close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పరిశ్రమల్లో అత్యధిక కొలువులు స్థానికులకే

నైపుణ్య ఉద్యోగాల్లో 50 - 60 శాతం
పాక్షిక నైపుణ్య విభాగాల్లో 70 - 80 శాతం
నూతన సచివాలయ భవనం నిర్మాణానికి అనుమతి.. ఆకృతి ఖరారు
హైదరాబాద్‌ నలుమూలలా పారిశ్రామిక గ్రిడ్‌
పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు
తెలంగాణ మంత్రి మండలి నిర్ణయాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ఇందుకు పరిశ్రమలను రెండు విభాగాలుగా చేసింది. మొదటి విభాగంలోని పరిశ్రమల్లో నైపుణ్యం గల మానవ వనరులలో 50 శాతం మంది స్థానికులు విధిగా ఉండాలి.
పాక్షిక నైపుణ్యం కేటగిరీలో 70 శాతం మంది స్థానికులను తీసుకోవాలి. విభాగం-2లోని పరిశ్రమల్లో ఇది 60, 80 శాతంగా ఉండి తీరాలని పేర్కొంది. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల్లో తెలంగాణ యువకులకు ఎక్కువ అవకాశాలు దక్కేలా విధానం రూపొందించాలని ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశ్రమల శాఖను ఆదేశించారు. దీనిపై మంత్రి కేటీ రామారావు ఆధ్వర్యంలో కసరత్తు చేసిన పరిశ్రమల శాఖ ముసాయిదా తయారు చేసింది. దీనిపై ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశం విస్తృతంగా చర్చించింది. తెలంగాణలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు రావాలని మంత్రి మండలి అభిప్రాయపడింది. 30కి పైగా అంశాలపై చర్చించారు.
హైదరాబాద్‌ గ్రిడ్‌
హైదరాబాద్‌ నగరంలో ఐటీ పరిశ్రమలు ఒకే చోట కాకుండా నగరం నలువైపులా విస్తరించాలని మంత్రిమండలి అభిప్రాయపడింది. హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల ఐటీ కంపెనీలు పెట్టే వారికి అదనపు ప్రోత్సాహకాలు అందించే హైదరాబాద్‌ గ్రిడ్‌ విధానాన్ని ఆమోదించింది.
ఇంధన నిల్వ పరిష్కార విధానం
పెరిగిపోతున్న వాహనాల వల్ల ఎక్కువయ్యే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని మంత్రి మండలి నిర్ణయించింది. ప్రత్యేక రాయితీలు ఇచ్చి రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పరిశ్రమను ప్రోత్సహించాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇంధన నిల్వ పరిష్కార విధానాన్ని ఆమోదించింది.
స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు ఇవీ ప్రోత్సాహకాలు
(ఇవి టీఐడియా, టీప్రైడ్‌ పథకాల కింద లభించే ప్రోత్సాహకాలకు అదనం)
* మధ్యతరహా పరిశ్రమలకు విభాగం-1లో అదనంగా 5శాతం జీఎస్టీ ప్రోత్సాహకాలు, విభాగం-2లో అదనంగా 10శాతం. భారీ పరిశ్రమలకు విభాగం-1లో 5శాతం, విభాగం-2లో అదనంగా 10శాతం ప్రోత్సాహకాలు.
* విద్యుత్‌లో: విభాగం-1లో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు అయిదు సంవత్సరాలపాటు యూనిట్‌కు 50 పైసల పరిహారం, మధ్యతరహా, భారీ పరిశ్రమలకు యూనిట్‌కు 75 పైసల పరిహారం, విభాగం-2లో అన్ని రకాల పరిశ్రమలకు యూనిట్‌కు  రూపాయి చొప్పున పరిహారం
* పెట్టుబడి రాయితీలో..: సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రెండు విభాగాల్లో అదనంగా అయిదు శాతం రాయితీ.
* నైపుణ్య వృద్ధికి చేసే వ్యయంలో : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో  నైపుణ్యం గల  మానవ వనరుల కోసం ఒకసారి శిక్షణకు అయ్యే ఖర్చులో ఒక్కొక్కరికి రూ.3000కి తగ్గకుండా 50 శాతం ఖర్చు చెల్లింపు. భారీ పరిశ్రమలకు రూ.5000 పరిమితితో వంద శాతం ఖర్చు చెల్లింపు.

హైదరాబాద్‌ గ్రిడ్‌ విధానం ఇదీ
హైదరాబాద్‌ నుంచి ఐటీ ఎగుమతుల్లో గడిచిన వార్షిక సంవత్సరంలో(2019-20) 18 శాతం వృద్ధి నమోదైంది. కేంద్ర సగటు కంటే ఇది చాలా ఎక్కువ. మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, తదితర పశ్చిమ ప్రాంతాల్లోనే దాదాపు 90 శాతం ఐటీ రంగం కేంద్రీకృతమైంది.  ఉత్తరాన (కొంపల్లి, పరిసరాలు), తూర్పు (ఉప్పల్‌ / పోచారం), దక్షిణం (శంషాబాద్‌, ఆదిభట్ల), నార్త్‌వెస్ట్‌ (కొల్లూరు/ఉస్మాన్‌నగర్‌), ఇతర ప్రాంతాల్లో ఐటీ వృద్ధిని ప్రోత్సహించడానికి హైదరాబాద్‌ గ్రిడ్‌ విధానం ఉపకరిస్తుంది. దీని ద్వారా వచ్చే ఐదేళ్లలో 100  ఎకరాల  పారిశ్రామిక పార్కులలో ఐటీ పార్కులు వెలుస్తాయని అంచనా.  పశ్చిమ కారిడార్‌ వెలుపలి ప్రాంతాల్లో (ఉప్పల్‌/ పోచారం / ఘట్‌కేసర్‌ / కొంపల్లి / ఇతర ప్రాంతాలు) సుమారు 10 మిలియన్‌ చదరపు అడుగుల అంతర్నిర్మిత స్థలాన్ని, ఒక లక్ష కొత్త ఐటీ/ఐటీఈఎస్‌ ఉద్యోగాలు సృష్టించడానికి అవకాశాలున్నాయి. పాలసీ విడుదల నుంచి ఐదేళ్ల కాలానికి గ్రిడ్‌ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయి. ఏదైనా సంస్థ ఆ ఐదేళ్ల వ్యవధిలో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రిడ్‌ పాలసీకి ప్రోత్సాహకాలుగా విడుదల చేయాల్సిన మొత్తం పదేళ్ల కాలంలో రూ.66.75 కోట్లు. మార్పిడి ఛార్జీల ద్వారా డెవలపర్లు నుంచి పొందే మొత్తం రుసుము రూ.150 కోట్లు.
ఇతర ప్రోత్సాహకాలు
పరిశ్రమల నుంచి ఐటీ పార్కు మార్పిడిని డెవలపర్లు ఎంచుకోవచ్చు. 50 శాతం మార్పిడికి అనుమతిస్తారు. ఇందులో మొత్తం అంతర్నిర్మాణ స్థలంలో గరిష్ఠంగా 50 శాతం వరకూ ఐటీయేతర(నివాస లేదా వాణిజ్య ఉపయోగం) వారు ఉపయోగించుకోవచ్చు.
* ఐటీ/ఐటీఈఎస్‌ సంస్థలకు యూనిట్‌ విద్యుత్‌కు రూ.2 రాయితీ, గరిష్ఠంగా సంవత్సరానికి రూ.5 లక్షలు దాటకుండా ఇస్తారు.
* ఐటీ/ఐటీఈఎస్‌ సంస్థలకు లీజు/అద్దె మీద 30 శాతం రాయితీ, గరిష్ఠంగా సంవత్సరానికి  రూ.10 లక్షలు దాటకుండా ఇస్తారు.
* 500 కంటే ఎక్కువమందికి ఉపాధినిచ్చే సంస్థ లేదా యూనిట్ల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీని రూపొందిస్తారు.


సచివాలయ ఆకృతికి ఆమోదం

తెలంగాణ కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తమిళనాడుకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు ఆస్కార్‌, పొన్నిలు రూపొందించిన భవన సముదాయాకృతికి అంగీకారం తెలియజేసింది. 25.5 ఎకరాల విస్తీర్ణంలో ఏడు అంతస్తుల భవన సముదాయం, పక్కనే నాలుగు భవనాలు, పచ్చిక బయళ్లు, పార్కింగు స్థలం తదితర అంశాలతో ఈ నమూనా ఉంది. కొత్త సచివాలయ నమూనాపై ఆర్కిటెక్ట్‌లు దృశ్య రూపక ప్రదర్శన ఇవ్వగా దాదాపు రెండు గంటల పాటు దీనిపైనే చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కొత్త సచివాలయ నిర్మాణ అవసరాన్ని మంత్రిమండలికి వివరించారు. సత్వరమే నిర్మాణం చేపట్టి ఏడాది లోపు దానిని పూర్తి చేయాలనే సంకల్పాన్ని తెలియజేశారు. సచివాలయ నిర్మాణం నిరాటంకంగా సాగుతుందని సీఎం వెల్లడించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.