close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒక్కరోజే 169 కేసులు

హైదరాబాద్‌లోనే 82 మంది బాధితులు
మరో నాలుగు మరణాలు
రాష్ట్రవాసుల్లో 100 మందికి పాజిటివ్‌
సౌదీ నుంచి వచ్చిన 64 మందిలో..

ఐదుగురు వలస కార్మికుల్లో నిర్ధారణఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శుక్రవారం మరో 169 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 100 తెలంగాణవాసుల్లో నిర్ధారించగా, సౌదీ అరేబియా నుంచి వచ్చిన 64 మందిలో, తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి తిరిగి ఇక్కడికి వచ్చిన ఐదుగురిలో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. మరో నలుగురు మృతిచెందడంతో ఇప్పటి వరకు కొవిడ్‌తో చనిపోయిన వారి సంఖ్య 71కు చేరుకుంది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో శుక్రవారం నాటి ఫలితాలే అత్యధికం. జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలో ఒక్కరోజే 82 కేసులు నిర్ధారణకావడం ఆందోళన కలిగించే అంశం. మిగిలినవి రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్‌లో 2, సంగారెడ్డిలో 2 చొప్పున నిర్ధారణ అయ్యాయి.

జీహెచ్‌ఎంసీలో 1528 కేసులు
లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో.. వైరస్‌ కట్టడిపై వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేంగా దృష్టిసారించింది. ఇప్పటి వరకూ జీహెచ్‌ఎంసీ పరిధిలో 1528 కేసులు నమోదయ్యాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పెద్దఎత్తున లక్షణాలున్నవారిని గుర్తించి పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్‌ వచ్చినవారిని ఆసుపత్రికి తరలించడంతో పాటు ఆయా వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు పరీక్షలు.. తదితర ప్రక్రియను కఠినంగా అమలు చేస్తున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల్లో అనుమానితులను ఉంచడంతో పాటు స్వీయ గృహ నిర్బంధంలో కొనసాగే విధానాన్ని కూడా అమలు చేస్తున్నట్లు తెలిపింది. ముప్పు తీవ్రతను అంచనా వేసి సన్నిహితులను గుర్తించడంపై పెద్దఎత్తున దృష్టిపెట్టామనీ, ఎక్కువమందిలో పరీక్షలు చేయడం వల్ల కేసుల సంఖ్య కూడా పెరుగుతోందని, ఇదే సమయంలో వైరస్‌ వ్యాప్తిని కూడా అడ్డుకున్నట్లు అవుతుందని వైద్యశాఖ వెల్లడించింది. వైరస్‌ వ్యాప్తి కట్టడిలో ప్రజలు కూడా సహకరించాలని, వ్యక్తిగత దూరాన్ని పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరిôచాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.

71కి పెరిగిన మరణాలు
రాష్ట్రంలో కరోనా వైరస్‌తో శుక్రవారం మరో నలుగురు మరణించారు. దీంతో మొత్తంగా కొవిడ్‌ కోరలకు బలైనవారి సంఖ్య 71కి పెరిగింది. తాజా మరణాల్లో.. థైరాయిడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తి (53), ‘మల్టిపుల్‌ మైలోమా’ బాధిత వ్యక్తి(59), పక్షవాతం ఉన్న వృద్ధుడు (62) అధిక రక్తపోటు, దాని అనుబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళ(60)మరణించారు.

వలసల్లో కేసుల పెరుగుదల
ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి ఇక్కడికి వచ్చిన వలసజీవుల్లో శుక్రవారం గుర్తించిన ఐదుగురితో కలిపి మొత్తంగా 180 మందిలో కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఒడిశా, బిహార్‌ తదితర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన వలసజీవుల్లో ఎటువంటి అనుమానాస్పద లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యసిబ్బందిని సంప్రదించాలని ప్రజారోగ్య సంచాలకులు కోరారు. విదేశాల నుంచి వచ్చినవారిలోనూ 30 మందిలో కరోనాను గుర్తించారు. సౌదీ అరేబియా నుంచి పంపించిన 458 మంది భారతీయుల్లో శుక్రవారం నాటి ఫలితాలతో కలుపుకుంటే.. ఇప్పటి వరకూ 207 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరందరూ కూడా మిలటరీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ ఒక్క కరోనా కూడా నమోదు కాని జిల్లాల్లో వరంగల్‌ గ్రామీణ, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాలు యథావిధిగా కొనసాగుతుండగా.. గత 14 రోజుల్లో వైరస్‌ కేసులు గుర్తించని జిల్లాల సంఖ్య 17కు తగ్గింది. లాక్‌డౌన్‌ సడలింపులకు ముందు ఈ సంఖ్య 25గా ఉండేది.

వలసలు, ఇతర దేశాల నుంచి వచ్చినవారిలో కరోనా తీరు
* వలసకార్మికుల్లో 180
* సౌదీ అరేబియా నుంచి వచ్చినవారిలో 207
* ఇతర దేశాల నుంచి వచ్చినవారిలో 30
* మొత్తంగా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్‌లు 417

రాష్ట్రంలో కొవిడ్‌..
* ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 973
* కోలుకొని ఇళ్లకెళ్లినవారు 1,381
* మొత్తం మరణాలు 71
* మొత్తంగా కేసులు 2,425

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.