close

ప్రధానాంశాలు

లాక్‌డౌన్‌ పొడిగింపే శరణ్యం

రెండువారాలు పెంచాలని ప్రధాన మంత్రిని కోరుతున్నా
ప్రజలను బతికించాలంటే మరో మార్గం లేదు
ఆర్థిక నష్టాలను తర్వాతైనా పూడ్చుకోవచ్చు
వైద్యసిబ్బందికి వేతనంలో పదిశాతం ప్రోత్సాహకం
జీహెచ్‌ఎంసీ, జలమండలి ఉద్యోగులకు రూ. 7,500
పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బందికి రూ. 5,000
దుర్మార్గంగా దుష్ప్రచారం చేసే వారిని కఠినంగా శిక్షిస్తాం
ముఖ్యమంత్రి కేసీఆర్‌

బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు సంస్థ భారత్‌లో జూన్‌ మూడు వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని అభిప్రాయపడింది. మనలాంటి దేశానికి మరో ప్రత్యామ్నాయం లేదు. అదే సరైన ఆయుధం. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలతో పోలిస్తే మనది సంతోకర పరిస్థితి. లాక్‌డౌన్‌ను ఇప్పుడే ఎత్తివేయవద్దనేది నా అభిప్రాయం. కేంద్రంలో ప్రధాని దీనిపై చర్చిస్తున్నారు. సీఎంల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఆహార నిల్వలు, ఆర్థిక స్థితి, ప్రస్తుత పరిస్థితిని ఎలా అధిగమించాలి. ఇంకా ఎంత కాలం లాక్‌డౌన్‌ కొనసాగించాలి అని ఆలోచిస్తున్నారు. మనిషి జీవితంలో ఇలాంటి పరిస్థితి రాలేదు. బయటికి రానీయడం లేదని ఎవరూ బాధపడవద్దు.


స్వీపర్‌ నుంచి  వైద్యుల వరకు పాదాభివందనం

కష్టంలో కన్నీళ్లు పంచుకునే వారే ఇప్పుడు కావాలి. ఒకరికొకరు ధైర్యం, ప్రోత్సాహం ఇచ్చే వాళ్లు అవసరం. స్వీపర్‌ మొదలుకొని వైద్యులు, నర్సులు, పారామెడికల్‌, పారిశుద్ధ్య సిబ్బంది అందరికీ పాదాభివందనం. పొగిడే నోళ్లు ఇప్పుడు వైద్య సిబ్బందికి కావాలి. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి కోసం 8 ఆసుపత్రులు నోటిఫై చేశాం. 25 వేల మంది అదనపు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. తమకూ వైరస్‌ సోకవచ్చని తెలిసినా వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్నారు. వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. పోలీసులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బాగా పనిచేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు. ఇంటెలిజెన్స్‌ బృందాలు చాలా సమర్థంగా పనిచేశారు. మర్కజ్‌ కేసులను చాలా వరకు వాళ్లే గుర్తించారు. వారికీ ధన్యవాదాలు.

- సీఎం కేసీఆర్‌


ఈనాడు, హైదరాబాద్‌: అత్యంత ప్రమాదకరమైన కరోనా వ్యాధిని దేశంలో పూర్తిగా నియంత్రించేందుకు మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. ప్రజలను బతికించుకోవాలంటే మరో మార్గం లేదని, దీన్ని ఎంత గట్టిగా పాటిస్తే అంత మంచిదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ఆగమవుతామని ఆయన పేర్కొన్నారు. ఆర్థికంగా నష్టపోతే మళ్లీ పూడ్చుకోవచ్చని, ప్రాణాలు పోతే తీసుకురాలేమన్నారు.బతికుంటే బలుసాకు తిని బతకొచ్చన్నారు. రాష్ట్రంలో కరోనా నివారణ కోసం కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి పది శాతం వేతనాలను పెంచుతున్నట్లు సీఎం తెలిపారు. జీహెచ్‌ఎంసీ, ఇతర పారిశుద్ధ్య సిబ్బందికి రూ. 7,500 ఇస్తామన్నారు. కరోనాపై సోమవారం సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.

‘దేశంలోని పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్‌ 14 తర్వాత కూడా లాక్‌డౌన్‌ కొనసాగించాలని కోరుకుంటున్నా. ప్రధానమంత్రి మోదీకి ఇదే చెప్పాను. ఇది ప్రపంచానికి వచ్చిన పీడ. ఒక్క కుటుంబానికో, జాతికో రాలేదు. 22 దేశాలు 100 శాతం లాక్‌డౌన్‌లో ఉన్నాయి. జపాన్‌, సింగపూర్‌, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ, కొలంబియా, అర్జెంటీనా, నేపాల్‌తో పాటు మరిన్ని దేశాలు మన పద్ధతినే అనుసరిస్తున్నాయి. మరో 90 దేశాలు పాక్షికంగా పాటిస్తున్నాయి. ఇవాళ న్యూయార్క్‌ను చూస్తే శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. రెండు లక్షలమందికి పైగా చనిపోతారని అమెరికా అధ్యక్షుడే చెబుతున్నారు. అలాంటి దుఃఖం ఎవరికి రాకూడదు. మనమైతే ఆగమయ్యేవాళ్లం. లాక్‌డౌన్‌, స్వీయ నియంత్రణ వల్లనే భారత, తెలంగాణ సమాజాన్ని బతికించుకున్నాం. అయితే ఆర్థికంగా నష్టపోక తప్పదు. మన రాష్ట్రానికి రోజుకు రూ.400 నుంచి రూ. 430 కోట్ల ఆదాయం రావాలి. లాక్‌డౌన్‌ వల్ల కేవలం రూ. 6 కోట్లు మాత్రమే వచ్చింది. అయినా ప్రజల ప్రాణాలే మనకు ముఖ్యం.

లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే పరిస్థితి ఏంటి?
ఒక వేళ లాక్‌డౌన్‌ సడలిస్తే పరిస్థితి ఏంటి? అది అంత ఆషామాషీ కాదు. మళ్లీ గుంపులు గుంపులుగా రోడ్ల మీదకి జనం వస్తే ఎవరు జవాబుదారీ? మిగతా దేశాలతో పోలిస్తే మన దేశం కొంత సురక్షితంగానే ఉంది. భారత్‌ మంచిగా పనిచేస్తోందని అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలు పేర్కొంటున్నాయి. ఇతర దేశాధినేతలు ప్రశంసించారు. లాక్‌డౌన్‌ లేకపోతే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే వాళ్లం. వేలు, లక్షల సంఖ్యలో చనిపోవడం అనే ఊహే భయంకరంగా ఉంటుంది. మరణం మిగిల్చే విషాదాన్ని దేశం భరించలేదు. యుద్ధం మిగిల్చే విషాదం ఎంత భయంకరంగా ఉంటుందో ఇది కూడా అలాంటిదే.  ప్రధాని మోదీ పిలుపుపై అనేక విమర్శలు చేయడం క్షమించరాని నేరం. సామాజిక మాధ్యమాల్లో జోకులు వేయడం మంచిది కాదు. చిల్లర రాజకీయాలు ప్రచారం చేసే వాళ్లు ఇప్పుడు అవసరం లేదు. దీపారాధన అనేది సంఘీభావ సంకేతం అని నేను అందరికి చెప్పాను. తెలంగాణ ఉద్యమంలో మేము అనేక పిలుపులు ఇచ్చాను. ప్రధానమంత్రి అంటే ఒక వ్యక్తి కాదు-ఒక వ్యవస్థ. ఎంపీల వేతనాల్లో 30 శాతం మోదీ కోత విధించారు. నన్ను ఫోన్‌లో అడిగితే 50 శాతం చేయాలన్నాను.

రాష్ట్రంలో ఔషధాల కొరత లేదు
రాష్ట్రంలో ఔషధాల కొరత లేదు. మా వద్ద 40 వేల పీపీఈ కిట్లున్నాయి. అయిదు లక్షల కిట్లకు ఆర్డర్‌ ఇచ్చాం. మేం నిద్ర లేకుండా పనిచేస్తున్నాం. లోకం ఆగమవుతుంటే చిల్లర వేశాలు వేయడం సరికాదు. అనుచితంగా వ్యవహరిస్తే సరైన సమయంలో సరైన శిక్ష వేస్తాం. దుర్మార్గులకు వదిలిపెట్టం. సంక్షోభ, క్లిష్ట సమయంలో ధైర్యం చెప్పాలి. రాజకీయాలకు బోలెడు సమయం ఉంది. అసత్యాలు ప్రచారం చేసే వారిని వదిలిపెట్టం. చిల్లర రాజకీయాలు, చిల్లర ప్రచారాలు చేసేవాళ్లు అవసరం లేదు. ఈ దుర్మార్గులు కాదు కావాల్సింది. చాలా పాజిటివ్‌గా, సమాజం గురించి బాధ్యత కలిగిన వ్యక్తులు దేశానికి కావాలి. ఇటువంటి పరీక్షా సమయంలోనే అల్పులు, గొప్పవాళ్లు బయటపడతారు. ఓ తల్లి బీడీలు చుట్టే ఆమె.. తాను పొదుపు చేసుకున్న డబ్బులో రూ. 20 వేలు తీసుకొచ్చి సాయం చేసింది. మేడ్చల్‌లో మరో మహిళ..తనకు వచ్చిన బియ్యంలో 22 కిలోలు ఇతరులకు సాయం చేసింది. ఇట్లాంటోళ్లు కావాలి. ఆ తల్లులకు చేతులెత్తి మొక్కుతున్నా. అవకాశం వస్తే పాదపూజ కూడా చేస్తా.  పారిశుద్ధ్యం కోసం మహిళా సర్పంచులు స్వయంగా మిషన్లతో పిచికారి చేస్తున్నారు. తప్పకుండా అందరం చల్లగా బతికితే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అవార్డు కూడా ఇస్తాం. కవులు, గాయకులు ముందుకొచ్చి సమాజానికి మానసిక స్థైర్యం కల్పించాలి

తెలంగాణ కరోనా రహితమయ్యేది
నిజాముద్దీన్‌ ఘటన లేకుంటే తెలంగాణ ఇప్పటికే  కరోనా రహిత రాష్ట్రమయ్యేది. ఇప్పటికే 99.9 శాతం మందిని గుర్తించాం.  సంబంధం లేని వ్యక్తులకు కరోనా సోకే కమ్యూనిటీ ట్రాన్స్‌ మిషన్‌ తెలంగాణలో లేదు  జీహెచ్‌ఎంసీ, పురపాలక సంఘాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య-సపాయి కార్మికుల కోసం రూ. వంద కోట్లు ఇస్తున్నాను. జిల్లాల్లో  ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అనేక మంది శ్రమిస్తున్న వారు ఉన్నారు వారిని సైతం గుర్తిస్తాం.  ప్రైవేట్‌ సంస్థలు జీతాలు ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏంచేయాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రేషన్‌ కార్డు లేని పేదలకు వంద శాతం రేషన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’

కరోనా కట్టడికి మరింత కృషి చేస్తాం
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులకు పదిశాతం బోనస్‌ ప్రకటించడంపై తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారెం రవీందర్‌రెడ్డి, మమతలు, తెలంగాణ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఐకాస నేతలు బరిగెల రమేశ్‌, పుట్ల శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు. బోనస్‌ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు తెలంగాణ వైద్య ఆరోగ్య గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు జూపల్లి రాజేందర్‌ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.


వైద్య ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి కానుక

కరోనా నియంత్రణ చర్యల్లో విశ్రాంతి లేకుండా పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులందరికీ ప్రోత్సాహకం ఇస్తున్నా. రాష్ట్రావతరణ దినం రోజున వారిని సన్మానిస్తాం. డాక్టర్లు, వైద్య సిబ్బందికి మొత్తం వేతనం (గ్రాస్‌ శాలరీ)లో పది శాతాన్ని ప్రోత్సాహకంగా ఇస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులకు ముఖ్యమంత్రి కానుక ఇస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు 95,392 మంది వరకు ఉంటారు. వీరి జీతంలో విధించిన కోతను ఉపసంహరించుకుంటున్నాం. సీఎం ప్రోత్సాహం కింద పురపాలక , గ్రామ పంచాయతీ పారిశుద్ద్య కార్మికులకు రూ. 5 వేలు ఇస్తాం. జీహెచ్‌ఎంసీ,  హైదరాబాద్‌ జలమండలిలోని వారికి రూ. 7,500 ప్రోత్సాహకం ఇస్తాం.. పారిశుద్ధ్య పనులు బాగా కొనసాగిస్తే జబ్బు వ్యాప్తిని నియంత్రించొచ్చు. అరవై వేల మంది పోలీసులున్నారు. వారికి ప్రోత్సాహకం గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం.


కరోనా లేకపోతే డాన్స్‌ చేసేవాడిని

తెలంగాణలో మొదటిసారి 40 లక్షల ఎకరాల్లో వరి పండించారు. తెలంగాణ భారతదేశ ధాన్యాగారం కాబోతోంది. వర్షాకాలం పంటల్లో 1కోటి 30లక్షల పంట అందుబాటులోకి రాబోతుంది. ఇంత మొత్తంలో పంట పడడం చాలా ఆనందం. కరోనా లాంటి పరిస్థితి లేకపోతే డ్యాన్స్‌ చేసేవాడిని. తెలంగాణలో ఏడువేల ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశాం.  గన్ని బ్యాగుల కొరత తీర్చాలని ప్రధానిని కోరగా ఆయన స్పందించారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతతో మాట్లాడాను. అక్కడ బ్యాగ్‌లు ఉత్పత్తి చేసి పంపాలని కోరాం. అక్కడ సాధ్యంగాక పోతే ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్‌ వాడతాం. ఈ సమస్యలన్నీ ఎందుకు? గన్నీబ్యాగ్‌ల తయారీ కోసం రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్‌కు చెప్పాను.. వారికి అవసరమైన ప్రోత్సాహకాలు ఇస్తాం. ఉత్పత్తి జరిగితే సంచుల సమస్య పరిష్కారమవుతుంది.


గవర్నర్‌ విరాళం

ఈనాడు, హైదరాబాద్‌ : ప్రధానమంత్రి సహాయనిధికి తెలంగాణ గవర్నర్‌ రూ. 5 లక్షల విరాళాన్ని ఇచ్చారు. తన వేతనంలో ప్రతి నెల రూ. 1.05 లక్షల చొప్పున సహాయనిధికి జమ చేస్తానని పేర్కొన్నారు.

కరోనా అంతమయ్యేవరకు జ్యోతి వెలిగిస్తా: హిమాన్షు
దేశంలో కరోనా అంతం  కావాలంటూ సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షు సోమవారం ప్రగతిభవన్‌లో దీప ప్రజ్వలన చేశారు. విన్‌ కరోనా అనే ముగ్గును వేయించి, దానిపై దీపాలను వెలిగించారు. ప్రధాని విసిరిన సవాలు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టానని, కరోనా అంతమయ్యే వరకు ప్రతి రోజూ దీప ప్రజ్వలన చేస్తామని ట్విటర్‌లో తెలిపారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.