close

ప్రధానాంశాలు

దేశంలో జాతీయ పార్టీల్లేవు

దేశంలో ఉన్నవి చిన్న, పెద్ద ప్రాంతీయ పార్టీలే
మేం ఇచ్చేవాళ్లం.. మీరు తీసుకొనేవాళ్లన్న కేంద్ర అహంకార వైఖరి నచ్చడంలేదు
కేంద్రంలో పాత్రపై అవకాశం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటాం
ముస్లింలను విస్మరించినందుకే సీఏఏని వ్యతిరేకించాం
టైమ్స్‌ నౌ సమ్మిట్‌లో కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
ఈనాడు - దిల్లీ

ప్రస్తుతం దేశంలో చిన్నా, పెద్ద ప్రాంతీయ పార్టీలు తప్ప జాతీయ పార్టీలు లేవని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.టి.రామారావు పేర్కొన్నారు. దక్షిణాదిలో పెద్దగా ఉనికే లేని భాజపాను జాతీయ పార్టీగా చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు. మేం ఇచ్చే స్థానంలో ఉన్నాం, మీరు తీసుకొనే స్థితిలో ఉన్నారన్నట్లు రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న అహంకార వైఖరి తమకు నచ్చడంలేదన్నారు. వాస్తవానికి తెలంగాణకు కేంద్రం ఇచ్చేదాని కంటే కేంద్ర ఖజానాకు తాము ఇచ్చేదే ఎక్కువుందని వివరించారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందన్న వాస్తవాన్ని కేంద్రం గ్రహించాలని హితవుపలికారు. పెద్దనోట్ల రద్దును సమర్థించి తప్పు చేశామని, అందుకు తర్వాత పశ్చాత్తాపం పడ్డామని పేర్కొన్నారు. ఆ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. ప్రముఖ జాతీయ టీవీ న్యూస్‌ ఛానల్‌ టైమ్స్‌ నౌ ఇక్కడ నిర్వహిస్తున్న సదస్సులో ‘దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర’ అన్న అంశంపై కేటీఆర్‌ మాట్లాడారు. సంధానకర్తతోపాటు, సభికులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

ఒక్కోసారి పశ్చాత్తాప్పడుతుంటామని అన్నారు. అలాంటి సందర్భాలున్నాయా?
మేం పెద్దనోట్ల రద్దుకు మద్దతు పలికాం. దానిపై అసెంబ్లీలో చర్చించాం. మా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి మాట్లాడారు. అప్పుడు ప్రధానమంత్రి మాట్లాడుతూ మేం సంపూర్ణ క్రాంతివైపు తీసుకెళ్తున్నాం అని చెప్పారు. అందువల్ల మేం ఆయన మాటను నమ్మి మద్దతు పలికాం. కానీ ఇప్పుడు మరో ప్రశ్నకు తావులేకుండా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాం. ఆ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి భారీ విఘాతం కల్గించింది. ఈరోజు వృద్ధిరేటు 5.5 నుంచి దిగజారి 3-4% వద్ద ఊగిసలాడటానికి కచ్చితంగా పెద్ద నోట్ల రద్దు ఎంతో కొంత కారణమైంది. 

కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి
రాష్ట్రాలు కష్టపడి అభివృద్ధి పథంలో పురోగమించే వాతావరణాన్ని సృష్టించడం వరకే కేంద్రం పరిమితమైతే రాష్ట్రాలు, దేశం బలంగా ఉంటాయి. బాగా పనిచేయగలుగుతాం. అలా కాకుండా రాష్ట్రాలను నిర్దేశిస్తూ, కేంద్రంలో అధికారంలో ఉన్న వారి భావజాలం ఆధారంగా వివిధ అంశాలను రాష్ట్రాల మీద రుద్దడం ప్రారంభిస్తే అది దేశానికి ఏమాత్రం మేలుచేయదు.

ప్రస్తుతం రాష్ట్రాలకు అనువైన వాతావరణ కల్పన జరుగుతోందా
అంతిమంగా దేన్నయినా అమలు చేయాల్సింది రాష్ట్రాలే. నేను తెలంగాణలో పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ, చేనేత, జౌళి శాఖలు చూస్తున్నా. ఈ శాఖల విషయంలో భారత ప్రభుత్వం విస్తృత స్థాయి విధానాల రూపకల్పన మాత్రమే చేస్తుంది. అంతిమంగా వాటిని కార్యాచరణలో పెట్టేలా పనిచేయాల్సింది రాష్ట్రాలే. మేకిన్‌ ఇండియా నినాదం కేంద్రానిదైనా పనిచేయాల్సింది రాష్ట్రాలే. అనుమతులు, విద్యుత్తు, భూమి, నీళ్లు, ప్రోత్సాహకాలు అన్నీ రాష్ట్రాలే ఇవ్వాలి. అందుకే రాష్ట్రాలు ఎంత బలంగా ఉంటే దేశం అంత బలంగా తయారవుతుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నిరంతరం గుర్తుంచుకోవాలి.

రాష్ట్రాలకు నిధులు విడుదల విషయంలో కేంద్ర ధోరణిపై ఏమంటారు
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను తక్కువచేసి మాట్లాడే విధానం మాకు నచ్చలేదు. పార్లమెంటులో ఎవరో లేచి నిలబడి మేం రాష్ట్రానికి రూ.85 వేల కోట్లు ఇచ్చామని ప్రకటిస్తుంటారు. అదే సమయంలో నేను ఒకటి అడుగుతున్నా.  ఒకవేళ రాష్ట్రాలు దిల్లీలోని కేంద్ర ఖజానాకు పన్నుల రూపంలో చెల్లింపులు చేయలేకపోతే వాళ్లకు డబ్బెక్కడి నుంచి వస్తుంది? తెలంగాణ గత అయిదేళ్లలో పన్నుల రూపంలో భారత ప్రభుత్వానికి రూ.2.72 లక్షల కోట్లు సమకూర్చింది. అందుకు ప్రతిఫలంగా మేం పొందింది రూ.1.15 లక్షల కోట్లు మాత్రమే. మేం ఇచ్చేవాళ్లం, మీరు తీసుకొనేవాళ్లు అన్నట్లు దిల్లీలో ఉన్నవారు వ్యవహరిస్తే... మేం మీకంటే ఎక్కువ ఇచ్చాం, మాకు మీరేం ఇచ్చారు అని అడిగే పూర్తి హక్కు మాకూ ఉంటుంది. అందువల్ల మీకు చాలా ఇచ్చాం అన్న మాట కేంద్రం నుంచి వినాలనుకోవడంలేదు. మేమే గొప్ప అన్నట్లు కేంద్రం చేసే వ్యాఖ్యలు, అహంకారపూరిత వ్యవహారం మేలు చేయదు.మేం పన్నుల్లో న్యాయబద్ధమైన వాటాకోసం డిమాండ్‌ చేస్తున్నాం.

రాజకీయ శత్రుత్వాల గురించి ఏం  చెబుతారు
రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నా పక్కపార్టీ వ్యక్తిని శత్రువుగా భావిస్తే అది వారి అపరిపక్వతే అవుతుంది. నేను భాజపాను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తాను. వారితో మాకు వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు. కాంగ్రెస్‌తోనూ అంతే. ఎన్నికల సమయంలో మేం రాజకీయ ప్రకటనలు చేస్తాం, మాట్లాడతాం. కొన్నిసార్లు తర్వాత పశ్చాత్తాప పడుతుంటాం కూడా.

మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంవల్ల రాజకీయ ప్రత్యర్థులు మిమ్మల్ని నమ్మలేని మిత్రపక్షంగా చెబుతుంటాయి కదా?
ఒకమాట చెబుతా. ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ వచ్చి మమ్మల్ని భాజపాకు బి టీం అని ఆరోపిస్తుంటారు. మళ్లీ మోదీ వచ్చి మాది కాంగ్రెస్‌ బి టీం అంటారు. మేం ఏ పార్టీకీ బి టీం కాదు... తెలంగాణ ప్రజల ఎ టీం. మేం భావజాల పరంగా కాంగ్రెస్‌ పక్షానకానీ, భాజపా పక్షానకానీ లేం. నలుపు, తెలుపే ప్రపంచం కాదు. కాంగ్రెస్‌, భాజపా మధ్య టాస్‌ వేసినట్లు ఉండదు. మీరు దిల్లీతోపాటు మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను చూస్తే ప్రాంతీయ పార్టీలు నానాటికీ బలంగా మారుతున్నాయి. అందువల్ల ఈపక్షానో ఆపక్షానో లేమని విమర్శించడం అంటే మాతోపాటు, తెలంగాణ ప్రజల తెలివితేటలను అవమానించడమే.

జాతీయ ప్రత్యామ్నాయం ఉద్భవిస్తున్నప్పుడు మీరు ఏవైపు ఉన్నారన్నది ఎవ్వరికీ తెలియదు కదా
సమయం వచ్చినప్పుడు అంతా స్పష్టంగా తెలిసివస్తుంది. ఒక్కటి మాత్రం నిజం. గత 75 ఏళ్లలో జాతీయ పార్టీలుగా చెప్పుకొనే రెండు పార్టీలు దేశానికి నష్టం చేకూర్చాయి. నన్ను అడిగితే ఆ రెండు పార్టీలు విఫలమయ్యాయి. అందువల్ల మరిన్ని ప్రత్యామ్నాయాలవైపు చూడాల్సిన సమయం వస్తుందనుకుంటున్నా.

దీన్ని బట్టి తెలంగాణ ముఖ్యమంత్రి ఏదో రోజు కేంద్రంలోకి వస్తారనుకోవచ్చా
రేపు ఏం జరుగుతుందో ఎవరుచూశారు? రేపు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు.

కాంగ్రెస్‌ మద్దతు తీసుకోవాల్సిన అవసరం వస్తే  మీరు ఓపెన్‌గా తీసుకుంటారా
మనం 2020లో కూర్చొని 2022, 2023 గురించి మాట్లాడుకుంటూ ఊహాజనితమైన ప్రశ్నలకు ఊహాజనిత జవాబులు ఇవ్వడం సరికాదు. సమయం వచ్చినప్పుడు ఏం చేయాలన్నది నిర్ణయించుకుంటాం. ప్రస్తుత వాస్తవం ఏమంటే... వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న ఎన్నికల్లో దేశంలోని పెద్దపార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్నారు. అందువల్ల మున్ముందు దేశ ప్రజల ఆలోచన ఎలా రూపుదిద్దుకుంటుందో చూద్దాం.

సీఏఏపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను పార్టీగా, ప్రభుత్వంగా మీరెలా చూస్తారు
దీనికంటే ముందు కేంద్ర ప్రభుత్వం ఇంకా చాలా గంభీరమైన విషయాలపై దృష్టిసారించి పరిష్కరించి ఉండాల్సింది. అందుకే  పార్లమెంటుకు సీఏఏ బిల్లు తెచ్చినప్పుడు మేం నిర్ద్వంద్వంగా తిరస్కరించి వ్యతిరేకంగా ఓటేశాం.

ఆర్టికల్‌ 370 రద్దుకు మద్దతు పలికిన మీరు సీఏఏని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
ఆ రెండూ ఒక్కటికాదు. పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఉద్దేశపూర్వకంగా ముస్లిం మతాన్ని విస్మరించారు. అందుకే మేం వ్యతిరేకించాం.

దిల్లీలో కాలుష్యం కోణంలో చూసినప్పుడు హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా పరిగణించడానికి ఇదే మంచి తరుణం అనిపిస్తోంది. మీరేమంటారు
హైదరాబాద్‌లాంటి నగరాలు దిల్లీకి ఎంతో నేర్పుతున్నాయి. గత అయిదేళ్లు వరుసగా ఉత్తమ జీవన ప్రమాణాలున్న నగరంగా హైదరాబాద్‌ ర్యాంకులు గెలుచుకొంది. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ప్రకటించడాన్ని అక్కడి ప్రజలు స్వాగతిస్తారని నేను అనుకోవడంలేదు. ఆ రకంగా చూస్తే కేజ్రీవాల్‌ కూడా అంగీకరించరనుకుంటా.

సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తారా?
సీఏఏ విషయంలో రాష్ట్రాలు ఎలా ముందుకెళ్లాలన్నదానిపై ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సర్క్యులర్‌కానీ, మార్గదర్శకాలుకానీ జారీచేయలేదు. కేంద్రం నుంచి ఏదైనా వస్తే మేం కేబినెట్‌లో మాట్లాడుకొని మా సొంత వ్యూహంతో ముందుకొస్తాం.

కేంద్రానికి మీరు స్థూలంగా ఏం చెప్పదలచుకున్నారు?

ప్రధానమంత్రి సహకార పూర్వక సమాఖ్య వ్యవస్థ, టీం ఇండియా గురించి మాట్లాడేటప్పుడు అది కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపాలి. కేంద్ర ప్రభుత్వానికి విధానాల గురించి సిఫార్సు చేసే నీతి ఆయోగ్‌ తెలంగాణలో అమలు చేస్తున్న మిషన్‌ భగీరథకు కేంద్రం రూ.19వేల కోట్లు ఇవ్వాలని చెబితే చివరకు మాకు వచ్చింది సున్నా. మిషన్‌ కాకతీయకు రూ.5వేల కోట్లు ఇవ్వాలని చెప్పినా పైసా రాలేదు. ఈ సహకారపూర్వక సమాఖ్య వ్యవస్థ, టీం ఇండియా అన్నవి మాటలకే పరిమితం అయితే దానివల్ల దేశానికి ఏమాత్రం మేలు చేయదు. ఈ రెండు అంశాలను కేంద్రం నిజంగా పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రాలకు పన్నుల వాటా పెంచాలి. ఆర్థికసంఘం సిఫార్సులమేరకు ఇప్పుడు దాన్ని 42 నుంచి 41 శాతానికి తగ్గించారు. అదీగాక ఎఫ్‌ఆర్‌బీఎంపై పరిమితులు విధించారు. మౌలికవసతుల కల్పనకు అనువైన మూలధన సమీకరణ కోసం రుణ సమీకరణకు వీలులేకుండా చేశారు. ఇలాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం సరళీకృతంగా వ్యవహరించాలి. ఆర్థిక సంస్కరణల విషయంలో మరింత ధైర్యం ప్రదర్శించాలి. సమాఖ్య వ్యవస్థ అంటే స్వయంప్రతిపత్తి మాత్రమే కాదు. ఆర్థికవనరుల పంపిణీలో కూడా దాన్ని చూపాలి. అది జరిగినప్పుడే ఈ దేశం నిజంగా సౌభాగ్యవంతమవుతుంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.