close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్య తప్పదు

ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వ హెచ్చరిక
ధరలు కనిపించేలా ప్రదర్శించాల్సిందే
పీపీఈ కిట్లకు గరిష్ఠ చిల్లర ధరే

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ చికిత్సలో భాగంగా నిర్వహించే అన్ని రకాల నిర్ధారణ పరీక్షల ధరలు అందరికీ కనిపించేలా పెద్ద అక్షరాలతో కచ్చితంగా ప్రదర్శించాలని ప్రైవేటు ఆసుపత్రులను తెలంగాణ సర్కారు ఆదేశించింది. 2019 డిసెంబరు నాటికి నిర్ణయించిన ధరలనే ప్రస్తుతం కొవిడ్‌ చికిత్సలకూ వర్తింపజేయాలని స్పష్టం చేసింది.
పీపీఈ కిట్లకు, ఎన్‌ 95 మాస్కులకూ కూడా గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)ను మాత్రమే స్వీకరించాలని తేల్చిచెప్పింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే ఆసుపత్రులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
అడ్డగోలు వసూళ్లు
కరోనా చికిత్సల్లో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో అడ్డగోలుగా రుసుములు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ప్రభుత్వం కొవిడ్‌ చికిత్సల ధరలను ఖరారు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా చికిత్స అందించినా.. ఒక రోజుకు ఐసోలేషన్‌లో రూ.4 వేలు, ఐసీయూలో రూ.7500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ చికిత్సకు రూ.9 వేల చొప్పున వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ ఉత్తర్వులు అత్యధిక ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అమలు కావడం లేదు. కొన్ని ఆసుపత్రులు పీపీఈ కిట్ల పేరిట కూడా రూ.లక్షల్లో బిల్లులు వసూలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ విషయంపై ప్రభుత్వం ఇటీవలే రెండు కార్పొరేట్‌ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పలు సందర్భాల్లో  ప్రైవేటు ఆసుపత్రుల వైఖరిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే మరింత కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. అయినా కొన్ని ఆసుపత్రుల తీరు మార్చుకోవడం లేదని అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో బుధవారం బీఆర్‌కే భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షలోనూ మరోసారి ఇదే విషయంపై చర్చ జరిగింది. ఈ సమయంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో మంత్రి నేరుగా ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి.. డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా ఉంటారా? అని గట్టిగానే మందలించినట్లు సమాచారం. ఇదే విషయంపై తుది హెచ్చరిక చేయడంలో భాగంగా.. ఆయా ఆసుపత్రుల ప్రతినిధులతో త్వరలో మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించారు.
అంటువ్యాధుల చట్టంతో కఠిన వైఖరి
కొవిడ్‌ వ్యాధి ప్రబలుతున్న దశలోనే ఈ ఏడాది మార్చిలోనే తెలంగాణ ప్రభుత్వం ‘అంటువ్యాధుల నియంత్రణ చట్టం (కొవిడ్‌19)- 2020’ను తెరపైకి తెచ్చింది. ఈ చట్ట ప్రకారం విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకునే అధికారముంటుంది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం శిక్షించడానికి వీలుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అనుసరిస్తున్న వైఖరితో  విసిగిపోయిన ప్రభుత్వం.. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడంతో పాటు భారీగా జరిమానా కూడా విధించే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.


తాజా ఉత్తర్వుల్లో...

* ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్‌ చికిత్సల్లో పారదర్శకతను తప్పనిసరిగా పాటించాలి.
* జనవరిలో ఆయా ఆసుపత్రులు సమర్పించిన నివేదికల్లో పేర్కొన్న ధరలే అమలుకు ప్రామాణికం కానున్నాయి.
* ధరల అమలును పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను నియమించనుంది. ఈ బృందాలు పాత, తాజా ధరలను, పీపీఈ కిట్ల వినియోగం, బిల్లుల్లో నమోదు చేస్తున్న సంఖ్య తదితర అంశాలను పరిశీలిస్తాయి.
* వ్యక్తిగత పరిరక్షణ వస్తువుల ధరలను కూడా విపణిలో వేర్వేరు సంస్థల గరిష్ఠ చిల్లర ధరలతో పోల్చుతారు.
ఎక్కడ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలినా.. ఆయా ఆసుపత్రులపై అంటువ్యాధుల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేస్తారు.
* ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.