close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆంధ్రప్రదేశ్‌ కోసమే అమరావతి

రాష్ట్రానికి కామధేనువు లాంటిది
రైతులపై విశాఖ వాసులకుండే కనికరమూ వైకాపా నేతలకు లేదు
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు

* ‘హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశా.  అప్పుడు లేని కులం అమరావతిలోనే వచ్చిందా? 30 ఏళ్లుగా కుప్పంలో ఒకే కులంవారు నాకు ఓట్లేసి గెలిపించారా? జగన్‌ వచ్చాకే నాకు కులం అంటగడుతున్నారు.
* ‘అమరావతి రైతులపై విశాఖ వాసులకు ఉండే కనికరం కూడా వైకాపా నాయకులకు లేకపోయింది. రైతుల పొట్టగొట్టి రాజధాని తమకు తీసుకురమ్మని విశాఖ వాసులు కోరబోరనేది నా ప్రగాఢ నమ్మకం.

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయాన్ని అందించే కామధేనువే అమరావతి అని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. ‘అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్‌ అనేది సరి కాదు.. ఆంధ్రప్రదేశ్‌ కోసమే అమరావతి’ అని స్పష్టం చేశారు. ‘అభివృద్ధి వికేంద్రీకరణలో భాగమే అమరావతి. అదో స్వయంసమృద్ధి ప్రాజెక్టు. పైసా ఖర్చు పెట్టకుండా అందులో వచ్చే డబ్బుతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తే భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది’ అని చెప్పారు. ‘33 వేల ఎకరాలు ఎందుకంటున్నారు? రైతులకిచ్చే స్థలాలు, రోడ్లు, ప్రజావసరాలకు పోను 8వేల నుంచి 9వేల ఎకరాలు ఉంటుంది. దాని ద్వారా ప్రభుత్వానికి తిరిగి డబ్బు వస్తుంది’ అని వివరించారు. ‘జగన్‌కు అమరావతి అంటే ఎందుకు ద్వేషం?’ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి శుక్రవారం వీడియో సమావేశం ద్వారా ఆయన విలేకరులతో మాట్లాడారు. పేర్కొన్న అంశాలు ఆయన మాటల్లోనే..

‘హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ అనేది అప్పట్లో ఆలోచనే. అది అంచలంచెలుగా ముందుకెళ్లింది. సైబరాబాద్‌, ఔటర్‌ రింగ్‌రోడ్డు, జినోమ్‌వ్యాలీ.. ఇలా ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు తెలంగాణకు ఆయువుపట్టు అయింది. అమరావతిలో 139 ప్రాజెక్టులను తెచ్చాం. వాటిని కొనసాగిస్తే రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ఆదాయం వచ్చేది. ఎన్నికలకు ముందు సీఎం జగన్‌ మొదలుకొని వైకాపా నాయకులంతా అమరావతి ఇక్కడే ఉంటుందంటూ ప్రజలను మోసం చేసి ఓట్లేయించుకున్నారు. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆగస్టు 3న సవాలు విసిరా. 48 గంటల తర్వాత మళ్లీ సవాలు చేశా. ఎన్నికలకు వారు భయపడుతున్నారు.

సీఎం మారితే రాజధాని మారుస్తారా?
సీఎం మారితే రాజధాని మారుస్తారా? ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కాదా? రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేయకపోతే వారికి నమ్మకం పోతుంది, ఇకపై భూములిచ్చేందుకు దేశంలో రైతులెవరూ ముందుకు రారు. రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం వచ్చే నగరం విశాఖపట్నమే. అక్కడ భోగాపురం విమానాశ్రయం, అక్కడివరకు బీచ్‌రోడ్డు, మెడ్‌టెక్‌ పార్కు, ఐటీ, ఫిన్‌టెక్‌కు ప్రాధాన్యమిచ్చాం. అయిదేళ్లలో పెట్టుబడుల సదస్సులూ నిర్వహించాం.

అదే నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మేము 160 ప్రాజెక్టులను ప్రకటించాం. వాటిని పూర్తి చేస్తే అదే నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ. అంతేగాని మూడు ముక్కలు చేస్తామంటే అభివృద్ధి ఎలా అవుతుంది? ఎన్టీఆర్‌ హయాంలో రాయలసీమలో చేపట్టిన ప్రాజెక్టుల పూర్తికి శ్రీకారం చుట్టాం. 63 ప్రాజెక్టులను చేపట్టి 23 పూర్తి చేసి రూ.64వేల కోట్లను ఖర్చుపెట్టాం. ప్రపంచమంతా తిరిగి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తే అందులో అధిక శాతం రాయలసీమకే వచ్చాయి. రూ.13,500 కోట్లతో కియా పరిశ్రమ వచ్చింది. వెనకబడిన ప్రాంతం అభివృద్ధికి దోహదపడింది. అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే ఎక్కడుంది? కర్నూలు, అనంతపురం వాసులు విశాఖపట్నం పోవాలంటే ఏదీ దారి’? అని ప్రశ్నించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.