close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గాంధీలో పరీక్షలు చేయాల్సిందే

ఆసుపత్రుల వివరాలన్నీ వెల్లడించాలి
  వాటన్నింటినీ పత్రికల్లో ప్రచురించాలి
  డ్యాష్‌ బోర్డులు ఏర్పాటు చేయాలి
  వివరాలతో నివేదిక సమర్పించండి
  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

గాంధీలో పరీక్షలు చేయరు. చికిత్స చేస్తామంటారు. నేను సితార్‌ ప్లేయర్‌ను...కానీ వాయించను అన్నట్లుంది వ్యవహారం. మెటర్నిటీ ఆస్పత్రి పెట్టి కేవలం ప్రసవాలు మాత్రమే చేస్తాం.. పరీక్షలు మరోచోట చేసుకోండి అంటే ఎలా? ప్రజలు చనిపోతే మాకేంటి అన్నట్లుండే యంత్రాంగం తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజ్యాంగంలోని జీవించే హక్కు అందరికీ వర్తిస్తుంది. గాంధీలో ఆర్‌టీపీసీఆర్‌ కిట్లున్నాయని ఏజీ చెబుతారు. అవి గర్భిణులకే అని డీఎంఈ చెబుతారు. జాలిలేని మనస్తత్వం అర్థం కావడంలేదు. పరీక్ష కేంద్రం ఏర్పాటు ప్రభుత్వ బాధ్యత. గర్భిణులకే కిట్లను వినియోగిస్తామని, ఇతరులకు లేదని చెప్పడానికి కారణాలను ఊహించలేం. పరీక్షలు నిర్వహించకుండా వెనక్కి పంపడం రాజ్యాంగంలోని అధికరణ 21కు ఉల్లంఘనే.

గాంధీ ఆస్పత్రి మొదటి కొవిడ్‌ ఆసుపత్రిగా గుర్తింపు పొందిందన్నది అందరికీ తెలిసిన విషయం. ఎక్కువ మంది కరోనా బాధితులు కూడా ఇక్కడికి వస్తుంటారు. పరీక్ష కేంద్రం లేదన్న కారణంగా రోగులు వెనక్కి వెళ్లిపోరాదు. ఒకవేళ అలా వెళ్లినపుడు ఆ రోగి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చు. అందువల్ల ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే 1500 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టింగ్‌ కిట్‌లు ఉండగా, అవసరమైతే మరిన్ని అందుబాటులో ఉంచుతామని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ చెబుతున్నపుడు పరీక్షలను నిరాకరించి వెనక్కి పంపడానికి సరైన కారణం లేదు. కేవలం గర్భిణులకే కాకుండా కొవిడ్‌ లక్షణాలున్న అందరికీ పరీక్షలు నిర్వహించాలి.         - హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న అన్ని రకాల బెడ్‌ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘ఏయే ఆసుపత్రులను కొవిడ్‌కు కేటాయించారు? ఎలాంటివాటికి చికిత్స అందిస్తారు? అనే మొత్తం వివరాలను ప్రజలకు తెలియజేయాలి. వీటిపై పత్రికల్లో ప్రచురించాలి’ అని స్పష్టం చేసింది. కొవిడ్‌ ఆసుపత్రులుగా గుర్తించిన 87 ప్రైవేటు ఆసుపత్రుల జాబితాను వెల్లడించాలని, కోర్టు ఉత్తర్వుల అమలుపై వాస్తవాలతో సమగ్ర నివేదికను ఈనెల 24లోగా సమర్పించాలంటూ విచారణను 27కు వాయిదా వేసింది.
బోధనాసుపత్రులను కొవిడ్‌ ఆసుపత్రులుగా గుర్తించాలని, పడకల వివరాలను తెలియజేస్తూ డ్యాష్‌ బోర్డులు ఏర్పాటు చేయాలంటూ డాక్టర్‌ ఆర్‌.శ్రీనివాసన్‌, శివ గణేష్‌ కర్ణాటిలు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డిలు హాజరయ్యారు.వారు కొన్ని వివరాలను హైకోర్టుకు తెలిపారు.‘‘హైదరాబాద్‌ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన 13 బోధనాసుపత్రులను కొవిడ్‌ ఆసుపత్రులుగా గుర్తించాం. 8 ప్రభుత్వ, 5 ప్రైవేటు బోధానాసుపత్రులు, రంగారెడ్డిలో 7 ప్రైవేటు, కరీంనగర్‌లో 2, మెదక్‌లో 3, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లో ఒక్కోదానిని కొవిడ్‌ ఆసుపత్రిగా గుర్తించాం., జీహెఎచ్‌ఎంసీ పరిధిలో 87 ప్రైవేటు ఆసుపత్రులను కొవిడ్‌కు చికిత్స నిమిత్తం కేటాయించాం. బెడ్‌లు ఖాళీ ఉన్నాయి. 54 ఆసుపత్రుల్లో 8834 బెడ్‌లు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ను కొత్తగా ప్రారంభించాం.అక్కడ 1200 బెడ్‌లుండగా 384 ఆక్సిజన్‌, 57 వెంటిలేషన్‌ బెడ్‌లు, బైప్యాప్‌ సౌకర్యం ఉన్నవి 10 బెడ్‌లున్నాయి. గాంధీలో చికిత్సలు మాత్రమే ఇస్తున్నాం.పరీక్షలు నిర్వహించలేం. ఉన్న కిట్లతో గర్భిణులకు మాత్రమే పరీక్షలు చేస్తున్నాం. ఇతరులకు చేయలేం.’’ అని తెలిపారు. ఒక దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఈ వివరాలన్నీ ప్రజలకు తెలియడంలేదని, వాటన్నింటినీ తెలియజేయాల్సి ఉందని తెలిపింది.సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో 300 బెడ్‌లు కొవిడ్‌కు కేటాయించామని తెలిపారు.10 బెడ్‌లకు వెంటిలేటర్‌ ,214 బెడ్‌లకు ఆక్సిజన్‌ సౌకర్యం ఉందని తెలిపారు.ప్రస్తుతం 59 మంది చికిత్స పొందుతుండగా ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారని తెలిపారు


హైకోర్టు ఆదేశాలివి..

* ఆసుపత్రులకు సంబంధించి కీలకమైన, సున్నితమైన సమాచారం ప్రజలకు అందడంలేదు. కరోనా చికిత్సలు అందించే ఆసుపత్రులను చికిత్సల ఆధారంగా విభజన చేయాలి. ఏయే ఆసుపత్రులు ఏ రకమైన లక్షణాలున్నవారికి చికిత్స అందిస్తాయో పేర్కొనాలి. గాంధీ, ఉస్మానియాల్లో కేవలం కరోనా తీవ్రంగా ఉన్నవారికే వైద్యం అందిస్తుందని, మిగిలినవారు ఇతర ఆసుపత్రులకు వెళ్లాలంటూ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించాలి.
* ఆసుపత్రులను విభజించడంతోపాటు కరోనాకు కేటాయించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వివరాలను పత్రికల్లో ప్రకటించాలి. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో కొవిడ్‌ బెడ్‌లు, ఖాళీ ఉన్నవి, వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్నవి, సాధారణ మంచాలు తదితర వివరాలతో డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి. దీనివల్ల కరోనాతో బాధపడుతున్నవారు ఏ ఆసుపత్రికి వెళ్లాలన్నది స్పష్టంగా తెలుసుకోగలరు.
* ప్రభుత్వం రోజువారీగా విడుదల చేస్తున్న హెల్త్‌బులిటెన్‌తోపాటు బెడ్‌ల సంఖ్య, వివిధ ఆసుపత్రుల్లో ఏయే రకాల బెడ్‌లు ఖాళీలున్నాయో ప్రాంతీయ పత్రికలతోపాటు, హిందీ, హైదరాబాద్‌లో ప్రచురితమయ్యే ఆంగ్ల పత్రికల్లో ప్రచురించాలి.
* బెడ్‌ల ఖాళీల వివరాలను టెలిఫోనిక్‌ మెసేజ్‌ రూపంలో ఫోన్‌ చేసినపుడు అందరికీ అందేలా చూడాలి
* నాచారంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిని కూడా కొవిడ్‌ ఆసుపత్రిగా కేటాయించే అంశాన్ని పరిశీలించాలి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.