close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లాక్‌డౌన్‌పై ఏం చేద్దాం?

మోదీ, అమిత్‌ షా సమాలోచనలు
సీఎంల అభిప్రాయాలను ప్రధాని ముందుంచిన కేంద్ర హోంమంత్రి
ఆంక్షలను మరింత సడలించాలని కేంద్ర కమిటీల సిఫార్సు
నియంత్రణ చర్యలపై రాష్ట్రాలకు ఎక్కువ స్వేచ్ఛనిచ్చే అవకాశం

ఈనాడు, దిల్లీ: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌-4 గడువు ఆదివారంతో ముగియనుండటంతో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలపై కసరత్తులను ప్రధాని నరేంద్ర మోదీ ముమ్మరం చేశారు. మహమ్మారి విజృంభణకు ముకుతాడు వేస్తూనే, దేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించుకునేందుకు ఏం చేయాలనేదానిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతోపాటు పలువురు సీనియర్‌ అధికారులతో ఆయన శుక్రవారం సమాలోచనలు జరిపారు. పలువురు ముఖ్యమంత్రులతో గురువారం రాత్రి మాట్లాడిన షా.. లాక్‌డౌన్‌పై వారందరి అభిప్రాయాలను తాజా సమావేశంలో ప్రధాని ముందుంచారు. కొవిడ్‌ వ్యవహారాల పర్యవేక్షణకు ఏర్పాటుచేసిన రెండు కమిటీలు లాక్‌డౌన్‌ను మరింత సరళతరం చేయాలని సూచించిన నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుంటుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కఠినమైన నియంత్రణ చర్యలు చేపడుతూనే, ఇతర ప్రాంతాలకు నిషేధాజ్ఞల నుంచి మినహాయింపునివ్వాలని కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీలు అభిప్రాయపడుతున్నాయి. పాఠశాలలు, సినిమా థియేటర్లు, ప్రార్థనా స్థలాలు మినహా అన్నింటిపై ఆంక్షలు ఎత్తేయాలని అవి సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే- మునుపెన్నడూ లేనివిధంగా దేశంలో తాజాగా 24 గంటల్లో 7 వేలకుపైగా కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం లాక్‌డౌన్‌ను కొనసాగిస్తుందా? లేదంటే కరోనా ఉద్ధృతి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధంగా ఉంది కాబట్టి నియంత్రణ చర్యల స్వేచ్ఛను రాష్ట్రాలకే వదిలేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు- ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కొనసాగించినా.. ఈ దఫా మరిన్ని వెసులుబాట్లు కల్పించే అవకాశముందని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని సడలింపులు ఖాయం!
లాక్‌డౌన్‌ నిబంధనలను నాలుగు దశల్లో క్రమంగా సడలించుకుంటూ వచ్చిన కేంద్రం ప్రస్తుతం మినహాయింపులను మరింత విస్తృతం చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విమానాలు, రైళ్లు ప్రారంభమవడంతోపాటు చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు కూడా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై లాక్‌డౌన్‌ను కొనసాగించినా ఆంక్షలను కొన్ని రంగాలకే పరిమితం చేయొచ్చని తెలుస్తోంది. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గాబా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో మాట్లాడి, కేసుల ఉద్ధృతి అధికంగా ఉన్న 13 నగరాలపై ప్రధానంగా దృష్టిసారించాలని ఆదేశించిన సంగతి గమనార్హం.


మన్‌-కీ-బాత్‌లో స్పష్టత?

గతంలో లాక్‌డౌన్‌ గడువు ముగింపు దశకొచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ స్వయంగా మాట్లాడారు. తొలిసారిగా ఈ దఫా అమిత్‌ షా ఆ పని చేశారు. లాక్‌డౌన్‌ కొనసాగింపుపై సీఎంల అభిప్రాయాలను తెలుసుకున్నారు. వచ్చే నెల 1 నుంచి ఏయే రంగాలకు ఆంక్షల నుంచి మినహాయింపులు కోరుకుంటున్నారో ఆరా తీశారు. ఆ వివరాలన్నింటినీ తాజా భేటీలో మోదీకి తెలియజేశారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సమాచారాన్ని తెప్పించుకొని విశ్లేషించిన షా.. ఆ వివరాలనూ ప్రధాని ముందుంచారు. షాతో మాట్లాడిన ముఖ్యమంత్రుల్లో ఎక్కువ మంది ఏదో ఒక రూపంలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని కోరుకున్నారని హోంశాఖ వర్గాల ద్వారా తెలిసింది. అదే సమయంలో ఆర్థిక కార్యకలాపాలను పునఃప్రారంభిస్తూ క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయాలనీ వారు సూచించారని సమాచారం. వీటన్నింటి ఆధారంగా కేంద్రం 1-2 రోజుల్లో తన అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశముంది. మన్‌-కీ-బాత్‌ సందర్భంగా మోదీ ఆదివారం దీనిపై స్పష్టత ఇస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.