close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గోదావరిలోనూ ఏపీ వాటానే అధికం

వినియోగంలో 776 టీఎంసీల నీరు
తెలంగాణ వాటా 650 టీఎంసీలంటూ బోర్డుకు ఆంధ్రప్రదేశ్‌ లేఖ
2014లో నాటి ఉమ్మడి అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో
మాత్రం 967.14 టీఎంసీలని ప్రకటన
ఈనాడు - హైదరాబాద్‌

గోదావరిలో లభ్యమయ్యే నికరజలాల్లో తెలంగాణ కంటే తమకే ఎక్కువ వినియోగం ఉందని, ఇది కూడా అధికారికంగా చేపట్టిన ప్రాజెక్టులకేనంటూ.. గోదావరి నదీ యాజమాన్యబోర్డుకు రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. 2014 జనవరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో గోదావరి బేసిన్‌లోని 1,480 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణకు 967.14 టీఎంసీలు ప్రాజెక్టుల వారీగా నివేదించగా, తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాసిన లేఖలో 650 టీఎంసీలుగానే పేర్కొంది. దీంతో నీటి లభ్యత తక్కువగా ఉండే కృష్ణా బేసిన్‌లోనే కాదు, ఎక్కువ లభ్యత ఉండే గోదావరిలో కూడా కొత్త వివాదానికి తెరలేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రస్తావిస్తూనే, ఆంధ్రప్రదేశ్‌ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అభిప్రాయాలను ప్రత్యేకంగా పేర్కొంటూ ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ బోర్డు సభ్యకార్యదర్శికి లేఖ రాశారు. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
* గోదావరిలో 1,480 టీఎంసీల నీటి లభ్యత ఉండగా, 2014 జనవరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఇచ్చిన సమాచారంలో తెలంగాణకు 967.14 టీఎంసీల వాటా ఉందని, ఇందులో సాగునీటి ప్రాజెక్టులకు 912.25 టీఎంసీలు, జల విద్యుత్తు ప్రాజెక్టులకు 54.89 టీఎంసీలని బోర్డు దృష్టికి తెలంగాణ తెచ్చింది. పునరుత్పత్తి ద్వారా వచ్చే నీటితో కలిపి 1,480 టీఎంసీలుగా అంచనా వేశారని, గోదావరి నీటి పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం జరగలేదని, గోదావరి బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్‌ దిగువన ఉన్నందున తెలంగాణలోని ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ బోర్డు ఆధీనంలో ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. అయితే అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అభిప్రాయం పేరుతో మరో అంశాన్ని చేర్చింది. 2004లో వాప్కోస్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం 75 శాతం నీటి లభ్యత కింద పునరుత్పత్తి ద్వారా లభ్యమయ్యే 70 టీఎంసీలతో కలిపి గోదావరిలో ఉన్నది 1,430 టీఎంసీలేనని పేర్కొంది. ఈ విషయాన్ని 2018 జులైలో కేంద్ర జలసంఘం కూడా చెప్పిందని, దీన్ని బట్టి రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదంది. దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ధవళేశ్వరం, పోలవరం ప్రాజెక్టుల కిందనే 776 టీఎంసీల వినియోగం ఉందని, తెలంగాణకు 650 టీఎంసీలని, రెండు రాష్ట్రాలకు కలిపి 1,430 టీఎంసీలలో 1,426 టీఎంసీల వినియోగం ఉందని పేర్కొంది.
* ఎగువన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినందున శ్రీరామసాగర్‌, నిజాంసాగర్‌లకు కేటాయింపుల మేరకు నీటి లభ్యత ఉండటం లేదని, ఈ ప్రాజెక్టుల ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రానికి ఉన్న మొత్తం కేటాయింపుల నుంచి ఈ ప్రాజెక్టుల కోసం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లిస్తున్నట్లు తెలంగాణ పేర్కొంది. గోదావరి జల వివాద ట్రైబ్యునల్‌ ప్రకారం శ్రీరామసాగర్‌, నిజాంసాగర్‌లకు నీరొచ్చేలా చూడటానికి మహారాష్ట్ర, కేంద్రజల వనరుల శాఖకు విన్నవించాలని, ఎస్సారెస్పీ దిగువన ప్రధాన గోదావరి నుంచి ఎత్తిపోయడానికి వీల్లేదని, కొత్త ప్రాజెక్టుల నివేదిక(డీపీఆర్‌)లను తెలంగాణ గోదావరి బోర్డుకు ఇవ్వాలని, గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం మొత్తం కేటాయింపు(ఎన్‌ బ్లాక్‌) అంటూ ఏమీలేదని అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అభిప్రాయంగా ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. ఇలా మొత్తం తొమ్మిది అంశాలపై ఏపీ బోర్డుకు లేఖ రాసింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.