close

ప్రధానాంశాలు

సేద్యంలో ప్రపంచంతో పోటీ పడదాం!

‘సంఘటిత’ విధానంతో ప్రయోజనాలు
స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు
నియంత్రిత సాగు సమీక్షలో సీఎం కేసీఆర్‌

ప్రపంచంతో పోటీ పడాలి. ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా పంట ఉత్పత్తులు రావాలి. వ్యవసాయాధారిత పరిశ్రమలకు అవి నిరంతరం ముడి సరకు అందించాలి. వేసిన పంటంతా సంపూర్ణంగా అమ్ముడుపోవాలి. తెలంగాణలో సాగు విధానం ఈ పద్ధతిలో సాగాలి.
సాగునీరు, పెట్టుబడులు, నైపుణ్యం కలిగిన రైతాంగం మనకు అండగా ఉన్నాయి. ఏ పంటయినా పండే సారవంతమైన నేలలున్నాయి. ఇన్ని సానుకూలతలున్న తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయం, దీని అనుబంధ వాణిజ్యం, పరిశ్రమల అభివృద్ధి జరగాలి.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు,హైదరాబాద్‌: రాబోయే రోజుల్లో వ్యవసాయం రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ వానాకాలం పంటతో సాగు విధానంలో సంస్కరణకు నాంది పలకబోతున్నామని, రైతులు దానికి సిద్ధం కావాలని కోరారు. నియంత్రిత సాగుపై సీఎం శుక్రవారం ప్రగతిభవన్‌లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ముఖ్య కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వర్‌ రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి ప్రవీణ్‌ రావు,  అగ్రి బిజినెస్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సీమా, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ శ్రీనివాసచారి, ఆహార, వ్యవసాయ నిర్వహణ సలహాదారు గోపీనాథ్‌ కోనేటి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులుతో సమావేశమయ్యారు. ప్రజలు, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా తెలంగాణలో సాగాల్సిన పంటల సాగు- వ్యవసాయ వాణిజ్యం, ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపన తదితర అంశాలపై చర్చించారు. పంటల సాగులో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ఉత్పాదకత ఎలా పెంచాలి? రైతులు పండించిన పంటను యథావిధిగా మార్కెట్‌కు పంపకుండా, దానికి అదనపు విలువలు జోడించేందుకు ఇప్పుడున్న పద్ధతులేంటి? తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచ పోటీని తట్టుకుని నిలబడేందుకు ఏం చేయాలి? ఎరువులు-రసాయనాల వాడకంలో రావాల్సిన మార్పులేమిటన్న అంశాలపై చర్చసాగింది. ఈ సందర్భంగా నిపుణులు పలు సూచనలు ఇచ్చారు. రానున్న రోజుల్లో ఇలాంటి చర్చలు జరిపి, తెలంగాణ వ్యవసాయానికి ఒక దశ, దిశ నిర్దేశించాలని సీఎం నిర్ణయించారు.
ఇప్పుడిప్పుడే రైతుల్లో నమ్మకం ఏర్పడుతోంది
తెలంగాణ ఏర్పడినప్పుడు వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉండేదని, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కుదుటపడిందని సీఎం అన్నారు. ‘‘ఇప్పుడిప్పుడే రైతుల్లో నమ్మకం ఏర్పడుతోంది. ప్రపంచంలో ఏటా పరిస్థితులు మారుతుంటాయి. దానికి అనుగుణంగా పంటల మార్పిడి జరగాలి. దీనికి రైతులు అలవాటుపడాలి.
అంతర్జాతీయ మార్కెటింగ్‌కు దోహదం
రైతులు పండించిన పంటను శుద్ధి చేసి విలువను పెంచేలా రాష్ట్రంలో ఆహారశుద్ధి ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేస్తాం. ఆ పరిశ్రమలకు కావాల్సిన ముడి సరకును అందించగలిగేలా సంఘటిత వ్యవసాయానికి శ్రీకారం జరగాలి. నాణ్యమైన సరకులు తయారు చేయడం వల్ల తెలంగాణ బ్రాండ్‌కు ఖ్యాతి ఏర్పడుతుంది. అది అంతర్జాతీయ మార్కెటింగ్‌కు దోహదం చేస్తుంది.
సేద్యం ఆధారిత పారిశ్రామికీకరణకు అనుకూలం
జనాభాలో ఎక్కువ శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడటం ప్రగతికి సంకేతం కాదు. పారిశ్రామికీకరణ జరగాలి. తెలంగాణ వ్యవసాయాధారిత పారిశ్రామికీకరణకు అనుకూలం. రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వచ్చేట్లు కృషి జరగాలి. తద్వారా పారిశ్రామిక రంగం, సేవా రంగం వృద్ధి చెందుతాయి. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తాం’’ అని సీఎం తెలిపారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.