close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మంత్రి మండలి తీర్మానం సమర్పించండి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సచివాలయం కూల్చివేతపై 15 వరకు స్టే కొనసాగింపు

ఈనాడు, హైదరాబాద్‌: సచివాలయం కూల్చివేతకు సంబంధించి మంత్రిమండలి తీసుకున్న తీర్మానం వివరాలను సీల్డ్‌ కవర్‌లో అందజేయాలంటూ ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటరుపై తిరుగు(రిప్లయ్‌) కౌంటరు దాఖలు చేయాలంటూ పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగుతుంది.  సచివాలయం కూల్చివేతపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. సచివాలయం కూల్చివేతకు మంత్రిమండలి తుది నిర్ణయం తీసుకుందా? అన్న ప్రశ్నకు అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ సమాధానమిస్తూ ఇది సర్క్యులేషన్‌లో ఉందని, ఇది ప్రివిలైజ్డ్‌ డాక్యుమెంట్‌ అని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ గతంలో మంత్రిమండలి మధ్యంతర తీర్మానంపై ఈ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఏజీ స్పందిస్తూ ప్రభుత్వ విధాన నిర్ణయాలను కోర్టులు సమీక్షించజాలవని తీర్పు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ గతంలో మంత్రిమండలి తీర్మానం ప్రజల్లోకి వచ్చిందని, దాని చట్టబద్ధతను సవాలు చేస్తూ పిటిషన్‌లు దాఖలయ్యాయంది. జూన్‌ 30న మంత్రిమండలి తీర్మానానికి సంబంధించిన ఊసే లేదంది. సచివాలయం కూల్చివేతకు సంబంధించి మంత్రిమండలి తుది నిర్ణయం తీసుకున్నట్లు పత్రికా ప్రకటనా విడుదల చేయలేదంది. కనీసం జడ్జిలకైనా సీల్డ్‌ కవర్‌లో ఇవ్వవచ్చుగా అని ప్రశ్నించింది. ఏజీ స్పందిస్తూ సాయంత్రానికల్లా సీల్డ్‌ కవర్‌లో పంపుతామని హామీ ఇచ్చారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ జోక్యం చేసుకుంటూ కొత్త సచివాలయ నిర్మాణం, పాత భవనాల కూల్చివేత పర్యావరణ చట్టాలకు విరుద్ధమని మధ్యంతర దరఖాస్తు చేశామని, దానిపై కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించాలని కోరారు.


నిబంధనలు ఉల్లంఘించలేదు: ప్రభుత్వం

సచివాలయ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు అమలు చేయలేదన్న పిటిషనర్‌ వాదన తప్పని ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కౌంటరు దాఖలు చేశారు. రూల్‌ 4(3)ను ఉల్లంఘించలేదని, కూల్చివేత పనులను ఈ నెల 7న ఉదయాన్నే మొదలుపెట్టామని, వాయు కాలుష్యం లేకుండా.. ప్రజలకు ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఎవరి ప్రాథమిక హక్కులకూ భంగం వాటిల్లలేదన్నారు. మంత్రిమండలి తుది నిర్ణయం తీసుకోలేదన్నది అవాస్తవమని, గత తీర్మానానికి అనుగుణంగా కూల్చివేయాలని, అక్కడ ప్రతిష్ఠాత్మక భవనాన్ని నిర్మించాలని మంత్రిమండలి ఏకగ్రీవంగా జూన్‌ 30న తీర్మానించిందన్నారు. పాత భవనాల కూల్చివేతకు ఈ నెల 4న ఆర్‌అండ్‌బీ శాఖ అనుమతి మంజూరు చేసిందని, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సమర్పించిన వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను పరిశీలించి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ అనుమతి మంజూరు చేశారని వివరించారు. పిటిషనర్లు రాజకీయ ప్రయోజనాలతో దాఖలు చేశారని, పిటిషన్‌ను కొట్టివేసి కూల్చివేతలు నిలిపేయాలన్న మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని అభ్యర్థించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.