close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నవభారత నిర్మాత పీవీ

నెహ్రూకు సమాంతర నేత
ఆయనకు భారతరత్న ఇవ్వాలి
హెచ్‌సీయూకు పీవీ పేరు పెట్టాలి
పార్లమెంటు, అసెంబ్లీలో చిత్రపటాలు
ఘనంగా శతజయంతి ఉత్సవాలు
లక్ష మందితో ముగింపు కార్యక్రమం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి

పీవీని గొప్పగా స్మరించుకుంటున్న ఈ సందర్భంగా రాజకీయాల జోలికి వెళ్లదలచుకోలేదు. కానీ, చాలా బాధగా ఉంది.. ఆయనకు లభించాల్సిన గౌరవం దక్కలేదు. చేయాల్సిన వాళ్లు చేయకున్నా.. తెలంగాణ బిడ్డ పీవీకి మనం చేద్దాం. భయపడి కాదు.. ఇది సమయం కాదని మాట్లాడడం లేదు.. మరో సమయంలో మాట్లాడతాను. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రభలు మసకబారాయి.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

 

ఈనాడు, హైదరాబాద్‌:  మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు నవభారత నిర్మాతల్లో ఒకరని, ఆయన నెహ్రూకు సమాంతర వ్యక్తి అని, 360 డిగ్రీల వ్యక్తిత్వం గలవారని  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొనియాడారు. ఆయన తెలంగాణకు ఠీవి అని, అభ్యుదయవాది, సంస్కరాణాభిలాషి అని, తన ఆస్తిని ప్రభుత్వానికి అప్పగించి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. విజ్ఞాన సముపార్జన చేసి ఆ వెలుతురును ప్రపంచానికి అందించారన్నారు. ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో సంస్కరణలు తెచ్చరన్నారు. గ్లోబల్‌ ఇండియా ఆయన చలవేనన్నారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానిగా.. ప్రజాసేవ చేసిన పీవీకి సరైన గౌరవం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణమెవరో అందరికీ తెలుసునని అన్నారు. ఆయనకు ‘భారతరత్న’ ఇవ్వాలని, హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పీవీ పేరు పెట్టాలని, స్మారకంగా పోస్టల్‌ స్టాంపు విడుదల చేయాలని ప్రధానమంత్రిని కోరతామన్నారు. శాసనసభలో శాశ్వత చిత్రపటం ఏర్పాటు చేస్తామని, పార్లమెంటులోనూ నెలకొల్పాలని కోరారు. ఆయన పేరుతో కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని, ప్రజలు కోరితే తెలుగు అకాడమీకి అ మహనీయుని పేరు పెడతామన్నారు. రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి కలాం స్మారకం మాదిరిగానే పీవీ జ్ఞానభూమిలో స్మారక కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ఆయన రచనలన్నీ సాహిత్య అకాడెమీ ద్వారా ముద్రిస్తామని వెల్లడించారు. వంగర, వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌, తెలంగాణ భవన్లో కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. పలు ప్రభుత్వ కార్యక్రమాలకు మాజీ ప్రధాని పేరు పెట్టాలన్నారు.

ఆదివారం జ్ఞానభూమిలో పీవీ శతజయంతి ఉత్సవాలను కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘పీవీ గొప్ప వ్యక్తి, నిరంతర విద్యార్థి, అధ్యయన శీలి. ఆయన రాజకీయ ప్రస్థానంలో కులం, ధన బలం వంటివేవీ లేవు. అయినా ఎన్నో గొప్ప పదవులు అలంకరించారు. ప్రధాని పదవి ముఠాలు కట్టి తెచ్చుకోలేదు. అదే ఆయన్ను వరించి వచ్చింది. ఏనాడూ కుల రాజకీయాలు చేయలేదు,  ముఖ్యమంత్రిగా ఉన్నపుడు భూస్వామ్య వ్యతిరేక పోరాటం చూసి భూసంస్కరణలు తీసుకువచ్చారు. స్వయంగా భూస్వామి అయినా తమ కుటుంబానికి 200 ఎకరాలు ఉంచుకుని.. మిగిలిన 800 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించిన మహోన్నతుడు.
ఆర్థిక స్వేచ్ఛకు ఆయనే కారణం
సంస్కరణల విషయంలో విమర్శలు వచ్చినా వెనుకాడలేదు. గెలుపు ఓటముల్లో ఎప్పుడూ ఒకేరకంగా ఉండేవారు. నమ్మినదాన్ని చేసుకుంటూ ముందుకుపోయారు. దేశ ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించిన ఘనత పీవీదే. ఆ కాలంలోని సంస్కరణలే ఇప్పుడు ఫలితాలిస్తున్నాయి. మనందరం అనుభవిస్తున్న ఆర్థిక స్వేచ్ఛకు కారణం ఆయనే. అందరికీ అధికారం దక్కాలని పీవీ అభిలషించారు. ఆయనకు చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు. బిల్‌క్లింటన్‌ సహా ప్రపంచ నేతలతో ఆయనకు మంచి సంబంధాలుండేవి, పీవీ వ్యక్తిత్వంపై పెద్ద పుస్తకమే రాయవచ్చు. ఆయన జీవితం అందరికీ మార్గదర్శకం. సహాయకులున్నా స్వయంగా కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేసుకున్న వ్యక్తి. విద్యాశాఖ పేరును హెచ్‌ఆర్డీగా మార్చింది ఆయనే. ఆయన చొరవతో దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. జైళ్లశాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. తాను నమ్మింది, అనుకున్నది గొప్పగా చెప్పారు. ప్రపంచదేశాలకు ఉత్తమ సందేశాలను ఇచ్చారు.. వేయి పడగలు నవలను హిందీలోకి తర్జుమా చేయడంలో అనువాదంలా కాకుండా అనుసృజన చేశారు. శతజయంతి ఉత్సవాల ముగింపు సభ లక్షమందితో జరగాలని కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు.

ఘనంగా ఉత్సవాలు
ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆయన చిత్రం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుష్పాంజలి ఘటించారు. అనంతరం భజన సంకీర్తనలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, జయంత్యుత్సవ కమిటీ ఛైర్మన్‌, తెరాస పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవరావు, పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు, కుమార్తె వాణీదేవి తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.