close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సగం పడకలు సర్కారుకే

మెట్టుదిగిన ప్రైవేటు ఆసుపత్రులు
వైద్యమంత్రితో భేటీలో కీలక నిర్ణయం
నేడు విధివిధానాల ఖరారు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రుల్లో అడ్డగోలు వసూళ్లకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడనుంది. సగం పడకలను ప్రభుత్వం ఆధ్వర్యంలో భర్తీ చేయడానికి ఆయా దవాఖానాల యాజమాన్యాలు అంగీకరించడంతో వాటిని ప్రభుత్వం నిర్దేశించిన రుసుములతో భర్తీ చేయడానికి మార్గం సుగమమైంది. వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో బీఆర్‌కే భవన్‌లో గురువారం ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం జరిగినట్టుగా ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, వైద్యవిద్య సంచాలకులు  రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి కరుణాకరరెడ్డి, ఆరోగ్యశాఖ సలహాదారు, నిపుణుల కమిటీ సభ్యులు గంగాధర్‌, కిమ్స్‌ ఆసుపత్రి ఎండీ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

అనుమతులు..ఆరోపణలు..  ఆగ్రహాలు..చర్యలు
కరోనా చికిత్సలు అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రులకు సర్కారు అనుమతి ఇచ్చింది. ఇదే అదునుగా కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు అడ్డగోలుగా వ్యవహరించాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఖరారు చేసిన చికిత్సల ధరలను పక్కనపెట్టి దోపిడీకి పాల్పడ్డాయి. రెండు, మూడు రోజుల చికిత్సకు లక్షల్లో వసూలు చేసిన ఉదంతాలూ వెలుగులోకి వచ్చాయి. పీపీఈ కిట్లకు, మాస్కులకు అదనంగా లక్షల్లో వసూలు చేసినవీ ఉన్నాయి. ఈ పరిణామాలతో బాధితులు గగ్గోలు పెట్టారు. కొందరు బాధితులు ఆసుపత్రుల వద్ద ధర్నాలు చేశారు కూడా. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించగా, స్వయంగా వైద్యఆరోగ్యశాఖ ప్రకటించిన వాట్సప్‌ నెంబరుకే 1200కిపైగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తీరు మార్చుకోవాలంటూ స్వయంగా వైద్యమంత్రి ఆయా యాజమాన్యాలకు విన్నవించారు. అయినా మార్పు రాకపోవడంతో అంటువ్యాధుల నియంత్రణ చట్టం కింద చర్యలు చేపడుతామంటూ హెచ్చరించారు. రెండు ఆసుపత్రులకు ఇచ్చిన అనుమతులూ రద్దుచేశారు. హైకోర్టు కూడా ప్రైవేటు ఆసుపత్రుల తీరును తప్పుపట్టడం, అన్ని వైపుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు గురువారం నాటి సమావేశంలో ప్రైవేటు ఆసుపత్రులు దిగివచ్చాయి. ఐసొలేషన్‌, ఐసీయూ, వెంటిలేటర్‌ సహా అన్నింటిలో 50 శాతం పడకలను సర్కారుకు అప్పగించడానికి సానుకూలత వ్యక్తంచేసినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. పడకలను ఏ ప్రాతిపదికన, ఎలా భర్తీ చేయాలనే అంశంపై చర్చించేందుకు శుక్రవారం ప్రజారోగ్య సంచాలకుల సమక్షంలో ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు మరోసారి భేటీ కానున్నారు. ఇందులో పక్కాగా విధి విధానాలను రూపొందించనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం మార్గదర్శకాలు ఇలా ఉండబోతున్నాయి.

ఆన్‌లైన్‌లో కేటాయింపు..  ప్రత్యేకాధికారి పర్యవేక్షణ
*  అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం పడకలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.
*  ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెడతారు.
*  ఏఏ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఎన్ని ఐసొలేషన్‌, ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయి? ఎన్ని వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయనేది ఆన్‌లైన్‌లోనే ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.
*  పర్యవేక్షణ బాధ్యతను సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
*  ప్రభుత్వం నిర్దేశించిన చికిత్సల ధరను చెల్లించడానికి అంగీకరించిన వారికే వాటిలో పడకలను కేటాయిస్తారు.
*  గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లుగా పీపీఈ కిట్లు, మాస్కులు, ఇతర ఖరీదైన ఔషధాలకయ్యే ఖర్చును మాత్రం బాధితుడు అదనంగా భరించాల్సి ఉంటుంది. వీటికి కూడా గరిష్ఠ చిల్లర ధరను మాత్రమే స్వీకరించే విధంగా మార్గదర్శకాలు రూపొందిస్తారు.
*  ప్రైవేటులో ఐసొలేషన్‌-3216, ఆక్సిజన్‌ ఉన్నవి-3145, ఐసీయూ(వెంటిలేటర్లు ఉన్నవి)- 1518. మొత్తంగా 7,879 పడకలున్నాయి. వీటిలో సగం చొప్పున సర్కారు ఆధ్వర్యంలో భర్తీ చేసే పక్షంలో సుమారు 3,939 అదనంగా అందుబాటులోకి వస్తాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.