close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గహ్లోత్‌ పక్షాన!

సీఎల్పీ భేటీలో 109 మంది ఎమ్మెల్యేల మద్దతు
తొలి అంకంలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రిదే పైచేయి!!
గుంభనంగా ఉన్న సచిన్‌ పైలట్‌.. సమావేశానికి గైర్హాజరు
నేడు మరోసారి సీఎల్పీ భేటీ.. యువనేతకూ ఆహ్వానం
రిసార్టుకు తరలిన ఎమ్మెల్యేలు
వైభవ్‌ గహ్లోత్‌ భాగస్వాముల ఇళ్లలో ఐటీ సోదాలు

ఈనాడు-దిల్లీ, ఈటీవీ భారత్‌: రసవత్తరంగా తయారైన రాజస్థాన్‌ రాజకీయాల తొలి అంకంలో ముఖ్యమంత్రి అశోక్‌గహ్లోత్‌ది పైచేయి అయింది. సోమవారం జైపుర్‌లోని తన అధికారిక నివాసంలో అశోక్‌ గహ్లోత్‌ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం నిర్వహించి, తనకు బలం ఉందని చాటుకున్నారు. 200 మంది సభ్యులున్న అసెంబ్లీలో 109 మంది తమ పక్షాన ఉన్నట్లు ఆయన వర్గం ప్రకటించింది. ఈ సమావేశానికి 104 మంది హాజరై మద్దతు పలకగా, మరో ఐదుగురు లేఖలు పంపినట్లు వెల్లడించింది. తిరుగుబావుటా ఎగరేసిన ఉప ముఖ్యమంత్రి సచిన్‌పైలట్‌ వర్గం దీనికి గైర్హాజరైంది. అధిష్ఠానం ముమ్మరంగా సాగించిన చర్చోపచర్చల మీదట మంగళవారం మరోసారి సీఎల్పీని సమావేశపరచాలని నిర్ణయించారు. దానికి పైలట్‌నూ రప్పించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే పైలెట్‌ అడుగులేమిటన్నది అంతుచిక్కడం లేదు.

గహ్లోత్‌ను తక్కువ అంచనా వేయలేం
గహ్లోత్‌ శక్తి సామర్థ్యాలు తెలిసిన వారు ఆయన్ని తక్కువగా అంచనా వేయడంలేదు. సీఎల్పీ సమావేశానికి ముందు గహ్లోత్‌ తనయుడు వైభవ్‌ గహ్లోత్‌ వ్యాపార భాగస్వాముల ఇళ్లపై ఐటీ దాడులు చేయడం కొంత కలకలం రేపింది. సీఎం మాత్రం నిబ్బరంగా తొలి అంకాన్ని పూర్తి చేశారు. సోనియాగాంధీపై, రాహుల్‌గాంధీపై, తన నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ శాసనసభాపక్షం ద్వారా ఆయన ఏకగ్రీవ తీర్మానం చేయించుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందులో చెప్పించారు. ఎక్కడా పైలట్ పేరు ప్రస్తావించలేదు.

భాజపా కుయుక్తుల కుట్ర ఇది: సీఎల్పీ
‘‘ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత అప్పగించారు. అద్భుతంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చూసి భయాందోళనలకు గురైన భాజపా నాయకులు తమ కుయుక్తుల ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బేరసారాలు మొదలుపెట్టారు. ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలను సీఎల్పీ ఏకగ్రీవంగా ఖండిస్తోంది. గహ్లోత్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి సీఎల్పీ ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు ఇస్తోంది. కాంగ్రెస్‌ సభ్యులెవరైనా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, కుట్రలు చేసేవారితో చేతులు కలిపితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని సీఎల్పీ తీర్మానంలో పేర్కొన్నారు.

అత్తెసరు ఆధిక్యం సరిపోతుందా?
బలాన్ని చాటుకునేందుకు మీడియాను సీఎం తన నివాసంలోకి పిలిచారు. అందరూ మీడియా ముందు విజయ చిహ్నం చూపించారు. ముందు వరసలో సచిన్‌ సన్నిహిత ఎమ్మెల్యేలను కూర్చొబెట్టి, ప్రత్యర్థి వర్గంపై మానసిక గెలుపు సాధించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రికి 102 మంది సభ్యుల మద్దతున్నట్లు ఆయన వర్గం ప్రకటించుకొంది. అయితే అది మెజార్టీ మార్క్‌(101) కన్నా ఒక్కటి మాత్రమే ఎక్కువ. బలనిరూపణ సమయానికి ఎంతమంది ఏ పక్షాన ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. పైలట్‌ తన వద్ద 25 మంది ఎమ్మెల్యేలున్నట్లు పరోక్షంగా చెప్పుకున్నా.. గహ్లోత్‌వైపే మెజార్టీ సభ్యులున్నారని తెలిసిన తర్వాత అందులో ఎంతమంది చివరివరకు పైలట్కు అండగా నిలబడతారన్న ప్రశ్నా ఉదయిస్తోంది. రాజకీయంగా తలపండిన గహ్లోత్‌ మాత్రం యువనేతను ఒంటరి వాడిని చేయడానికి సాధ్యమైనంత ఎక్కువ మందిని తనవైపు లాక్కొనేందుకు ప్రయత్నిస్తారని విశ్లేషకులు అంటున్నారు.

రంగంలోకి ప్రియాంక, రాహుల్‌
రాజస్థాన్‌లో పరిస్థితులను చక్కదిద్దడానికి పార్టీ అగ్రనేతలు ప్రియాంకాగాంధీ, రాహుల్‌గాంధీ రంగంలోకి దిగినట్లు వార్తలు వచ్చాయి. గహ్లోత్‌, పైలట్‌లతో ఆమె మాట్లాడినట్లు సమాచారం. సమస్య పరిష్కరిస్తామని పైలట్‌కు వారు భరోసా ఇచ్చారు. రాహుల్‌గాంధీ తన సన్నిహిత మిత్రుడైన మహారాష్ట్ర యువ ఎంపీ రాజీవ్‌ సటావ్‌ను పైలట్‌ వద్దకు దూతగా పంపినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం కుమారుడు వైభవ్‌ గహ్లోత్‌ వ్యాపార భాగస్వాములైన ధర్మేంద్ర రాథోడ్‌, రాజీవ్‌ అరోరాల ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఈ సమయంలో దాడులు చేయడాన్ని కాంగ్రెస్‌ తప్పుపట్టింది. జైపుర్‌, కోటా, దిల్లీ, ముంబయిల్లో 24 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిగాయి. భాజపా నాయకత్వం ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలన్నా ఆ పార్టీ ‘‘అనుబంధ విభాగాలైన’’ సీబీఐ, ఐటీ, ఈడీలు ముందు నిలబడతాయని, వీటిని అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని  దెబ్బతీయాలని ఆ పార్టీ చూస్తోందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా ఆరోపించారు. సీఎల్పీ సమావేశానికి పైలట్‌తోపాటు, ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. 13 మంది స్వతంత్రుల్లో 10 మంది గహ్లోత్‌కు మద్దతుగా నిలబడ్డారు. సీఎల్పీ భేటీ తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బస్సుల్లో జైపుర్‌ శివార్లలోని రిసార్టుకు వెళ్లి, అక్కడే బస చేశారు. మంగళవారం అక్కడే మరోసారి సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ‘కుటుంబంలో సమస్యలుంటే అంతా కూర్చొని వాటిని పరిష్కరించుకుంటారు. సచిన్‌ పైలట్‌తోపాటు ఎమ్మెల్యేలంతా మా కుటుంబసభ్యులే. వారు సీఎల్పీ సమావేశానికి హాజరై, సమస్యలుంటే చెప్పి పరిష్కరించుకోవచ్చు. ఎంత పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులైనా పార్టీ వేదిక ముందుకొచ్చి చర్చించుకోవాలి’ అని సూర్జేవాలా పిలుపునిచ్చారు.

పైలట్‌ తొందరపడ్డారా?
రాజస్థాన్‌లో ప్రస్తుత సంక్షోభానికి గహ్లోత్‌, సచిన్‌లు ఇద్దరూ కారణమేనన్న విమర్శ కూడా ఉంది. చిన్న వయస్సులోనే కాంగ్రెస్‌పార్టీ ద్వారా కేంద్ర మంత్రి పదవి, పీసీసీ అధ్యక్ష పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సచిన్‌పైలట్‌.. సీఎం పదవి చేపట్టడానికి మరికొన్ని రోజులు వేచిచూసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం తటస్థ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆయన తొందరపాటుతో తిరుగుబాటు జెండా ఎగరేశారన్న అభిప్రాయం ఉంది. మరోవైపు- అశోక్‌ గహ్లోత్‌ తన తనయుడు వైభవ్‌ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సచిన్‌కు రాజకీయంగా సమాధికట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆధిక్యాన్ని సీఎం నివాసంలో కాకుండా అసెంబ్లీలో రుజువు చేసుకోవాలని పైలట్‌ వర్గ నేత ఒకరు అన్నారు. తమనేత భాజపాలో చేరడం లేదని చెప్పారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.