close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పగబట్టిన మృత్యువు

విజయవాడ కొవిడ్‌ చికిత్స కేంద్రంలో మంటలు
10 మంది దుర్మరణం
కరోనా రోగులను హోటల్‌లో ఉంచి చికిత్స అందిస్తున్న రమేష్‌ ఆసుపత్రి
దట్టమైన పొగతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి
నిద్రలోనే ప్రాణాలు విడిచిన పలువురు

వారంతా కరోనా చికిత్సల కోసం అక్కడకు వచ్చారు.. వ్యాధి నయమై ఇళ్లకు వెళ్లిపోతామనుకున్నారు. అంతలోనే నిర్లక్ష్యపు మంటలువారిని కమ్ముకున్నాయి. గాఢ నిద్ర నుంచి కళ్లు తెరిచేలోపే అప్పటికే అలసిన ఊపిరితిత్తుల నిండా పొగ కమ్ముకుంది. ఆదుకునే ఆపన్నులు వచ్చేలోపే వాళ్ల బతుకులు తెల్లారిపోయాయి. కొవిడ్‌ సంరక్షణ కేంద్రంగా ఉన్న విజయవాడలోని ఓ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామునే చెలరేగిన మంటలు.. పది నిండుప్రాణాలను బలిగొన్నాయి. ఆ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి.


ప్రమాదం  జరిగిన సమయం తెల్లవారుజాము 4.45 గంటలు
ప్రమాద సమయంలో హోటల్లో ఉన్నవారు 31 మంది
హోటల్‌, ఆసుపత్రి  సిబ్బంది 13 మంది


ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్‌, విజయవాడ: విజయవాడలో ప్రైవేటు కొవిడ్‌ చికిత్సా కేంద్రంగా మార్చిన స్వర్ణప్యాలెస్‌ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది మరణించారు. దట్టమైన పొగ పీల్చడంతో, అస్వస్థతకు గురైన మరో 21 మందిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి మెరుగుపడటంతో ఇళ్లకు పంపగా, 15 మంది చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని రమేష్‌ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. వారిలో 9 మంది దట్టమైన పొగ పీల్చడం వల్ల ఊపిరాడక చనిపోగా, ఒక మహిళ శరీరం పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే ఏడుగురు మరణించగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, హోటల్‌ సిబ్బంది కలిపి 13 మంది ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మృతుల కుటుంబసభ్యులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఇస్తామని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. విజయవాడ ఏలూరు రోడ్డులో ఉన్న స్వర్ణప్యాలెస్‌ హోటల్‌ను రమేష్‌ ఆసుపత్రి లీజుకు తీసుకుని, కొవిడ్‌ చికిత్సా కేంద్రంగా మార్చింది. జులై 18 నుంచి అక్కడ రోగులు చికిత్స పొందుతున్నారు.

క్షణాల్లో కమ్మేసిన అగ్నికీలలు
స్వర్ణప్యాలెస్‌ హోటల్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌ కాకుండా, మరో ఐదు అంతస్తులున్నాయి.  చికిత్స పొందుతున్న కొవిడ్‌ రోగులు ఒకటి నుంచి మూడు అంతస్తుల్లోని గదుల్లోనే ఉన్నారు. హోటల్‌ సిబ్బంది కథనం ప్రకారం.. తెల్లవారుజామున 4.45 గంటల సమయంలో మొదటి అంతస్తులోని కంప్యూటర్‌ సర్వర్‌ రూంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. కొన్ని నిమిషాల్లోనే మంటలు, దట్టమైన పొగ ఆవరించాయి. చూస్తుండగానే నాలుగో అంతస్తు వరకు మంటలు ఎగబాకాయి. సిబ్బందిలో కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. మరికొందరు గదుల్లో నిద్రపోతున్న రోగుల్ని రక్షించేందుకు పరుగులు పెట్టారు. కానీ నల్లటి పొగ కమ్ముకుని, కళ్లు కనిపించకపోవడంతో బయటకు వచ్చేశారు. వారిలో ఒకరు అక్కడకు సమీపంలోనే ఉన్న అగ్నిమాపక కేంద్రానికి 5.09 గంటలకు సమాచారం అందించారు. 5.13 గంటలకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని, రక్షణ చర్యలు చేపట్టారు. కాసేపటికే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులూ చేరుకున్నారు. హోటల్‌ లోపలకు వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ద్వారం ఒక్కటే ఉండటం సహాయ చర్యలకు ప్రతిబంధకంగా మారింది.  మంటలు ఆర్పుతూనే,  ఒకటి, రెండో అంతస్తుల కిటికీల వరకు నిచ్చెనలు వేసి రోగులను కిందకు తీసుకొచ్చి  అంబులెన్సులలో రమేష్‌ ఆసుపత్రికి తరలించారు.

నిద్రలోనే పోయిన ప్రాణాలు
మంటలు క్షణాల్లోనే వ్యాపించడం, అప్పటికి అందరూ గాఢనిద్రలో ఉండటంతో.. రోగుల్లో చాలామంది ఏం జరిగిందో తెలిసేలోగానే దట్టమైన పొగ పీల్చి ఊపిరాడక నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ప్రమాదాన్ని గుర్తించిన కొందరు.. కిందకు దిగివచ్చే దారిలేక, బాల్కనీలోకి చేరుకుని తమను రక్షించాలంటూ కేకలు పెట్టారు.  మూడో అంతస్తులో ఉన్నవారు కిటికీల అద్దాలు పగలగొట్టి, తమను కాపాడాలని హాహాకారాలు చేశారు. ముగ్గురు రోగులు, హోటల్‌లో పనిచేసే ఒక వ్యక్తి మొదటి అంతస్తు కిటికీ నుంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.

ఒకటే ద్వారం... పనిచేయని స్మోక్‌ డిటెక్టర్లు
కంప్యూటర్‌ సర్వర్‌ రూంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్లే అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్వర్ణప్యాలెస్‌లో విద్యుత్‌ సంబంధిత లోపాలున్నాయని, షార్ట్‌సర్క్యూట్‌ సంభవించే అవకాశం ఉందని హోటల్‌, రమేష్‌ ఆసుపత్రి యాజమాన్యాలకు ముందే తెలిసినా, ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందన్న ఉద్దేశంతో వాటిని సరిదిద్దకుండానే కొవిడ్‌ చికిత్సా కేంద్రం ప్రారంభించారని తహసీల్దారు తన నివేదికలో పేర్కొన్నారు. తహసీల్దారు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. రమేష్‌ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఏ1గా, స్వర్ణప్యాలెస్‌ యాజమాన్యాన్ని ఏ2గా పేర్కొన్నారు. ఐపీసీ 304 (పార్ట్‌-2), 308 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హోటల్‌లో కనీసం పొగను గుర్తించే పరికరాలు (స్మోక్‌ డిటెక్టర్లు) కూడా లేవని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు.

మెరుగైన వైద్యం అందించండి: సీఎం
అగ్నిప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైనవారికి మెరుగైన వైద్యసేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రధాని ఫోన్‌.. ప్రమాదంపై ఆరా
అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సీఎం జగన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద వివరాలను ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు. తెల్లవారుజామున ప్రమాదం జరిగిందని, కొందరు మరణించారని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. ఘటనపై ప్రధాని ఫోన్‌ చేసినట్లు సీఎం ట్విటర్‌లో వెల్లడించారు.

హోటల్‌ నిర్వహణతో సంబంధం లేదు
ప్రభుత్వ అనుమతితోనే స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌ను కొవిడ్‌ చికిత్సా కేంద్రంగా మార్చామని రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. హోటల్‌ నిర్వహణతో సంబంధం లేకుండా రోగులకు వైద్యసేవలు అందించే బాధ్యతనే రమేష్‌ హాస్పిటల్‌ నిర్వహించినట్టు తెలిపింది. ప్రమాద నేపథ్యంలో ఆసుపత్రి యాజమాన్యం ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది.

మృతుల వివరాలివీ..
కృష్ణా జిల్లా: సుంకర బాబూరావు (68), అజిత్‌సింగ్‌నగర్‌, విజయవాడ - మద్దాలి రమేష్‌ (57) మొగల్రాజపురం, విజయవాడ - డొక్కు శివబ్రహ్మయ్య (58), సర్కిల్‌పేట, మచిలీపట్నం -  మజ్జి గోపి (54), మచిలీపట్నం -  పొట్లూరి పూర్ణచంద్రరావు (80), కొడాలి, ఘంటశాల మండలం - భార్యాభర్తలు ఎస్‌.అబ్రహం(48), రాజకుమారి(45), జగ్గయ్యపేట
* ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన తల్లీకొడుకులు దుడ్డు వెంకట జయలక్ష్మి (49), దుడ్డు వెంకట నరసింహ పవన్‌కుమార్‌ (30)
* గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలుకు చెందిన కొసరాజు స్వర్ణలత (42)


ఆశలు ఆహుతి

కరోనా నుంచి వారు కోలుకుంటున్నారు. ఇంటికి చేరుకునేందుకు గంటలు లెక్కిస్తూ ఆసుపత్రిలో భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఊహించని విధంగా వారిని అగ్నికీలలు చుట్టుముట్టాయి. వాటి ధాటికి కొందరు కట్టెల్లా కాలిపోయారు.మరికొందరు తీవ్రగాయాలతో తల్లడిల్లారు.


కలిసి అనంతలోకాలకు..

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: వ్యాధి నయమై ఆసుపత్రి నుంచి వెళ్లాల్సిన భర్త.. తెల్లారితే భార్యను కూడా డిశ్ఛార్జి చేస్తారని చెప్పడంతో కలిసి ఇంటికి వెళ్దామనుకొని ఆగిపోయారు. ప్రమాదంలో భార్యతో సహా ఆయన కూడా అగ్నికి ఆహుతయ్యారు. స్వర్ణ ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్న కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన పాస్టర్‌ ఎస్‌.ఆర్‌.అబ్రహం, రాజకుమారి దంపతుల విషాదాంతం ఇది.


తల్లీకుమారుల మృతి

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా కందుకూరులోని గణేష్‌నగర్‌కు చెందిన దుడ్డు వెంకటప్రసాద్‌ జులై 30న కరోనాతో విజయవాడ రమేష్‌ ఆసుపత్రిలో చేరారు.  ఆయన భార్య వెంకటజయలక్ష్మి(49), పెద్ద కుమారుడు నరసింహ పవన్‌కుమార్‌(30)లు కూడా ఈ వ్యాధితో 5న చేరారు. 7న వెంకటప్రసాద్‌ డిశ్ఛార్జి కాగా,  తల్లీ, కుమారుడు కోలుకుంటున్నారు. అంతలోనే ఘోరం చోటు చేసుకుని ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పవన్‌కుమార్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఏడాదిన్నర కిందట పెళ్లయిన ఆయన భార్య ఏడు నెలల గర్భిణి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.