close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొండపోచమ్మ సాగర్‌ కాలువకు గండి

 శివారు వెంకటాపూర్‌ గ్రామంలోకి చేరిన నీరు
 ఇళ్లు, పొలాలు జలమయం

న్యూస్‌టుడే- గజ్వేల్‌, ములుగు: యాదాద్రి భువనగిరి జిల్లాకు గోదావరి జలాలు తరలిస్తున్న కొండపోచమ్మ సాగర్‌ జలాశయం ఎడమ కాలువకు మంగళవారం ఉదయం గండి పడింది. దీంతో దిగువన ఉన్న జగదేవపూర్‌ మండలం శివారు వెంకటాపూర్‌ గ్రామం జలమయమైంది. పొలాలు నీట మునిగాయి.  కొన్ని ఇళ్లలోకి నీరు చేరడంతో గ్రామస్థులు ఆందోళనతో పరుగులు తీశారు. వారం కిందట ప్రారంభించిన కాలువకు గండి పడటం స్థానికులను విస్మయానికి గురిచేసింది.
సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలంలో కొండపోచమ్మ సాగర్‌ జలాశయం నిర్మించారు. దీనికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో శివారు వెంకటాపూర్‌ ఉంది. ఇక్కడ 1500 మంది జనాభా నివసిస్తున్నారు. గోదావరి నీరు ఆలేరు నియోజకవర్గానికి తరలించే కాలువ ఈ గ్రామ సమీపంలో ఉంది. దీనికి మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో రెండుచోట్ల బుంగలు పడ్డాయి. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బుంగలు పెద్దవై.. కాలువ కట్ట కోతకు గురై పూర్తిగా తెగిపోయింది. నీరు పంట పొలాల మీదుగా లోతట్టు ప్రాంతమైన శివారువెంకటాపూర్‌లో ప్రవేశించింది. 11 ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఒక్కో ఇంటికి రూ.75 వేల నుంచి లక్ష రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు. వీరిని స్థానికులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. సుమారు 23 మంది రైతులకు చెందిన 33 ఎకరాల్లో నీరు చేరడంతో బెండ, టమాటా, పత్తి పొలాలకు నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ హరిరాం, జిల్లా ఎస్‌ఈ వేణుతో పాటు ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మరమ్మతులు పనులు ప్రారంభించారు.

నాణ్యతపై అనుమానాలు
కొండపోచమ్మ సాగర్‌ జలాశయం నుంచి నిర్మించిన కాలువ నిర్మాణంపై నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలువకు రెండు పాయలు ఉండగా.. ఒకటి యాదాద్రి జిల్లాకు.. మరో పాయ జగదేవపూర్‌ మండలంలో చెరువులు నింపుతుంది. ఈ కాలువ మొత్తం 24 కిలోమీటర్లకు గాను 12.8 కిలోమీటర్లు పూర్తయింది. రిజర్వాయర్‌కు 4 కిలోమీటర్ల దూరంలో గండి పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని మేఘ నిర్మాణ సంస్థ చేపట్టింది.
సీఎం కేసీఆర్‌ మే 29న కొండపోచమ్మ జలాశయాన్ని ప్రారంభించారు. జూన్‌ 24న రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత రిజర్వాయర్‌ నుంచి ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా జూన్‌ 12న గజ్వేల్‌ మండలం కొడకండ్ల శివారులో మల్లన్నసాగర్‌ పంప్‌హౌస్‌ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీరు అందించే కాలువ సిమెంటు పలకలు పగిలిపోయాయి. అదేరోజు కొండపాక మండల పరిధిలోని ఎర్రవల్లి సమీపంలోని కాలువకు గండిపడి గోదావరి జలాలు వృథా అయ్యాయి.

బుంగలు సర్వ సాధారణం: ఈఎన్‌సీ హరిరాం
ములుగు, న్యూస్‌టుడే: దేశంలోనే తక్కువ కాలంలో నిర్మించిన జలాశయంగా కొండపోచమ్మ సాగర్‌కు పేరుందని.. అలాంటి ఘనతను మరిచి చిన్న విషయాన్ని పెద్దదిగా చూడొద్దని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ హరిరాం అన్నారు. మంగళవారం శివారువెంకటాపూర్‌లో కాలువ వద్ద ఎస్‌ఈ వేణుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ నుంచి 260 కిలోమీటర్ల మేర తరలించి.. 10 చోట్ల పంపింగ్‌ చేసి.. కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను తీసుకురావడం జరిగిందన్నారు. ఎక్కడో ఉన్న నీటిని గ్రామాల్లోని చిన్ననీటి వనరుల్లోకి తీసుకురావడానికి ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు ఎంత శ్రమపడి ఉంటారో ఆలోచించాలన్నారు. కొత్తగా కాలువలు నిర్మించిన చోట భూమి వదులుగా ఉంటే బుంగలు పడటం సర్వసాధారణమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే జగదేవపూర్‌ వైపు వెళ్లే కాలువకు శివారు వెంకటాపూర్‌ వద్ద బుంగలు పడ్డాయన్నారు. అంతమాత్రాన పనుల్లో నాణ్యత లేదని, ఇంజినీరింగ్‌ అధికారులను తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు. శివారు వెంకటాపూర్‌లో 33 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా ఎకరానికి రూ.1500 చొప్పున బాధిత రైతులకు పరిహారం ఇచ్చామన్నారు. నీరు చేరి ఇళ్లు దెబ్బతిన్న వారికి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి రూ.8 వేల నుంచి 28 వేల రూపాయల వరకు పరిహారం చెల్లించామని వివరించారు. త్వరలో ప్రభుత్వం నుంచి మరింత ఆర్థిక సాయం అందుతుందని హరిరాం చెప్పారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.