close

ప్రధానాంశాలు

నిఘా నేత్రం.. సదా సిద్ధం!

తీవ్ర రోడ్డు ప్రమాదాలపై రోజువారీ విశ్లేషణ
రాష్ట్రవ్యాప్త మరణాలకు కారణాలపై నివేదిక
లోపాలను సవరించేలా నియంత్రణ చర్యలు
డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఆరా
ఈనాడు, హైదరాబాద్‌

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం మన్నెగూడెం శివారులోని కొత్తతండా కూడలి వద్ద డ్రైవర్‌ అంగోతు లచ్చు గత సోమవారం ట్రాక్టర్‌ను నిర్లక్ష్యంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఉపేందర్‌ తలకు తీవ్రగాయాలయ్యాయి. 108 వాహనంలో అతడిని ఖమ్మం ప్రభుత్వ ఆసుత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అదే వాహనంపై ఉన్న మరో మహిళ, ఇద్దరు చిన్నారులు గాయాలతో బయటపడ్డారు. ట్రాక్టర్‌ను డ్రైవర్‌ అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమైనట్లు విశ్లేషణలో తేలింది.

* రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 11న మొత్తం 40 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 17 తీవ్రమైనవి  కాగా.. 20 మంది మృత్యువాత పడ్డారు. 32 మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో సగం మంది శిరస్త్రాణాలు ధరించనందునే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసుల పరిశీలనలో వెల్లడైంది.

రహదారి ప్రమాదాలకు సంబంధించి తెలంగాణ డీజీపీ కార్యాలయంలోని ప్రత్యేక విభాగం రోజువారీ విశ్లేషణలో తేలిన చేదు నిజాల్లో మచ్చుకు ఇవి కొన్ని. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తీవ్ర ప్రమాదాల(ప్రాణాలు కోల్పోతున్నవి)కు కారకులు ఎవరు? ఎలాంటి కారణాలతో మరణాలు సంభవిస్తున్నాయి? అదుపుచేయడం ఎలా?.. అనే అంశాలపై లోతైన పరిశీలన జరుగుతోంది. రోడ్డు ప్రమాదాలు జరిగాక కేసులు నమోదుచేయటం కాకుండా.. కారణాలను ముందుగానే గుర్తించి పరిష్కారాల్ని అన్వేషించడంపై ఈ విభాగం దృష్టిపెడుతోంది. ఎక్కడో ఆసిఫాబాద్‌ జిల్లాలోని కుగ్రామంలో రోడ్డుప్రమాద మరణం సంభవించినా సరే.. డీజీపీ కార్యాలయం ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటోందనే భావన క్షేత్రస్థాయి పోలీస్‌ సిబ్బందిలో కలిగేలా చర్యలు చేపడుతోంది. ప్రతీ ప్రమాద మరణానికి కారణాల్ని సంబంధిత ఎస్‌హెచ్‌వో నుంచి సేకరించి విశ్లేషించే ప్రక్రియను డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అదనపు డీజీపీలు జితేందర్‌(శాంతిభద్రతలు), సందీప్‌శాండిల్య(రోడ్డు భద్రత) రోజువారీ నివేదికల ఆధారంగా ఇతర యంత్రాంగాలను సమన్వయం చేసుకుంటూ ప్రమాదాల్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.

బ్లాక్‌ స్పాట్లలో ఇంజినీరింగ్‌ లోపాల సవరణ
ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్‌ స్పాట్లు 870 ఉన్నట్లు గత ఏడాది అధ్యయనంలో తేలింది. ఈ ప్రాంతాల్లో లోపాల్ని సవరించే విషయంలో అర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, జాతీయ, రాష్ట్ర రహదారుల విభాగాలతో సమన్వయం చేస్తున్నారు. చిన్నచిన్న లోపాలున్న 326 బ్లాక్‌ స్పాట్లపై దృష్టిపెట్టి ఇప్పటికే సరిచేశారు. మిగిలిన వాటిని అధ్యయనం చేస్తూ నిర్మాణ లోపాల్ని సవరించే పనిలో నిమగ్నమయ్యారు.

మరణాల నియంత్రణపైనా దృష్టి
వాస్తవానికి పోలీస్‌శాఖతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు చేపడుతున్న నియంత్రణ చర్యలతో రోడ్డు ప్రమాదాలు ఏటా తగ్గుతున్నాయి. వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాద మరణాలనూ నియంత్రించడంపై డీజీపీ కార్యాలయం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే తాజా ప్రణాళికను అమలుచేస్తోంది. రోజువారీ విశ్లేషణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.