close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జల సంబురం..గోదారి అబ్బురం

కొండపోచమ్మకు అభిషేకం
నీరు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో మకుటాయమానం అనదగ్గ దృశ్యం ఆవిష్కృతమైంది. అత్యంత ఎత్తుకు గోదావరిని ప్రవహింపజేయడంలో భగీరథ యత్నం సాకారమైంది. మేడిగడ్డ నుంచి పరుగులెడుతూ వచ్చిన జలాలు కొండపోచమ్మ పాదాల చెంతకు చేరాయి. దశాబ్దాల కల సాకారంతో ప్రజలు ఉప్పొంగిపోయారు. నయాగరా జలపాతంలా హొయలొలుకుతూ గోదారమ్మ దుముకుతుంటే కొండపోచమ్మ తల్లి మురిసిపోయింది.

ఈనాడు - సిద్దిపేట

మేడిగడ్డ నుంచి ఏడాది కిందట పయనమైన గోదారమ్మ శిఖరాగ్రస్థాయికి చేరింది. కొండపోచమ్మ సాగర్‌ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రారంభించడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో మహోన్నత దశ పూర్తయ్యింది. జలాశయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున 4.15 గంటలకు జగదేవపూర్‌ మండలంలోని కొండపోచమ్మ ఆలయంలో నవచండీయాగం నిర్వహించారు. సతీసమేతంగా ఉదయం 7.40 గంటలకు ఇక్కడకు విచ్చేసిన సీఎం కేసీఆర్‌ అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్ణాహుతిలో పాల్గొన్న తర్వాత 8.30 గంటల సమయంలో ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఉదయం 9.30కు ఎర్రవల్లి, మర్కూక్‌ గ్రామాల్లో రైతు వేదిక భవనాలకు శంకుస్థాపనలు చేశారు. 10 గంటలకు మర్కూక్‌ పంపుహౌస్‌కు వచ్చారు. హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న చినజీయర్‌ స్వామికి కేసీఆర్‌ దంపతులు సాదర స్వాగతం పలికారు. పంపుహౌస్‌ వద్ద నిర్వహిస్తున్న సుదర్శన యాగం వద్దకు స్వామిని తోడ్కొని వెళ్లారు.

పేరుపేరునా పరిచయం
చినజీయర్‌స్వామికి ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లు, ఏజెన్సీల ప్రతినిధులు, అధికారులను సీఎం కేసీఆర్‌ పేరుపేరునా పరిచయం చేశారు. పూర్ణాహుతి తర్వాత స్వామితో కలిసి సీఎం మర్కూక్‌ పంపుహౌస్‌ను ప్రారంభించారు. ఇక్కడ పవిత్ర జలాలను సీఎం, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులపై చల్లుతూ చినజీయర్‌ అందరినీ ఆశీర్వదించారు. అనంతరం కేసీఆర్‌... స్వామితో పాటు కారులో జలాశయం కట్టపైకి వెళ్లారు. మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టరు వెంకటరామరెడ్డి తదితరులతో కలిసి గంగమ్మకు పసుపు, కుంకుమ, చీర, సారెలను సమర్పించారు. అనంతరం మర్కూక్‌లోని వరదరాజస్వామిని దర్శించుకుని మళ్లీ జలాశయం వద్దకు వచ్చారు. రెండో పంప్‌ నుంచి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. జలాశయం గురించి చినజీయర్‌కు వివరించారు. అతిథులతో కలిసి సీఎం  భోజనం చేశారు. ఈ వేడుకల్లో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పాటు యాదాద్రి, సిరిసిల్ల జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
త్రిదండి చినజీయర్‌ స్వామి సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఉదయం 10.48 గంటలకు మీట నొక్కి గోదావరి జలాలను కొండపోచమ్మ జలాశయంలోకి విడుదల చేశారు. పొంగిపొర్లుతున్న నీళ్లను చూసి కేసీఆర్‌ తన్మయత్వం చెందారు. మర్కూక్‌ వద్ద నిర్మించిన పంపుహౌస్‌ సమీపంలోని మీట నొక్కగానే కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే జలాశయంలోకి ఒక పంపు ద్వారా నీళ్లు వచ్చి చేరాయి.

 

ఆనంద డోలికల్లో జలాశయ నిర్మాతలు
కొండపోచమ్మ జలాశయ ప్రారంభ వేడుకల్లో పాల్గొని తాము సృష్టించిన అద్భుతాన్ని చూసి మురిసిపోయారు ఇంజినీర్లు, కంపెనీల ప్రతినిధులు. ఈఎన్‌సీలు హరిరామ్‌, మురళీధర్‌తో పాటు ఎస్‌ఈ వేణు, ఈఈ భద్రినారాయణ తదితర ఇంజినీర్ల బృందం జలాలు పారడంతో తాము పడ్డ కష్టాన్ని మరిచిపోయారు. హరీశ్‌రావు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును పరుగులెత్తించడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ జలాశయం ప్రారంభోత్సవంలో కేసీఆర్‌ పక్కనే ఉంటూ కార్యక్రమం సజావుగా సాగేలా చూశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిద్దిపేట జిల్లా పాలనాధికారి వెంకటరామరెడ్డి పర్యవేక్షించారు. జలాశయం ప్రారంభోత్సవానికి మేఘ కంపెనీ ఎండీ పీవీ కృష్ణారెడ్డి హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర ముఖ్యనేతలతో ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఎదురైన అనుభవాలను వివరించారు. మేఘ కంపెనీ ఉపాధ్యక్షుడు బ్రహ్మయ్య, డైరెక్టరు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, కేఎన్నార్‌, ఏఎమ్మార్‌ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.


ఇదీ ఘనత

* తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారీ ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అన్నీ విశేషాలే. 2016 మే రెండున దీనికి భూమి పూజ చేసిన కేసీఆర్‌, 2020 మే 29న ప్రాజెక్టులో చివర ఉన్న ఎత్తిపోతల ద్వారా అత్యంత ఎత్తులో ఉన్న కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేశారు. కేవలం నాలుగేళ్లలోనే ఈ భారీ ప్రాజెక్టులో ప్రధాన పనులన్నీ పూర్తి చేయించారు.
* దేశంలో ఇప్పటివరకు ఏ ప్రాజెక్టులోనూ లేనంతగా కేవలం నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టుపైన సుమారు రూ.65 వేల కోట్లు ఖర్చు చేశారు.
* తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగానికి చేసిన ఖర్చులో 60% నిధులను ఈ ప్రాజెక్టుపైనే వెచ్చించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటా సగటున రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.