close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రభుత్వ వైద్యరంగంలో పడకలున్నాయ్‌

కొవిడ్‌ బాధితుల చికిత్సకు నిండినవి 9 శాతం
గాంధీలో 60 శాతం ఖాళీ
అయినా ప్రైవేటుకు  కరోనా రోగుల పరుగులు
చక్కదిద్దడంపై సర్కారు దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ.. ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలు లభించడం కష్టసాధ్యమవుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వవైద్య రంగంలో పడకలు తగినన్ని అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని సర్కారు ఆసుపత్రుల్లో మొత్తం కొవిడ్‌ పడకల్లో కేవలం   9 శాతం మాత్రమే బాధితులతో నిండి ఉన్నాయి. ఇందుకు పూర్తి భిన్నంగా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కొవిడ్‌ కోసం కేటాయించిన పడకలు 100 శాతం నిండిపోయి, అదనపు పడకల కోసం పోటీ పడుతున్నారు. ఈనెల 8 నాటికి ప్రైవేటులో 853 మంది చికిత్స పొందుతుండగా.. మరో 228 మంది ఐసొలేషన్‌లో ఉన్నారు. ఇంకో 71 మంది కార్పొరేట్‌ ఆసుపత్రుల కనుసన్నల్లో క్వారంటైన్‌లో కూడా ఉన్నారు.
ఇందులోనూ ఓ మూడు ఆసుపత్రుల్లో 150 మందికి పైగా బాధితులున్నారు. కార్పొరేట్‌లో చికిత్స కోసం రెండు మూడు రోజులైనా వేచి చూసేందుకు వెనుకాడడం లేదు. కొన్నిసార్లు మంత్రులు, ఐఏఎస్‌ల స్థాయుల్లోనూ పైరవీలు చేయించుకోవాల్సి వస్తోంది. రోజురోజుకూ ఈ పరిస్థితి విషమిస్తుండడంతో.. దీన్ని చక్కదిద్దడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది.
నెల కిందటి వరకూ ఒక్క గాంధీలోనే..
రాష్ట్రంలో తొలి కేసు మార్చి 2న నమోదు కాగా, అప్పటి నుంచి జూన్‌ వరకూ ఒక్క గాంధీ ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించారు. జూన్‌ 1వ తేదీ నాటికి రాష్ట్రంలో 2792 కేసులు నమోదు కాగా, వీటిలో ఆరోజు నాటికి 1491 మంది కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. దాదాపు 70 శాతం మంది గాంధీ ఆసుపత్రిలో కోలుకున్నవారే. మిగిలిన వారిలో కొందరు ఛాతీ ఆసుపత్రి నుంచి, మరికొందరు కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు.కరోనా విజృంభిస్తుండటంతో ప్రైవేటులో కూడా చికిత్సలకు అనుమతించాలని కొన్ని వర్గాలు నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం.. గత నెల నుంచే కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సలకు అనుమతించింది.
గాంధీలో సేవలపై ఆరోపణలు
రాష్ట్రంలో కొవిడ్‌ కేంద్రంగా చికిత్సలందిస్తోన్న గాంధీ ఆసుపత్రిలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో అక్కడి వైద్యసేవల్లో లోపాలపై విమర్శలు వచ్చాయి. వసతులు సరిగా లేవనీ, చికిత్సలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కొన్ని వీడియోలు సామా  జిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. కొందరి మరణాలు కూడా వివాదాస్పదమయ్యాయి.
గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యులూ ఆందోళనకు దిగడంతో అక్కడి వైద్యసేవలపై గందరగోళానికి దారితీసింది.ఈ క్రమంలోనే కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సేవలకు అనుమతి లభించడంతో.. కరోనా బాధితులు వాటిలో చేరడానికి పరుగులు పెడుతున్నారు. ఆర్థిక స్థోమత అంతగా లేనివారు కూడా అప్పులు చేసి మరీ.. ప్రైవేటులో రూ.లక్షల బిల్లులు చెల్లించడానికే మొగ్గుచూపుతున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు కూడా గాంధీ ఆసుపత్రిలో కాకుండా కార్పొరేట్‌లో చికిత్స చేయించుకోవడం కూడా విమర్శలకు దారితీసింది.

సానుకూల ప్రచారం దిశగా..
గాంధీ ఆసుపత్రిపై వస్తున్న ఆరోపణలను తిప్పిగొట్టే దిశగా ప్రభుత్వం పటిష్ఠ కార్యాచరణను అమలు చేస్తోంది. ఇక్కడ చికిత్స పొంది ఆరోగ్యవంతులుగా ఇళ్లకెళ్లిన వివిధ వర్గాల వారి అనుభవాలను వీడియోలుగా చిత్రీకరించి సామా  జిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ప్రభుత్వ వైద్యంపై మరింత నమ్మకం కలిగించడానికి కొత్తగా టిమ్స్‌ ఆసుపత్రిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లా ఆసుపత్రుల్లోనూ కరోనా పడకలను సిద్ధం చేసింది. ప్రైవేటు బోధనాసుపత్రుల్లోనూ కొవిడ్‌ చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో వైద్యనిపుణులు, నర్సులు, ఇతర మానవ వనరులను ప్రైవేటు బోధనాసుపత్రులు సమకూర్చుతుండగా.. కొవిడ్‌ చికిత్సకయ్యే ఔషధాలను, పీపీఈ కిట్లను, మాస్కులను, ఇతరత్రా వస్తువులను ప్రభుత్వమే అందించనుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు తగినంతగా అందుబాటులో ఉన్నాయనే సమాచారాన్ని ఏ రోజుకారోజు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిస్తోంది.


సర్కారు వైద్యంలో ఉత్తమ సేవలు: ఈటల

ఈ జబ్బుకు చికిత్స అందించడం అతి కఠినమైంది. వైద్యులు, నర్సులు కూడా కొవిడ్‌ బారిన పడుతున్నారు. అయినా వెనుకడుగు వేయకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలందిస్తున్నా కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చూపిస్తున్నారు. ఇప్పుడు కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ సేవలపై ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికి కూడా ఆసుపత్రుల్లోగానీ, ఐసొలేషన్‌లోగానీ 90 శాతం మందికి పైగా ఉత్తమ చికిత్సలందిస్తున్నది ప్రభుత్వ వైద్యంలోనే. పరిస్థితి విషమించిన బాధితుల్లోనూ అత్యధికులను సర్కారు ఆసుపత్రుల్లోనే స్వీకరిస్తున్నారు. కొవిడ్‌ నిర్ధారణ అయినవారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లొచ్చు. కరోనా అనుమానిత లక్షణాలున్నవారు ఫీవర్‌, కింగ్‌కోఠి ఆసుపత్రులకు వెళ్లాలి. ఇక్కడ నమూనాను పరీక్షించి కొవిడ్‌గా తేలితే.. గాంధీ ఆసుపత్రికి తరలిస్తారు. తీవ్ర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నవారు ఉస్మానియాకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్యంలో 24 గంటలూ స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు గాంధీతో పాటు అన్ని ప్రభుత్వ వైద్యకళాశాలల్లోనూ నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు అందిస్తున్నారు. 


ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.