close

ప్రధానాంశాలు

నేర చరిత్రను చెప్పాల్సిందే

అభ్యర్థుల్ని ఎంపిక చేశాక 48 గంటల్లోనే అది పూర్తికావాలి
వారిపై ఉన్న కేసుల్ని పార్టీలు వెల్లడించాలి
సచ్చరితులకు ఎందుకు టికెట్లు ఇవ్వలేదో చెప్పాలి
వెబ్‌సైట్‌, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కల్పించాలి
సుప్రీంకోర్టు కీలక ఆదేశం

దిల్లీ: రాజకీయాల్లో నేర చరితులకు సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పు వెలువరించింది. ప్రాంతీయ, జాతీయ స్థాయి పార్టీలన్నీ తమతమ అభ్యర్థులపై పెండింగులో ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను ప్రచారంలోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అధికారిక వెబ్‌సైట్లలో, సామాజిక మాధ్యమాల్లో వివరాలను అందుబాటులో ఉంచాలని జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌, జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. 2018 సెప్టెంబరులోనే సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వెలువడినా వాటిని అభ్యర్థులు పాటించకపోవడాన్ని కోర్టు ధిక్కరణగా భావించాలని దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం గురువారం ఆదేశాలు వెలువరించింది.

ఆదేశాల అమలుపై ఈసీకి వివరాలు ఇవ్వాలి
‘‘క్రిమినల్‌ కేసులున్నవారిని అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేశారు? నేర చరిత్ర లేనివారికి టికెట్లు ఎందుకు ఇవ్వలేదు?.. అనే కారణాలను రాజకీయ పార్టీలు బయటపెట్టాలి. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా, లేదా నామినేషన్లు ప్రారంభయ్యే తేదీకి కనీసం రెండు వారాల ముందు (ఏది ముందైతే అది) ఈ వివరాలు వెల్లడించాలి. సంబంధిత అభ్యర్థి ఎన్నికైన 72 గంటల్లోగా- ఈ ఆదేశాల అమలుపై ఎన్నికల సంఘానికి ఆయా పార్టీలు వివరాలు సమర్పించాలి. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ సహా పార్టీపరమైన సామాజిక మాధ్యమాల్లో, ఒక స్థానిక భాషా పత్రికలో, ఒక జాతీయ పత్రికలో వివరాలు ప్రచురించాలి. క్రిమినల్‌ కేసులు పెండింగులో ఉన్నా ఒక అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేశారో చెప్పేటప్పుడు కేవలం విజయావకాశాలే కాకుండా... వారి విద్యార్హతలు, సాధించిన విజయాలు, ప్రతిభాపాటవాల ప్రస్తావన తప్పకుండా ఉండాలి. గత నాలుగు సార్వత్రిక ఎన్నికల నుంచి రాజకీయాల్లో నేరచరితుల శాతం ప్రమాదకర రీతిలో పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. మా ముందున్న గణాంకాలే దీనిని చాటుతున్నాయి. క్రిమినల్‌ కేసుల్ని ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఎందుకు పెద్దపీట వేయాల్సి వస్తోందనే వివరణను రాజకీయ పార్టీలు ఇవ్వడం లేదు. వివరాలు సమర్పించడంలో ఏ పార్టీ అయినా విఫలమైతే దానిని న్యాయస్థాన ధిక్కరణగా భావించి, సుప్రీంకోర్టు దృష్టికి ఈసీ తీసుకురావాలి’’ అని ధర్మాసనం ఆదేశించింది.

పౌరులకు సమాచారం తెలియడం లేదు
ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు అభ్యర్థులందరూ తమ నేర చరిత్రను ఈసీకి వెల్లడించాలంటూ 2018 సెప్టెంబరులోనే ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా అభిప్రాయపడిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. దేశ రాజకీయాలు నేరమయం కావడం పెరిగిపోతున్నా ఆ సమాచారం పౌరులకు తెలియడం లేదంది.


 

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది
అభ్యర్థుల నేర చరితను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. ఓటు వేసే ముందు వీటన్నింటినీ ఓటర్లు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోగలుగుతారు.

- నళిన్‌ కోహ్లి, భాజపా అధికార ప్రతినిధి


 భాజపా బుట్టదాఖలు చేస్తోంది
నేరమయ రాజకీయాల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను భాజపా బుట్టదాఖలు చేస్తోంది. మైనింగ్‌ కేసులున్న నేతను తాజాగా కర్ణాటకలో ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకోవడం దీనికి ప్రబల ఉదాహరణ. దీనిపై ప్రధానికి, కర్ణాటక ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తుందా?

- రణదీప్‌ సూర్జేవాలా, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.