close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిమ్జ్‌ భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయండి

కేంద్రం మార్గదర్శకాల ఉల్లంఘనను అంగీకరించం
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: సంగారెడ్డి  జిల్లాలో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తి మండలి (నిమ్జ్‌) ప్రాజెక్టు నిమిత్తం చేపట్టిన భూసేకరణలో భాగంగా నేడు (శుక్రవారం) నిర్వహించతలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తరువాత కూడా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుమతించినపుడే నిర్వహించాలని స్పష్టం చేసింది. భారీగా జనం గుమిగూడటం వంటివి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధమని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించకూడదని పేర్కొంది. జహీరాబాద్‌ సమీపంలో 12,635 ఎకరాల్లో సుమారు రూ.4 వేల కోట్లకు పైగా విలువైన నిమ్జ్‌ ఏర్పాటులో భాగంగా ఈ నెల 10న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ సంగారెడ్డి  జిల్లా న్యాల్‌కల్‌ మండలానికి చెందిన ఎం.రాజిరెడ్డి, మరో నలుగురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.ఎస్‌.అర్జున్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ రెండు మండలాల్లో 17 గ్రామాలకు చెందిన 10 వేల మందిపై ప్రత్యక్షంగా, కొన్నివేల మందిపై పరోక్షంగా ప్రభావం చూపే పెద్ద ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారన్నారు. పర్యావరణంలో కలిగే మార్పులపై ప్రజాభిప్రాయ సేకరణకు పీసీబీ నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. ఏదో ఒక ప్రక్రియ పూర్తి చేయాలన్నట్లుగా ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయకూడదని, బాధితులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం కల్పించాలంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పు వెలువరించిందన్నారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని, ప్రస్తుతం వాటి ఉల్లంఘన జరుగుతోందన్నారు. దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టులో 2.44 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని, ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో చైనా నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతున్నందున, వాటిని ఇటువైపు మళ్లించడానికి అవకాశం ఉందన్నారు. పర్యావరణ అనుమతులు లభిస్తే ప్రాజెక్టు ముందుకుసాగుతుందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కూడా ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణలు కొనసాగుతున్నాయన్నారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఒక రాష్ట్రం మార్గదర్శకాలను ఉల్లంఘించిందన్న కారణంతో ఇక్కడా అలా చేస్తామనడం సరికాదంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పెద్దఎత్తున ప్రజలు సమూహాలుగా చేరకూడదని, ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లోనే 1000 మందికిపైగా హాజరవుతున్నారని పేర్కొన్నారని, ఇది కేంద్ర మార్గదర్శకాల ఉల్లంఘనేనని పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, సంగారెడ్డిలో కూడా కరోనా ఉందని తెలిపింది. రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే సుమారు 2 వేల కేసులు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వెయ్యి మందికిపైగా ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనడం అంటే వారి ప్రాణాలకు ప్రమాదమేనంది. ప్రజాభిప్రాయ సేకరణ కేంద్ర మార్గదర్శకాల ఉల్లంఘనేనని, దాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. దీన్ని వాయిదా వేయాలని, కేంద్రం తిరిగి మార్గదర్శకాలు జారీ చేశాక నిర్వహించాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.