వార్డులకు 13,036 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.