close

ప్రధానాంశాలు

మే నెల 22 వరకు కరోనా కష్టాలు

ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి
దేశంలో ప్రకృతి విపత్తులకు అవకాశం
రాష్ట ఆర్థిక రంగంలో ఒడుదొడుకులు
విద్యా శాఖలో కుంభకోణాలు
అనుకున్నవన్నీ సీఎం పూర్తి చేస్తారు
శ్రీశార్వరి పంచాంగ పఠనంలో బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి  

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘వికారి నామ సంవత్సరం కరోనాను ఇచ్చిపోయింది. శార్వరి నామ సంవత్సరంలో కాల సర్పయోగం ఆరుసార్లు కలగడం వల్ల విపత్తులు సంభవిస్తాయి. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం  ఉంటుంది’’ అని పంచాంగకర్త బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి తెలిపారు. మే 22 వరకు ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. చండీయాగాలు, చండీ హోమాలు, పారాయణాలు చేయడం ద్వారా మహమ్మారి బారి నుంచి బయటపడవచ్చన్నారు. సీఎం కేసీఆర్‌ తాను అనుకున్న కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయంగా పూర్తి చేస్తారన్నారు. కొత్త ఏడాది రాష్ట్రం ఆర్థిక ఒడుదొడుకులను ఎదుర్కొంటుందని, ఆర్థిక మంత్రి పని కత్తిమీద సాములా ఉంటుందని జోస్యం చెప్పారు. దేశంలో తరచూ విపత్తులు సంభవించే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖలో కుంభకోణాలు వెలుగుచూస్తాయన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్‌లోని దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉగాది వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ.రమణాచారి, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, అదనపు కమిషనర్‌ శ్రీనివాసరావు, వేద పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశార్వరి నామ సంవత్సర పంచాంగాన్ని వారు ఆవిష్కరించారు. సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాగ పఠనం చేశారు. ఆరోగ్యశాఖ గురించి చెబుతూ కరోనా ప్రభావాన్ని ఆయన ప్రస్తావించారు. దీని ప్రభావం మే నెల వరకు ఉంటుందన్నారు.

పరిపాలన దక్షతతో సీఎం మెప్పిస్తారు
‘‘తెలంగాణ ఆవిర్భావం నుంచి అభివృద్ధే ధ్యేయంగా, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం నిరంతరాయంగా శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌ శార్వరి నామ సంవత్సరంలోనూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తారు. రాజు బుధుడు కావడం వల్ల సీఎం కేసీఆర్‌ తన పరిపాలన దక్షతతో ప్రజలను మెప్పిస్తారు. ముఖ్యమంత్రిది కర్కాటక రాశి. ఈ సంవత్సరం వ్యక్తిగతంగా ఆయనకు శుభప్రదం. అనుకున్న కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై...
స్థిరాస్తి రంగం జోరు కొనసాగుతుంది. రాష్ట్ర ఆదాయం, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అయినా ఒడుదొడుకులు తప్పవు. వాటిని ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుంది. దాని ఫలితాలు రాష్ట్ర రైతాంగానికి అందుతాయి.

ఆదాయం 105..వ్యయం 96
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తూ సుపరిపాలన అందిస్తాయి. దేశ, రాష్ట్రాభివృద్ధి బ్రహ్మండంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సర్వాదాయం 105, సర్వ వ్యయం 96. శేషం 9 రావడం శుభసూచకం.

భూకంపాలు..వరదలు
దేశంలో కొన్ని విపత్తులు సంభవించవచ్చు. 2020 జూన్‌, జూలై నెలల్లో కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో అధిక వర్షాలు కురిసి వరదలు వస్తాయి.

ధరలు..ఆర్థిక మోసాలపై
దేశంలో ధరలు పెరిగే అవకాశం ఉంది. పెట్రోలు, డీజిల్‌ ధరలు తారస్థాయికి చేరుకుంటాయి. ఆర్థిక మోసాలు పెరిగే అవకాశం ఉంది’’ అని పంచాగకర్త విశ్లేషించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ..కొత్త సంవత్సరం అన్నీ శుభాలే జరగాలని ఆకాంక్షించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.