close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మొదట నిషా.. చివరగా శ్రీరాం హత్య

అనేక కోణాల్లో పోలీసుల విచారణ
నిందితుడికి 14 రోజుల రిమాండు
ముగిసిన ఏడుగురి అంత్యక్రియలు

ఈనాడు, వరంగల్‌, వరంగల్‌క్రైం, వరంగల్‌ న్యాయవిభాగం, ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: వరంగల్‌ గొర్రెకుంట వద్ద బావిలో పడేసి తొమ్మిది మందిని హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ పోలీసుల విచారణలో అనేక వివరాలు వెల్లడించినట్టు సమాచారం. భోజనంలో నిద్రమాత్రలు కలపడంతో తొమ్మిది మంది గాఢ నిద్రలోకి జారుకున్నాక సంజయ్‌ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మొదట మక్సూద్‌ భార్య నిషా ఆలంను బావిలో పడేశాడు. తర్వాత వరుసగా బుస్రా, మూడేళ్ల చిన్నారి బబ్లూ, సోహెల్‌, షాబాజ్‌, మక్సూద్‌, షకీల్‌, శ్యాంలను తోసేసి చివరగా శ్రీరాంను బావిలో పడేశానని సంజయ్‌ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. గురువారం పరిశ్రమ యజమాని ఫోన్‌ చేస్తే సంజయ్‌ అక్కడికి వెళ్లాడు. ఏమీ ఎరుగనట్టు మక్సూద్‌ కుటుంబం ఆచూకీ కోసం పలువురికి ఫోన్‌ చేసి ఆరా తీసినట్టు నటించాడు. పోలీసులకు తనపై ఎలాగూ అనుమానం రాలేదని ధైర్యంగా మృతదేహాలను వెలికి తీసేటప్పుడు కూడా బావి పరిసరాల్లోనే తిరగడం గమనార్హం. మక్సూద్‌ కుటుంబానికి సన్నిహితులైన పలువురితో పాటు సంజయ్‌ను పోలీసులు విచారించినా అతడిలో ఎలాంటి భయం లేకపోవడంతో వారికి అనుమానం రాలేదు. తర్వాత సీసీ టీవీ ఫుటేజీలు చూసి, రఫికా పిల్లలతో మాట్లాడిన పోలీసులు సంజయ్‌ను లోతుగా విచారించగా హత్యలు చేసినట్టు అంగీకరించాడు.
కేంద్ర కారాగారానికి తరలింపు
నిందితుడు సంజయ్‌ను పోలీసులు మంగళవారం జిల్లా న్యాయ సేవా సదన్‌లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో హాజరుపర్చారు. అతడిపై గీసుకొండ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. వరంగల్‌ మూడో అదనపు మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి ఎ. కుమారస్వామి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిందితుణ్ని విచారించి, అతడికి వచ్చే నెల 8 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. అనంతరం పోలీసులు అతడిని వరంగల్‌ కేంద్ర కారాగారానికి తరలించారు. వైద్యులు కరోనా పరీక్షలు అవసరం లేదని తేల్చడంతో జైలు సిబ్బంది సంజయ్‌కు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి అత్యంత భద్రత ఉన్న బ్యారక్‌లోకి తరలించారు. జైలుకు వెళ్లే ముందు సంజయ్‌కుమార్‌ రఫికా కుమార్తెతో మాట్లాడతానని కోరగా పోలీసులు నిరాకరించినట్టు సమాచారం.  
స్థానికంగానే అంత్యక్రియలు పూర్తి
మక్సూద్‌, అతడి కుటుంబ సభ్యులు, షకీల్‌... మొత్తం ఏడుగురి అంత్యక్రియలు వారి మత సంప్రదాయం ప్రకారం మంగళవారం ఎంజీఎం ఆసుపత్రి పక్కనే ఉన్న ఖబ్రస్థాన్‌లో నిర్వహించారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం బకాడ నుంచి మక్సూద్‌ బంధువులు నలుగురు హాజరయ్యారు. తమ వారి హత్య కేసులో అనుమానాలున్నాయని, లోతుగా విచారించాలని డిమాండు చేశారు. షకీల్‌ మృతదేహాన్ని అతడి భార్య మున్నీరుబేగంకు అప్పగించారు. తన భర్త మృతదేహాన్ని ఆలస్యంగా అప్పగించారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల్లో బిహార్‌కు చెందిన ఇద్దరు యువకుల అంత్యక్రియలు ఇంకా జరగలేదు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.