close

ప్రధానాంశాలు

క్రమబద్ధీకరణకు మరో అవకాశం

75 గజాల్లోపు ఇంటి నిర్మాణాలకు అనుమతి అక్కర్లేదు
నిర్మాణ అనుమతి కోసం ఎవరూ లంచం ఇవ్వవద్దు
ఏప్రిల్‌ 2 నుంచి టీఎస్‌-బీపాస్‌ అమలు
పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య బీమా
పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలోని అనధికార లేవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు మరోసారి అవకాశమివ్వాల్సిన అవసరముందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల కొనుగోలుదారులకు నోటీసులివ్వాలని సూచించారు. పట్టణ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య బీమా తప్పనిసరి చేయాలన్నారు. పట్టణ ప్రగతిపై కలెక్టర్లు, పురపాలక అధికారులు దృష్టి కేంద్రీకరించాలన్నారు. నాలుగైదు రోజుల్లో వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇందులో రాజకీయాలు వద్దని చెప్పారు. పురపాలక చట్టం అమల్లో ఎదురయ్యే సవాళ్లను అధికారులు అధిగమించాలని, చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని వివరించారు. శుక్రవారమిక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పురపాలక చట్టం, పట్టణ ప్రగతిపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘పట్టణ ప్రగతిని విజయవంతం చేస్తే తెలంగాణలో పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయి. రాష్ట్రంలో 75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి అనుమతులు అక్కర్లేదు. అనుమతికి పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 2 నుంచి తెలంగాణ బీపాస్‌ అమల్లోకి వస్తుంది. ఇందులో లోటుపాట్లను మార్చిలో పరిశీలించి తుదిరూపు తీసుకురావాలి. టీఎస్‌-బీపాస్‌, మీసేవతో పాటు మరో యాప్‌ను రూపొందిస్తున్నాం. వీటితో పురపాలక అధికారులను కలవాల్సిన అవసరం లేకుండా నిర్మాణ అనుమతి పొందవచ్చు. ఈ దరఖాస్తులపై అధికారులు 21 రోజుల్లో అనుమతివ్వకుంటే జాప్యానికి, తిరస్కరణకు కారణం చెప్పాలి. పురపాలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రజాప్రతినిధులను పురపాలక చట్టం కింద పదవుల నుంచి తొలగించే అధికారం లభించింది. పరిపాలన సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్‌ 33 జిల్లాలు ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందని ఎన్నడూ అనుకోలేదు. నాలుగేళ్లలో ఎన్నో పరిపాలన సంస్కరణలు తీసుకువచ్చాం. అధికారులు ఈ-ఆఫీస్‌ ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా సెక్షన్ల వారీగా దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. పట్టణ ప్రణాళికలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి అత్యుత్తమ పట్టణాలు రూపొందించాలి. ప్రతి మున్సిపాలిటీకి డిజిటల్‌ మ్యాప్‌లను సిద్ధం చేసి మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలి. వేసవిలో తాగునీటి కొరత రానీయకుండా కార్యాచరణ సిద్ధం చేసి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలి. పారిశుద్ధ్య కార్మికుల భద్రత, ఆరోగ్యం గురించి అధికారులు బాధ్యత తీసుకోవాలి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పింఛన్లు మంజూరవుతాయి.’’ అని కేటీఆర్‌ వివరించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.