close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హలధారికి అండ

రూ.లక్ష కోట్లతో వ్యవసాయ రంగంలో సదుపాయాలు
రైతుల ఖాతాల్లో నేరుగా ప్రధానమంత్రి కిసాన్‌ నిధి జమ
గ్రామాల్లోనే పుష్కలంగా ఉపాధి అవకాశాలు
ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి

ఈనాడు, దిల్లీ: ఆరుగాలం శ్రమించి అన్నం పెడుతున్న రైతులకు అండదండగా ఉండేందుకే కేంద్రం రూ.లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని అందుబాటులోకి తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రభుత్వం అందించే సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు చేపట్టామని అన్నారు.

అందులో భాగంగానే పీఎం కిసాన్‌ నిధి ఆరో విడత కింద 8.5 కోట్ల మంది రైతులకు రూ.17 వేల కోట్లను విడుదల చేస్తున్నామని తెలిపారు. హలధారి బలరాముడి జయంతి అయిన ‘హల షష్ఠి’ని పురస్కరించుకొని ప్రధాని ఆదివారం రూ.లక్ష కోట్ల నిధితో చేపట్టే కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. వ్యవసాయ ప్రాథమిక పరపతి సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం రైతులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘దేశంలో దశాబ్దాల క్రితం నిత్యావసర వస్తువుల చట్టం తీసుకొచ్చారు. ఆహార కొరత ఉన్నప్పుడు తెచ్చిన చట్టం ఆ తర్వాత రైతులకు, వినియోగదారులకు, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తున్నా ఇన్నాళ్లూ కొనసాగిస్తూ వచ్చారు. అందుకే దానిని మేం రద్దు చేశాం. ఇప్పుడు వ్యవసాయాధారిత వ్యాపారం చేసే వారికి ఆ భయాల నుంచి విముక్తి కల్పించాం’’ అని చెప్పారు.

ఏడేళ్ల ప్రయత్నాలు ఇప్పుడు సాకారం
‘రూ.లక్ష కోట్ల మౌలిక వసతుల నిధి వల్ల శీతల గిడ్డంగులు, గోదాములు తయారవుతాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద వ్యవసాయానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నాం. ఒకే దేశం... ఒకే మార్కెట్‌ ఏర్పాటు కోసం గత ఏడేళ్ల నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు సాకారమవుతున్నాయి. తొలుత ఈ-నామ్‌ ద్వారా సాంకేతిక వేదిక ఏర్పాటు చేశాం. ఇప్పుడు చట్టం ద్వారా మార్కెట్‌ యార్డుల నుంచి రైతులకు విముక్తి కల్పించాం. నచ్చిన ధరకు రైతులు ఎక్కడైనా అమ్ముకొనే వెసులుబాటు తెచ్చాం. వారు నేరుగా పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు చేసుకొనే చట్టాన్నీ తీసుకొచ్చాం. దీనివల్ల విత్తనం వేసేటప్పుడే రైతులకు ధర తెలుస్తుంది. మన దగ్గర పండించడంలో సమస్య లేదు. కోతల తర్వాత జరిగే నష్టమే రైతులకు, దేశానికి ఎక్కువ దెబ్బ కొడుతోంది. దీన్ని నివారించడానికి ఇప్పటివరకూ ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగించి రైతులకు నేరుగా మద్దతు కల్పిస్తున్నాం. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్‌ను ఇస్తున్నామంటే అది రైతుల శ్రమ ఫలమే’ అని ప్రధాని చెప్పారు.

పారిశ్రామికవేత్తలుగా వ్యవసాయదారులు
‘‘వ్యవసాయ మౌలిక వసతుల నిధితో రైతులు తమ ఊర్లోనే గోదాములు, శీతల గిడ్డంగులు, ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని పారిశ్రామికవేత్తలుగా మారడానికి వీలవుతుంది. ఈ రుణాలపై 3% వడ్డీ రాయితీ లభిస్తుంది. రైతు సంఘాలకు ఈ నిధి ఆర్థికంగా ఊతాన్నిస్తుంది. వ్యవసాయ మౌలిక వసతుల రంగంలో చాలా మార్పు వస్తుంది. గ్రామాల సమీపంలోనే వ్యవసాయ పరిశ్రమల సమూహాలను ఏర్పాటు చేస్తాం. ఏ విపత్తు వచ్చినా ఎక్కువ నష్టపోయేది చిన్నరైతులే. వారికి ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయి మద్దతు అందించడానికి ఆరున్నరేళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ‘కిసాన్‌ రైళ్లు’ ద్వారా చిన్న రైతులకు చాలా ప్రయోజనం లభించనుంది. అవి పట్టాలమీద నడిచే శీతల గిడ్డంగులు. వ్యవసాయ ఉత్పత్తులకు నష్టం జరగకుండా చూడడంతో పాటు వినియోగదారులకూ తాజా వస్తువులు లభించడానికి ఇవి ఉపయోగపడతాయి. రైతులు తక్కువ ధరకు ఉత్పత్తులను అమ్ముకొనే బాధ తప్పుతుంది. మేం చేపట్టిన పథకాలు 21వ శతాబ్దంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేస్తాయి’’ అని మోదీ వివరించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.