close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రెండు రోజుల తర్వాత మళ్లీ విజృంభణ

కర్ణాటకలో భారీగా పెరిగిన కేసులు, మరణాలు
రోజువారీ పెరుగుదలలో మూడో స్థానానికి..

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా కేసులు మరో రికార్డును నమోదుచేశాయి. ఇదివరకు ఎన్నడూలేనంత గరిష్ఠస్థాయిలో గత ఒక్కరోజులో 24,879 కేసులొచ్చాయి. ఈ నెల 5, 6 తేదీల్లో ఇలాగే 24 వేలకుపైగా కేసులు నమోదైనా తర్వాత వరుసగా రెండురోజులు అవి 22 వేలకు తగ్గిపోయాయి. మళ్లీ గురువారం పెరిగాయి. తమిళనాడు, దిల్లీల్లో కేసుల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ మహారాష్ట్రలో మళ్లీ దాదాపు వెయ్యికిపైగా కేసులు పెరిగాయి. కర్ణాటకలో తొలిసారి 2వేలు దాటాయి. ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో వెయ్యికిపైగా కొత్తకేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోం, బిహార్‌, ఒడిశా, జమ్మూ-కశ్మీర్‌, కేరళ, గోవాల్లోనూ గరిష్ఠ సంఖ్యలో కేసులు పెరగడంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్యలో కొత్త రికార్డు నమోదైంది. ఇదే సమయంలో రికార్డు స్థాయిలో ఒకేరోజు 19,547 మంది కోలుకున్నారు. ఈనెల 3 తర్వాత ఇంతమంది కోలుకోవడం ఇదే తొలిసారి. దీంతో రికవరీ రేటు 62.08%కి చేరింది. మరణాలరేటు 2.75%కి తగ్గింది.  ఇప్పటికీ గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, దిల్లీలో మరణాల రేటు జాతీయ సగటు కంటే అధికంగా ఉంది. గుజరాత్‌లో మరణాల రేటు ప్రపంచ సగటు కంటే ఎక్కువగా నమోదైంది. 81.33% రికవరీతో ఉత్తరాఖండ్‌ తొలిస్థానంలో ఉంటే 49.87%, 41.12%, రికవరీ రేటుతో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలు చివరి స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి రోజువారీ కేసులు, మరణాల్లో మూడో స్థానానికి కర్ణాటక ఎగబాకింది. ఇక్కడ దిల్లీకంటే అధికంగా కేసులు, మరణాలు నమోదయ్యాయి. దిల్లీలో ఒక్కరోజులో 2033 కేసులు రాగా, 3,982 మంది కోలుకున్నారు.

90% కేసులు 8 రాష్ట్రాల్లోనే
దేశంలో మొత్తం క్రియాశీల కేసుల్లో 90% వరకు కేవలం ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర మంత్రుల బృందానికి అధికారులు నివేదించారు. 80% క్రియాశీల కేసులు 49 జిల్లాల్లోనే ఉన్నాయని వారు తెలిపారు. మరణాల సంఖ్యపరంగానైతే ఆరు రాష్ట్రాల్లోనే 86% నమోదయ్యాయని వివరించారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ నేతృత్వంలో జీవోఎం గురువారం సమావేశమయింది. మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం జనాభా సంఖ్యతో పోల్చినప్పుడు మరణాలు, కేసుల పరంగా ప్రపంచ దేశాల్లో భారత్‌ మెరుగైన స్థితిలోనే ఉందని హర్షవర్ధన్‌ తెలిపారు. బాధితులను త్వరగా గుర్తించి, ప్రాణనష్టాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వివిధ మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టిందీ జీవోఎంకు అధికారులు తెలిపారు. ప్రాంతీయ భాషల్లోనూ సందేశాలను చేరవేయడంపై దృష్టి సారించినట్లు చెప్పారు.
యూపీలో నేటి రాత్రి నుంచి లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు
కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా శుక్రవారం రాత్రి 10 నుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు విధించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర సర్వీసులు కొనసాగుతాయనీ, అన్ని రకాల కార్యాలయాలు, దుకాణాలు మూతపడతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తివారీ ప్రకటించారు. మే నెలలో ఆంక్షల ఎత్తివేత తర్వాత రాష్ట్ర సర్కారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.