close

ప్రధానాంశాలు

ఖర్చు బారెడు.. మద్దతు మూరెడు

కేంద్రం ప్రకటిస్తున్న ధర కన్నా చాలా ఎక్కువగా పంట ఉత్పత్తి వ్యయం

ఈనాడు, హైదరాబాద్‌:  పంటలకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకన్నా రాష్ట్రంలో సాగు వ్యయం చాలా ఎక్కువగా ఉందని వ్యవసాయశాఖ అధ్యయనంలో వెల్లడైంది. పంటల ఉత్పత్తి వ్యయానికి, మద్దతు ధరలకు ఏమాత్రం పొంతనే లేదని ప్రకటించింది. విత్తనాలు, డీజిల్‌, కూలీల ఖర్చులు అనేక రెట్లు పెరిగాయి. సాగు వ్యయం అధికమవడం వల్ల పంటల ఉత్పత్తి వ్యయం ఆకాశాన్నంటుతోంది. కూలీలు దొరకడం కష్టమైపోయింది. వాతావరణ మార్పులు, మార్కెట్‌ ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా వ్యవసాయం అస్థిరంగా మారింది. వీటిని దృష్టిలో పెట్టుకుని మద్దతు ధరలు ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సిఫార్సు చేసింది. ప్రతి పంటకు ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నందున వచ్చే ఏడాది మద్దతు ధరలు పెంచాలని ‘జాతీయ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌(సీఏసీపీ)కు రాష్ట్ర వ్యవసాయశాఖ సిఫార్సు చేసింది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా సాగు వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి రైతులకు ఇవ్వాలని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది(2020-21)లో ఖరీఫ్‌, యాసంగి సీజన్లలో సాగుచేసే పంటలకు ఇవ్వాల్సిన మద్దతు ధరలపై సీఏసీపీ శుక్రవారం విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయశాఖలు, రైతులు, శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించింది. సీఏసీపీ ఛైర్మన్‌ విజయ్‌పాల్‌శర్మ అధ్యక్షత వహించారు. దక్షిణాదిలో అధికంగా సాగవుతున్న పసుపు, మిరప, ఆయిల్‌పాం పంటలకు తప్పనిసరిగా మద్దతు ధర ప్రకటించాలని తెలంగాణ వ్యవసాయ శాఖతో పాటు రాష్ట్ర రైతు సంఘం నేత జైపాల్‌రెడ్డి సీఏసీపీని కోరారు. ఈ పంటలకు మద్దతు ధరలు ప్రకటించకపోవడంతో వ్యాపారులు ఇచ్చిందే ధర అన్నట్లుగా మారి రైతులు నష్టపోతున్నారని రాష్ట్రం స్పష్టం చేసింది. మద్దతు ధరల నిర్ణయంలో అన్ని రకాల ఖర్చుల్ని పరిగణనలోకి తీసుకుంటామని విజయ్‌పాల్‌ శర్మ చెప్పారు. పంట చేతికొచ్చే సమయం నుంచే సేకరణ ప్రారంభించాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉందన్నారు. ‘‘దక్షిణాదిలో సాగు వ్యయం ఎక్కువ. రోజు కూలి రేటు కేరళలో రూ.850-రూ.1,000 ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో సీజన్‌లో రూ.600-రూ.800 చెల్లించాల్సి వస్తోంది. పంజాబ్‌లో ఉత్పత్తి ఖర్చు తక్కువ. కానీ మద్దతు ధర దేశమంతా ఒకటే. ఇది పంజాబ్‌కు లాభమే. మనకు నష్టం’’ అని గణాంక శాస్త్రవేత్త ఆల్దాస్‌ జానయ్య చెప్పారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించాలని పలువురు రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

ఇదిగో రైతులిలా నష్టపోతున్నారు...
* ఉదాహరణకు రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగయిన వరి, పత్తి పంటలపై నష్టం అధికంగా వస్తోంది. క్వింటా పత్తి పంటకు ఈ ఏడాది మద్దతు ధర రూ.5,550. పంటలో తేమ ఉందనే సాకుతో వ్యాపారులు అదీ ఇవ్వడం లేదు. వచ్చే జూన్‌ నుంచి ప్రారంభమయ్యే కొత్త సీజన్‌లో క్వింటా పత్తి ఉత్పత్తి వ్యయం రూ.10,043 అవుతుందని అంచనా. ఈ ఏడాది రూ.9 వేల వరకూ ఉంది. ఈ లెక్కన ఈ ఏడాది మద్దతు ధర రూ.5,550 ఇస్తున్నా క్వింటాకు సగటున రూ.3,500 చొప్పున రైతు నష్టపోతున్నారని వ్యవసాయశాఖ లెక్కలే వివరిస్తున్నాయి.
* ఎ గ్రేడ్‌  వరి ధాన్యానికి ఇస్తున్న మద్దతు ధర రూ.1,835 మాత్రమే. హెక్టారు విస్తీర్ణంలో వరి సాగుచేయాలంటే రూ.87,059 ఖర్చవుతుంది. ఇందులో కూలీల వ్యయమే రూ.50,563.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.