close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నోటీసులిచ్చినా స్పందించట్లేదా!

ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం కంటే శక్తిమంతమైనవా?
నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
కరోనాపై ప్రభుత్వం, వైద్యబృందం అందిస్తున్న సేవలకు కితాబు
ఈనాడు - హైదరాబాద్‌

కార్యనిర్వాహక వ్యవస్థ... న్యాయ వ్యవస్థ కలిసి పనిచేస్తూ సామాన్యుడిపై దృష్టి సారించాలి. స్వర్ణకారుడు పనిచేస్తున్న కుమారుడిని రోజూ విమర్శిస్తుంటాడు. కుమారుడిని ఎప్పుడూ ఎందుకలా మందలిస్తున్నారని భార్య ప్రశ్నిస్తే.. ‘పనిలో పరిపూర్ణత సాధించాలనేదే నా తపన’ అని తండ్రి చెబుతాడు. మా ఉద్దేశమూ అంతే. మేం ఏం చెప్పినా కరోనాపై పోరాటంలో దేశంలోనే రాష్ట్రాన్ని ముందుంచాలని. ఈ సుదీర్ఘ యుద్ధాన్ని కొనసాగించి సామాన్యులకు సేవలందించాలని కోరుతున్నాం.

- హైకోర్టు

కరోనాపై ప్రభుత్వ సేవలు భేష్‌
ప్రభుత్వం, డాక్టర్లు, వైద్య సిబ్బంది కరోనాతో యుద్ధం చేస్తున్న తీరు అభినందనీయం. మేము ఇచ్చిన ఆదేశాలు 95 శాతం అమలయ్యాయి. ఇక మిగిలింది 5 శాతమే. మా ఆదేశాలను వ్యతిరేకంగా తీసుకోవద్దు. నైతిక సామర్థ్యాన్ని దెబ్బతీయడంగా భావించొద్దు. స్నేహపూర్వక సూచన ఇచ్చే అధికారం, హక్కు మాకు ఉన్నాయి.

- హైకోర్టు

ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 15 నుంచి 25 శాతం పేదలకు ఉచిత వైద్యం అందిస్తామంటూ రాయితీలు పొందిన ఆసుపత్రులు ఉచిత వైద్యం ఎందుకు అందించలేదో చెప్పాలంది. ‘46 ఆసుపత్రులకు మీరు (ప్రభుత్వం) షోకాజ్‌ నోటీసులు ఇవ్వగా 16 ఆసుపత్రులు మాత్రమే సమాధానం ఇచ్చాయి. రెండింటికి కొవిడ్‌ చికిత్సల అనుమతులను రద్దు చేశారు. మిగిలినవాటి మాటేమిటి? నోటీసులు ఇచ్చినా స్పందించడంలేదంటే అవి ప్రభుత్వానికంటే శక్తిమంతమైనవా? ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం పడకలను స్వాధీనం చేసుకుంటామని మంత్రి మూడు రోజుల క్రితం ప్రకటించారు. ఆ ప్రకటన అమలెంతవరకు వచ్చింది’’ అని న్యాయస్థానం రాష్ట్ర సర్కారును ప్రశ్నించింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలంటూ విచారణను సెప్టెంబరు 4వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన కార్యదర్శి హాజరుకు మినహాయింపునిచ్చింది. కొవిడ్‌పై అందిస్తున్న సేవలు, ప్రైవేటు ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం సుదీర్ఘ విచారణ చేపట్టింది.

ప్రభుత్వ నివేదికపై హైకోర్టు సందేహాలు
* ఆగస్టు 3 నుంచి 10వ తేదీ వరకు 1,78,609 పరీక్షలు నిర్వహించగా ఇందులో ప్రైమరీ కాంటాక్ట్‌ కేసులు 50,662, సెకండరీ కాంటాక్ట్‌ కేసులు 42,210గా పేర్కొన్నారు. వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలను సమర్పించలేదు.
* 86 ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొంటున్నప్పటికీ వాటి జాబితా సమర్పించలేదు. కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, సొసైటీల సంక్షేమ భవనాలను ఐసొలేషన్‌ కేంద్రాలుగా మార్చారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు.
* అందిన ఫిర్యాదుల ప్రకారం 46 ప్రైవేటు ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వగా 16 సమాధానం ఇచ్చాయని, రెండింటిపై చర్య తీసుకుంటున్నట్లు పేర్కొన్నా మిగిలిన వాటిపై ఏం చర్యలు తీసుకున్నారన్నది చెప్పలేదు. 16 ఆసుపత్రులు నోటీసులకు సమాధానం ఇచ్చినా దానిపై తదుపరి స్పందన ఏమిటో చెప్పలేదు.
* ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలపై అనుమానాలున్న నేపథ్యంలో నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించాలని చెప్పాం. నివేదికలో ర్యాట్‌ కచ్చితత్వానికి సంబంధించి ఏమీ వెల్లడించలేదు.
* అసిఫాబాద్‌, మహబూబాబాద్‌, కామారెడ్డి, కొత్తగూడెం, నర్సంపేట, వరంగల్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్‌లు లేవు.

పిటిషనర్ల ప్రస్తావనలు...
* ఐసొలేషన్‌ కేంద్రాలను నిర్వహించడానికి ఎన్జీవోలు దరఖాస్తులు చేశాయి.  పరిగణనలోకి తీసుకోవాలి. రసూల్‌పూరాలోని హాకీ స్టేడియాన్ని ఐసొలేషన్‌ కేంద్రంగా మార్చే అంశాన్ని పరిశీలించాలి.
* ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం పడకలను స్వాధీనం చేసుకునేలా ఆదేశాలివ్వాలి.
* కొవిడ్‌ పల్లెలకూ వ్యాపిస్తోంది. జిల్లాల్లో పరీక్షలు పెంచడంతోపాటు యుద్ధ ప్రాతిపదికన వైద్యసౌకర్యాలు పెంచాలి.
* కొవిడ్‌ కట్టడికి నిర్దేశించిన మార్గదర్శకాలను మంత్రులు, అధికారులు పాటించకుండా సమావేశాలు నిర్వహిస్తూ ఉండటంతో రద్దీ పెరిగి కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతోంది. మార్గదర్శకాలు అమలయ్యేలా ఆదేశించాలి.


హైకోర్టు ఆదేశాలు

మార్చి 24 నుంచి ఇప్పటివరకు కొవిడ్‌ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం, డాక్టర్లు అభినందనీయమైన సేవలందించారు. కొవిడ్‌ను నియంత్రించడానికి నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ఎక్కువ శాతం ఆదేశాలను అమలు చేసినప్పటికీ మిగిలిన వాటిని కూడా సెప్టెంబరు 4లోగా పూర్తి చేయాలి.
* 21 నుంచి 50 ఏళ్లవారు జాగ్రత్తగా ఉండాలన్న సలహాను మీడియా బులెటిన్‌లో రోజూ ప్రచురించాలి.
* ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయని ప్రైవేటు ఆసుపత్రులపై వచ్చే ఫిర్యాదులపై స్పందించాలి. నిబంధనలు ఉల్లంఘించినవాటిపై చర్యలు తీసుకోవాలి. చికిత్సలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ప్రైవేటు ఆసుపత్రులు అమలు చేసేలా చూడాలి. ఒకవేళ అమలు చేయకపోతే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.
* ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేటు ఆసుపత్రులు వాటికి కట్టుబడి పేదలకు ఉచిత వైద్యం అందించాలి. ఇలా రాయితీలు పొందిన ఆసుపత్రులపై విచారణ నిర్వహించి కొవిడ్‌ సమయంలో ఎంతమంది పేదలకు కొవిడ్‌ చికిత్సలు అందించాయో చెప్పాలి. నిబంధనల ఉల్లంఘనపై దృష్టి పెట్టాలి.
* దిల్లీ సర్కారులా ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలను తీసుకోవడానికి ఏవైనాఇబ్బందులుంటే వెల్లడించాలి.
* ప్రధాన కార్యదర్శి నియంత్రణలో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలి.
* రోజుకు 40 వేల పరీక్షలు నిర్వహించాలన్న మంత్రి మండలి నిర్ణయం అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలి.
* కరోనాను ఎదుర్కోవడానికి తమవంతు సేవలందించడానికి ఆసక్తి చూపుతూ ఎన్జీవోలు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించాలి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.