close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమిత్‌ షాకు కరోనా

తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌, కర్ణాటక సీఎం యడియూరప్పకు కూడా..
యూపీ మహిళా మంత్రి కన్నుమూత

దిల్లీ: దేశంలోని పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప(78)లకూ పాజిటివ్‌ వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏకైక మహిళా మంత్రి కమల్‌ రాణి వరుణ్‌ ఆదివారం కొవిడ్‌-19తో కన్నుమూశారు. మరోవైపు కరోనా చికిత్స పొందిన అగ్రనటుడు అమితాబ్‌ బచ్చన్‌ ముంబయిలోని నానావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

తనకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (55) స్వయంగా ట్వీట్‌ చేశారు. ‘‘కొన్ని ప్రాథమిక లక్షణాలు కనిపించిన అనంతరం కరోనా పరీక్ష చేయించుకున్నా. పాజిటివ్‌ అని తేలింది. నా ఆరోగ్యం బాగుంది. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరుతున్నా. గత కొద్ది రోజులుగా నాతో భేటీ అయినవారంతా తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. ఐసొలేషన్‌లో ఉండాలి’’ అని ఆ ట్వీట్‌లో తెలిపారు. ఆయన గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఇతర వ్యాధులు కూడా ఉండడంతో ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారు. ఆయన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ పాల్గొన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలను ఆ సమావేశంలో కచ్చితంగా పాటించారు కూడా. ఆయన త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖులు ఆకాంక్షించారు.
* ‘‘నాకు కరోనా పాజిటివ్‌ అని పరీక్షలో వెల్లడైంది. నేను బాగానే ఉన్నాను. వైద్యుల సలహామేరకు ఆసుపత్రిలో చేరాను. ఇటీవల కాలంలో నాతో సన్నిహితంగా ఉన్నవారంతా జాగ్రత్తలు తీసుకోవాలి. స్వీయ ఏకాంతవాసంలో ఉండాలి’’ అని యడియూరప్ప ట్విటర్‌ వేదికగా కోరారు.


కమల్‌రాణి అస్తమయం

కరోనా సోకి కొద్దికాలంగా చికిత్స పొందుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌ సాంకేతిక విద్యాశాఖ మంత్రి కమల్‌ రాణి వరుణ్‌ (62) మృతి చెందారు. జులై 18న ఆమెకు పాజిటివ్‌ రావడంతో తొలుత కాన్పూర్‌లోని ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో లఖ్‌నవూలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమెకు మధుమేహం, రక్తపోటు వంటి ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఆమె ప్రస్తుతం కాన్పూర్‌లోని ఘటంపూర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. ఆదివారం కాన్పూర్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.


క్వారంటైన్‌లో పురోహిత్

తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ (80)కు పాజిటివ్‌ వచ్చింది. ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్నారు. వ్యాధి లక్షణాలేవీ ఆయనలో బహిర్గతం కాలేదు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.  ఆయన రాజ్‌భవన్‌లోనే హోంక్వారంటైన్‌లో ఉంటే సరిపోతుందని వైద్యులు సిఫార్సు చేశారు. రాజ్‌భవన్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులకు పాజిటివ్‌ రావడంతో ఆయన జులై 29 నుంచి సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. ఇప్పటివరకు రాజ్‌భవన్‌లో పనిచేసే సిబ్బందిలో మొత్తం 87 మంది కరోనా బారినపడ్డారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.