close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రూ.75 వేల కోట్లు

భారత్‌లో పెట్టుబడులకు గూగుల్‌ సంసిద్ధత
వచ్చే 5-7 ఏళ్లలో సమకూరుస్తాం
దేశంలో డిజిటైజేషన్‌ ప్రక్రియకు ఊతం
గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పిచాయ్‌ ప్రకటన
ప్రధాని మోదీతో వర్చువల్‌ భేటీ

దిల్లీ: వచ్చే 5-7 ఏళ్లలో భారత్‌లో రూ.75 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ పిచాయ్‌ సోమవారం ప్రకటించారు. దేశంలో డిజిటల్‌ పరిజ్ఞానానికి అలవాటుపడే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ సొమ్మును వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. వార్షిక ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా’ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ ప్రకటన చేశారు. అంతకుముందు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో వర్చువల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా డిజిటైజేషన్‌ ఫండ్‌’ ద్వారా రూ.75 వేల కోట్ల (సుమారు 10 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడిని పెట్టనున్నట్లు పిచాయ్‌ పేర్కొన్నారు. ఈక్విటీ పెట్టుబడులు, భాగస్వామ్యాలు, మౌలిక వసతులు వంటి వాటి ద్వారా ఈ పెట్టుబడులను సమకూరుస్తామన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు భారత్‌లోనే సాకారమవుతున్నాయన్నారు. తదుపరి ఆవిష్కరణల వల్ల భారత్‌ ప్రయోజనం పొందడమే కాదు.. ఆ అంశంలో దేశాన్ని అగ్రపథాన నిలిపేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందన్నారు.

భారతీయుల మాతృ భాషల్లో ప్రతి ఇంటికీ సమాచారం అందుబాటులో ఉండేలా చూడటం సహా దేశంలో డిజిటైజేషన్‌కు ఊతమివ్వడం, భారత అవసరాలకు తగ్గట్టుగా కొత్త ఉత్పత్తులు, సేవలు అందించడం, డిజిటల్‌ పరివర్తన దిశగా వ్యాపార సంస్థలకు సాధికారత కల్పించడం; సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సును విద్య, ఆరోగ్యం, వ్యవసాయం తదితర సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగించడం వంటి అవసరాలకు తమ పెట్టుబడులను వెచ్చిస్తామని పిచాయ్‌ తెలిపారు. ‘డిజిటల్‌ ఇండియా’ పురోగతి సాధించిందన్నారు. అయితే ఇంటర్నెట్‌ ధరను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, భారత్‌లో వంద కోట్ల మందికి అది ఉపయోగపడేలా చూడటానికి.. వాయిస్‌ ఇన్‌పుట్‌ను మెరుగుపరచడం నుంచి భారతీయ భాషలన్నింటికీ కంప్యూటింగ్‌ వెసులుబాటు కల్పించడం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం వరకూ అనేకం సాధించాలని చెప్పారు. భారత్‌లోని చిన్నవ్యాపార సంస్థల్లో డిజిటైజేషన్‌ అద్భుతంగా సాగిందని పిచాయ్‌ తెలిపారు. 2.6 కోట్ల చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలను సెర్చ్‌, మ్యాప్‌లపై చూడొచ్చని, వాటికి నెలకు 15 కోట్ల వినియోగదారులు ఉన్నారని తెలిపారు. దేశంలోని చిన్న పారిశ్రామికవేత్తలు డిజిటల్‌ చెల్లింపులను స్వీకరిస్తున్నారని చెప్పారు.

కొత్త కార్యక్రమాలు
* ఈ సందర్భంగా గూగుల్‌ పలు కొత్త కార్యక్రమాలను ప్రకటించింది. ‘ప్రసార భారతి’ కోసం కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. చిన్న వ్యాపార సంస్థలు డిజిటల్‌ సాధనాలను ఎలా ఉపయోగించాలి, ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా సర్దుబాటు వంటి అంశాలపై దూర్‌దర్శన్‌లోని కార్యక్రమాలను దీనికింద ప్రసారం చేస్తారు.
* దేశవ్యాప్తంగా ఉన్న 22వేల పాఠశాలల్లోని పది లక్షల మంది ఉపాధ్యాయులకు ఈ ఏడాది చివరిలోగా శిక్షణ ఇవ్వడానికి సీబీఎస్‌ఈతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు గూగుల్‌ ప్రకటించింది.
* అల్పాదాయ వర్గాల కోసం 10 లక్షల డాలర్ల మేర గూగుల్‌.ఓఆర్‌జీ గ్రాంట్‌ను కైవల్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్లు కూడా వెల్లడించింది.

ఫలప్రదమైన చర్చలు: మోదీ
పిచాయ్‌తో ఫలప్రదమైన చర్చలు సాగించినట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘‘సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారత రైతులు, యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల జీవితాల్లో పరివర్తన తీసుకురావడంపై చర్చలు జరిపాం’’ అని పేర్కొన్నారు. డేటా భద్రత, వ్యక్తిగత వివరాల గోప్యతపై ఆందోళనలు, వ్యవసాయంలో ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ఆన్‌లైన్‌ విద్య పరిధి పెంపు, క్రీడల్లో ఆగ్‌మెంటెడ్‌ రియాల్టీ, వర్చువల్‌ రియాల్టీ వంటి అంశాలపై పిచాయ్‌తో మోదీ చర్చించారని ప్రధాని కార్యాలయం పేర్కొంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.