close

ప్రధానాంశాలు

గోదావరి జలాల్ని 100% వాడాలి

530 టీఎంసీలను సద్వినియోగం చేసుకోవాలి
చివరి ఆయకట్టుకూ సాగునీరు అందాలి
ఎత్తిపోతలు, సాంకేతికతపై అవగాహన అవసరం
ఇంజినీరింగ్‌ విభాగాలను పునర్‌ వ్యవస్థీకరించాలి
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో సీఎం కేసీఆర్‌

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌ - మహదేవ్‌పూర్‌, కాళేశ్వరం, న్యూస్‌టుడే: గోదావరి జలాలను నూటికి నూరు శాతం సద్వినియోగం చేసుకోవాలని.. మొత్తం 530 టీఎంసీలు వాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. వచ్చే వర్షాకాలంలో వరద నీరు ఉద్ధృతంగా వచ్చి చేరుతుందని.. వృథా కాకుండా ఎప్పటికప్పుడు లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీ నుంచి తోడుకోవాలని, ఇందు కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఇంజినీర్లకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం సందర్శించారు. కరీంనగర్‌ నుంచి హెలికాప్టర్‌లో కాళేశ్వరం వచ్చారు. అక్కడి త్రివేణి సంగమం, పుష్కర ఘాట్ల వద్ద పూజలు చేశారు. పట్టు వస్త్రాలు, పూలు, నాణేలు నీటిలో వదిలారు. కాళేశ్వరం ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హెలిక్టాపర్‌ ద్వారా మేడిగడ్డ బ్యారేజీ, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులను విహంగ వీక్షణం చేశారు. మేడిగడ్డ నుంచి లక్ష్మీ బ్యారేజీ వరకు బస్సులో వెళ్లారు. బ్యారేజీ నిండుకుండలా ఉండటంతో కనురెప్పలు వాల్చకుండా చూస్తూ పరవశించిపోయారు. ప్రస్తుత నీటి నిల్వ, ఎంత మేర బ్యాక్‌ వాటర్‌ ఉందో ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ఎల్లంపల్లి నుంచి దుమ్ముగూడెం వరకు నిరంతరం నదిలో 100 టీఎంసీలు నిల్వ ఉంచాలి.  మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి, మిడ్‌మానేర్‌ వరకు ఎప్పటికప్పుడు పరిస్థితి తెలిసేలా ఓ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. చివరి ఆయకట్టుకూ నీరు అందేలా అధికారుల పర్యవేక్షణ ఉండాలి. అవసరమైతే వాకీటాకీలను వాడాలి. ఎన్ని నీళ్లు ఎత్తిపోయాలి, ఎప్పుడు ఆపాలి, నీటి పంపిణీ, సాంకేతికతపై కాళేశ్వరం బృందం అవగాహన కలిగి ఉండాలి. ఈఎన్‌సీలు ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో పని చేయాలి. లక్ష్మీ బ్యారేజీ కింద ముంపు ఎంత మేర ఉందో గుర్తించాలి. భూ సేకరణ చేపట్టి.. రైతులకు నష్టపరిహారం అందజేయాలి. రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేందుకు కార్యాచరణను సిద్ధం చేయాలి. సాగునీటి కాలువలకు మే నెలాఖరులోగా మరమ్మతులు పూర్తి చేయాలి’’ అని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌లకు సీఎం వివరించారు. అంతకుముందు కాళేశ్వరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో కేసీఆర్‌ మాట్లాడారు. ఆలయ రూపురేఖలు పూర్తిస్థాయిలో మార్చాలని.. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

పునర్‌వ్యవస్థీకరణపై సుదీర్ఘ చర్చ
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా.. సాగునీటి లక్ష్యాల సాధనకు నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్‌ విభాగాలు పునర్‌ వ్యవస్థీకరించాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కాళేశ్వరం పర్యటన అనంతరం గురువారం సాయంత్రం ఆయన కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరానికి సంబంధించిన అన్ని పనులు వచ్చే ఖరీఫ్‌ నాటికి పూర్తి చేయడంపై, నీటిపారుదల శాఖ పునర్‌ వ్యవస్థీకరణపైనా సుదీర్ఘంగా చర్చించారు. మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, నీటిపారుదల ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, కాళేశ్వరం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖలో వేర్వేరు విభాగాలుగా కాకుండా అన్ని ఇంజినీరింగ్‌ శాఖలు ఒకే చీఫ్‌ ఇంజినీర్‌ కింద పనిచేసేలా ఉండాలని.. దీనికి తగ్గట్టుగా ప్రణాళికను వీలైనంత త్వరగా సిద్ధంచేయాలన్నారు. మొత్తం 11 సర్కిళ్లను చీఫ్‌ ఇంజినీర్ల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఒక్కో సర్కిల్‌కు ఒక్కో సీఈని అధిపతిగా నియమించాలని.. భారీ, మధ్యతరహా, చిన్ననీటి వనరుల అధికారులంతా ఆయన పరిధిలో పనిచేయాలన్నారు. జూన్‌ నెలాఖరులోగా నీటిపారుదల ఇంజినీరింగ్‌ విభాగాలలో ఖాళీలు భర్తీ చేయాలని స్పష్టంచేశారు.

కరీంనగర్‌, నిజామాబాద్‌లలో కొత్త కలెక్టరేట్లు
ఈ సందర్భంగా కరీంనగర్‌ కలెక్టర్‌ కార్యాలయం గురించి సీఎం చర్చించారు. కలెక్టరేట్‌ మరీ చిన్నదిగా, ఇరుగ్గా ఉందన్నారు. వెంటనే దీని స్థానంలో కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌ సైతం చిన్నగా ఉందని.. అక్కడా కొత్త భవన నిర్మాణం చేపట్టాలని ఆయన సీఎస్‌కు సూచించారు.


సమర్థులైన నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు

జిల్లాల్లో చురుగ్గా, సమర్థంగా, అంకితభావంతో పనిచేసే తెరాస నాయకులకు రాష్ట్ర స్థాయి పదవులు ఇస్తామని, పార్టీ బలోపేతానికి వారి సేవలను వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. పదవులు రాలేదని నైరాశ్యం వద్దని, అందరికీ సర్దుబాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కరీంనగర్‌ పర్యటన సందర్భంగా పార్టీ జిల్లా నేతలు తనను కలిసినప్పుడు సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. పదవులు ప్రధానం కాదని.. పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో విస్తృతస్థాయిలో పదవులు ఉన్నాయని తెలిపారు. తగిన సమయం కోసం నిరీక్షిస్తే ఎమ్మెల్సీ పదవులు సైతం దక్కుతాయన్నారు.


నేను పోలీసునవుతా...

 సీఎంకు ఓ చిన్నారి సమాధానం

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: పెద్దయ్యాక ఏమవుతావని సీఎం అడిగిన ప్రశ్నకు పోలీసు అవుతానని చిన్నారి ఇచ్చిన సమాధానంతో సీఎం చిరునవ్వు చిందించారు. గురువారం సాయంత్రం కరీంనగర్‌ హెలిప్యాడ్‌లో దిగి కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించే సమీక్షకు సీఎం కేసీఆర్‌ వెళ్తుండగా.. కొందరు ఆయనతో ఫొటోలు దిగడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలోనే ఓ జంట తమ కుమార్తెతో రాగా.. సీఎం ఆ చిన్నారిని ఎత్తుకొని ముద్దుచేశారు. ఏం చదువుతున్నావని సీఎం ప్రశ్నించగా, ఎల్‌కేజీ చదువుతున్నానని ఆ చిన్నారి సమాధానం ఇచ్చింది. ‘డాక్టర్‌ అవుతావా, ఇంజినీర్‌ అవుతావా, పోలీసు అవుతావా’ అని సీఎం అడగ్గా.. తాను పోలీసునవుతాని టక్కున సమాధానం ఇచ్చింది. ‘చూడండి.. పోలీసు అవుతుందట’ అంటూ సీఎం నవ్వుకుంటూ పాపను తల్లిదండ్రులకు ఇచ్చి వెళ్లిపోయారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.