close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టీకా ఉత్పత్తిలో భారత్‌ పాత్రే కీలకం

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ నియంత్రణకు ఇది ముఖ్యం
ఏ కంపెనీ అభివృద్ధి చేసినా భారత్‌లో తయారీకి కృషి
2021 ఆరంభంలో కొన్ని వ్యాక్సిన్లకు లైసెన్సు రావొచ్చు
సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం, వితరణశీలి బిల్‌ గేట్స్‌ వెల్లడి

భారత్‌లోని ఆధార్‌ డిజిటల్‌ ఫైనాన్స్‌ వ్యవస్థ గొప్ప వనరుగా రుజువైంది. ఇలాంటి వ్యవస్థను ప్రపంచంలోని ఇతర దేశాలూ అనుసరించవచ్చు.
దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరులో భారత్‌ పాత్ర కీలకమవుతుందని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు, వితరణశీలి బిల్‌ గేట్స్‌ అన్నారు.  ప్రపంచంలోనే అతిపెద్ద దాతృత్వ సంస్థల్లో ఒకటైన బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌.. కరోనా మహమ్మారి కట్టడికి జరుగుతున్న కసరత్తులో చురుగ్గా పాలుపంచుకుంటోంది. టీకా ఉత్పత్తి, సరఫరాను వేగవంతం చేసేందుకు భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కొవిడ్‌-19 టీకా ఉత్పత్తి, ఇతర వర్ధమాన దేశాలకు దాన్ని సరఫరా చేసే అంశంలో భారత్‌ ప్రధాన పాత్ర పోషించేందుకు సుముఖత చూపడం.. అంతర్జాతీయంగా ఈ మహమ్మారిపై సాగించే పోరులో కీలకాంశమవుతుందని బిల్‌గేట్స్‌ చెప్పారు. ప్రపంచ యుద్ధం తర్వాత దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఈ మహమ్మారేనని ‘పీటీఐ’ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. టీకాల ఉత్పత్తిలో భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌, ‘బయో ఇ’ వంటి సంస్థల సత్తాను ఆయన ప్రస్తావించారు.
భారత్‌ వైపు ప్రపంచం చూపు
కరోనాకు టీకా సిద్ధమయ్యాక భారీ స్థాయిలో ఉత్పత్తి కోసం ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూస్తుందని బిల్‌ గేట్స్‌ తెలిపారు. ‘‘టీకా సమర్థత, భద్రత రుజువయ్యాక.. సాధ్యమైనంత త్వరగా భారత్‌ నుంచి టీకాలు ఉత్పత్తి కావాలని కోరుకుంటున్నాం.అందువల్ల వచ్చే ఏడాది నుంచి వ్యాక్సిన్‌ను ఇక్కడ తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. భారీ సామర్థ్యంతోనే ఉత్పత్తి ప్రారంభం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్‌లో తయారయ్యే టీకాల్లో కొంత మేర.. ఇతర వర్ధమాన దేశాలకూ అందించాలని ప్రపంచం కోరుకుంటోంది’’ అని చెప్పారు. టీకా పంపిణీలో సమానావకాశాలు నెలకొనేలా చూడటంలో భారత్‌ సాయం చేస్తుందన్నారు. ‘‘వ్యాక్సిన్లను పూర్తిగా ధనిక దేశాలకే సరఫరా చేయడంతో పోలిస్తే.. అవసరం ఎక్కువగా ఉన్నవారికి వాటిని ఇవ్వడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు నిలుస్తాయి’’ అని తెలిపారు.
ఎవరు అభివృద్ధి చేసినా..
కరోనా టీకాను ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌, నోవావాక్స్‌ లేదా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థల్లో ఎవరు అభివృద్ధి చేసినా.. దాన్ని భారత్‌లో ఉత్పత్తి చేయడానికి చర్చలు జరుపుతున్నామని గేట్స్‌ చెప్పారు. ‘‘ఆస్ట్రాజెనెకా, నోవావాక్స్‌ టీకాల్లో అధిక భాగాన్ని సీరం సంస్థలో ఉత్పత్తి చేయడానికి ఒప్పందం చేసుకున్నాం. ‘బయో ఇ’ సంస్థతోనూ చర్చలు జరుపుతున్నాం. వారికి జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌తో అవగాహన ఉంది. అందువల్ల ఆ టీకా ఉత్పత్తిని పెంచుతారా అని ఆరా తీస్తున్నాం’’ అని ఆయన వివరించారు. నీతి ఆయోగ్‌తో విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో.. కొన్ని కంపెనీల టీకాలు మూడో దశ అత్యవసర లైసెన్సు ఆమోదం స్థాయికి చేరుకుంటాయన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కొన్ని టీకాల మొదటి రెండు దశల క్లినికల్‌ పరీక్షల ఫలితాలను పరిశీలిస్తే కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తోందన్నారు. టీకాల ధర తక్కువగా ఉండటం, భారీ స్థాయిలో అవి ఉత్పత్తి అయ్యేలా చూడటం చాలా ముఖ్యమని చెప్పారు.

నగదు బదిలీ భేష్‌
భారత్‌లో డిజిటల్‌ రూపంలో సాగుతున్న నగదు బదిలీ పథకాన్ని గేట్స్‌ ప్రశంసించారు. ప్రపంచంలో మరే ఇతర దేశం చేయని స్థాయిలో ఈ కార్యక్రమం సాగుతోందన్నారు. కరోనా మహమ్మారి వల్ల అంతర్జాతీయంగా సాధారణ టీకాల కవరేజీ కూడా 84 శాతం నుంచి 70 శాతానికి పడిపోయిందన్నారు. ఇప్పుడు అది 1990ల స్థాయిలో ఉందని చెప్పారు.


3.7 కోట్ల మంది తీవ్ర దారిద్య్రంలోకి..

కరోనా వైరస్‌ వల్ల 3.7 కోట్ల మంది తీవ్రస్థాయి పేదరికంలోకి జారిపోయారని బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ విడుదల చేసిన ‘గోల్‌ కీపర్స్‌ రిపోర్ట్‌’ నివేదిక పేర్కొంది. దీనివల్ల ఆరోగ్య రంగంలో గత కొన్ని దశాబ్దాల్లో సాధించిన పురోగతి మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని తెలిపింది. ఈ మహమ్మారితో ప్రధానంగా ఆర్థికపరంగా నష్టం వాటిల్లిందని వివరించింది. ఆయా దేశాల్లో వైరస్‌ విస్తృతి స్థాయితో సంబంధం లేకుండా ఈ నష్టం చోటుచేసుకుందని పేర్కొంది.
నివేదికలోని ముఖ్యాంశాలివీ..
* ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీల కింద 18 లక్షల కోట్ల డాలర్లను ఖర్చుపెట్టినప్పటికీ 2021 చివరినాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 12 లక్షల కోట్లను కోల్పోతుంది.
* కొవిడ్‌ వల్ల కొద్ది నెలల్లో తీవ్రస్థాయి పేదరికం 7 శాతం మేర పెరిగింది. దీన్ని తగ్గించడంలో 20 ఏళ్లుగా సాధించిన పురోగతికి అవరోధం ఏర్పడింది.
* కొవిడ్‌-19 వల్ల పరోక్షంగా అనేక మంది చనిపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆరోగ్యపరిరక్షణ రంగం దెబ్బతినడమే. 25 వారాల్లోనే 25 ఏళ్ల నష్టం జరిగింది.
* విద్యపైనా దీని ప్రభావం పడింది. మహమ్మారి ప్రారంభం కావడానికి ముందే అల్ప, మధ్యాదాయ దేశాల్లో 53 శాతం మంది విద్యార్థులు, సహారా ఎడారి చుట్టుపక్కలున్న ఆఫ్రికా దేశాల్లో 87 శాతం మంది పదేళ్ల వయసు వచ్చినప్పటికీ సరళమైన వాక్యాలు కూడా చదవలేకపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, పాఠశాలల మూసివేత వంటివి ఈ అసమానతలను మరింత పెంచుతాయి. అనేక మంది బాలికలు పాఠశాలలకు తిరిగి రాకపోవచ్చు.
* భారత్‌లో కరోనా కాలంలో 20 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడంవల్ల పేదరికం, ఆకలి బాధ తగ్గడమే కాక మహిళా సాధికారతకూ బాటలు పరిచినట్లయింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.