close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జగన్‌తో సత్సంబంధాలున్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

కృష్ణా జలాల విషయంలో రాజీ పడం
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయ్‌
రాజకీయాల్లోకి వచ్చే యువతకు కేసీఆర్‌ ఆదర్శం
కరోనా టీకా ఎక్కడినుంచి వచ్చినా మేలే
ట్విటర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో తమకు సత్సంబంధాలున్నప్పటికీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. కృష్ణా జలాల్లో చట్టబద్ధమైన రాష్ట్ర హక్కుల కోసం పూర్తి స్థాయిలో పోరాడతామన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశామని తెలిపారు. భారత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా అందరికీ సమాన అవకాశాలు, గౌరవం లభించే రామ రాజ్యం రావాలన్నది తన కోరికని, అందుకు ప్రార్థిద్దామన్నారు. కరోనా చికిత్సకు భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్న రెండు ప్రైవేటు ఆసుపత్రులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, అవసరమైతే మరిన్ని కఠిన చర్యలకు వెనుకాడబోమన్నారు. కరోనా యుద్ధంలో ప్రజలంతా ప్రభుత్వంతో కలిసి రావాలని, చికిత్స కోసం సర్కారు దవాఖానాలకు వెళ్లాలని, అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్నారు.    ఎంసెట్‌, యూజీ, పీజీ పరీక్షల విషయాన్ని విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళతానని తెలిపారు. ‘కేటీఆర్‌ను అడగండి’ పేరిట ఆదివారం ట్విటర్‌ వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు

సేవలను గుర్తించాలి
ప్రభుత్వ ఆసుపత్రులు అందిస్తున్న సేవలకు ప్రజలు మరింత గుర్తింపు, గౌరవం ఇవ్వాలని కేటీఆర్‌ కోరారు. ‘‘గాంధీ తదితర ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది ఎంతో విలువైన సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే వేలాది మందికి చికిత్స అందించి సురక్షితంగా ఇంటికి పంపించారు. ప్రైవేటు ఆసుపత్రులు వైద్యం నిరాకరించిన వారికి సైతం ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కరోనా పరీక్షల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిక లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం మహమ్మారిపై పోరాడుతున్నాం. ఇప్పటికే సుమారు 1,200కు పైగా కేంద్రాల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 23 వేల మందికి పైగా పరీక్షలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇది 40 వేలకు పైగా పెరుగుతుంది. కరోనా మరణాల రేటు తెలంగాణలో ఒక శాతం కంటే తక్కువగా ఉంది. కోలుకునే వారి రేటు దేశంలోనే మెరుగ్గా 72 శాతంగా నమోదవుతోంది.

టీకాకు 6 నుంచి 9 నెలల సమయం పడుతుందంటున్నారు
కరోనాకు మొదటి టీకా తెలంగాణ నుంచే వస్తుందని ఆశిస్తున్నాను. అది ఇతర దేశాల నుంచి వచ్చినా సంతోషమే. టీకా అందుబాటులోకి రావడానికి 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని తయారీదారులు చెప్పారు.

మూడో వారంలో దుర్గం చెరువు తీగల వంతెన ప్రారంభం
ప్రపంచంలోనే ఎక్కువ సీసీటీవీ కెమెరాలు ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి కావడం గర్వకారణం. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం వీటి సంఖ్యను మరింతగా పెంచాలి. ఈ నెల మూడో వారంలో దుర్గం చెరువు తీగల వంతెనను ప్రారంభిస్తాం. మెట్రోరైలు, బస్సులు, ఎంఎంటీఎస్‌ వంటి ప్రజారవాణాను తిరిగి ప్రారంభించే విషయంలో కేంద్రం అనుమతి కోసం వేచి చూస్తున్నాం. టీఎస్‌ బీపాస్‌ పట్టణ సంస్కరణల్లో మైలురాయిగా నిలుస్తుంది. దీని ద్వారా ఇంటి నిర్మాణ అనుమతుల సమస్యలు తీరతాయి.

యువత రాజకీయాల్లోకి రావాలన్నది కేసీఆర్‌ ఆకాంక్ష
విద్యావంతులైన యువకులు రాజకీయాల్లోకి రావాలని కేసీఆర్‌ తరచూ చెబుతూ ఉంటారు. చదువుకున్న యువత మౌనం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి మంచిది కాదు. నాకు కేసీఆర్‌ తర్వాత బాగా నచ్చిన నేత ఒబామా. రాజకీయాల్లోకి వచ్చే యువతకు కేసీఆర్‌ ఆదర్శం.

రాష్ట్రమంతటిపై దృష్టి
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని పుర, నగరపాలికల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం. వాటికి నిరంతరం నిధులు ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా లక్ష్యాలు పెట్టి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. త్వరలోనే మంచి ఫలితాలు చూస్తారు’’ అని కేటీఆర్‌ అన్నారు.


త్వరలోనే పెట్టుబడులపై ప్రకటనలు

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటనలు ఉంటాయి. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న నిర్ణయం యువతకు ఉపయోగపడుతుంది. ప్రస్తుత ప్రపంచంలో నైపుణ్యం పొందడం(స్కిల్‌), దానికి మెరుగులు దిద్దడం(అప్‌ స్కిల్‌), తిరిగి నూతన నైపుణ్యాలు సాధించడం(రీస్కిల్‌) ఉద్యోగ మంత్రం. యువత ఆధునిక సాంకేతికతలపై దృష్టిసారించి ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకోవాలి. త్వరలోనే రంగారెడ్డి జిల్లాలోని ఎలిమినేడులో వైమానిక పార్కుకు శంకుస్థాపన ఉంటుంది. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మరో సంవత్సరంలో పూర్తవుతాయి. అప్పుడు గ్రామాల రూపురేఖలు మారతాయి. ఇప్పటికే పల్లె ప్రగతిలో భాగంగా పెద్ద ఎత్తున గ్రామాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.