close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోటి పడగల నగేష్‌!

 లంచం కోసం నరకం చూపిన అదనపు కలెక్టరు
 నగేష్‌ వ్యవహారంపై ఏసీబీ రిమాండ్‌ రిపోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: అడ్డగోలుగా మేసి.. అడ్డంగా బుకాయించడం అంటే ఇదే! రూ. 40 లక్షల లంచం తీసుకున్నాడు.. ఐదెకరాల స్థలం రాయించుకున్నాడు. ఇంత చేసి కూడా తనకు డబ్బు, స్థలం ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలియదని బుకాయించాడు. అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు ఎన్నిసార్లు ప్రశ్నించినా ఇదే సమాధానం చెప్పాడు. చివరకు ఏసీబీ ఆధారాలు ఒక్కొక్కటే బయటపెడుతుండటంతో తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. చెక్కులు, స్థలం తాలూకూ పత్రాలు మాజీ కలెక్టర్‌ ధర్మారెడ్డి వద్ద ఉండొచ్చేమోనన్నాడు. కానీ సోదాల్లో అవి తన ఇంట్లోనే దొరకడంతో కంగుతిన్నాడు.. అతడే మెదక్‌ అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌! 112 ఎకరాల భూమికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ. 1.12 కోట్ల లంచం డిమాండు చేసి.. కొంత తీసుకుని ఏసీబీకి దొరికిపోయిన నగేష్‌ సహా మరో నలుగురు నిందితులపై అధికారులు న్యాయస్థానానికి రిమాండ్‌ రిపోర్టు సమర్పించారు. దానిని ‘ఈనాడు’ సంపాదించింది.
నాకు కొంత.. వాళ్లకు కొంత..
చందానగర్‌కు చెందిన కన్నెబోయిన లింగమూర్తి వైద్యుడు. ఆయన మరో నలుగురితో కలిసి మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమి కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ఎన్వోసీ పొందే క్రమంలో తిప్పలు మొదలయ్యాయి. మొదట ఆయన జులై 21న నర్సాపూర్‌ తహసీల్దారు సత్తార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అది ఆర్డీవో అరుణారెడ్డికి, అక్కడి నుంచి మెదక్‌ అప్పటి కలెక్టరు ధర్మారెడ్డి వద్దకు చేరింది. లింగమూర్తి జులై 30న కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి అదనపు కలెక్టర్‌ నగేష్‌ను కలిశారు. ఎన్వోసీ కావాలంటే కలెక్టరుకు ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ. 1.12 కోట్లు లంచం ఇవ్వాలని నగేష్‌ బేరం పెట్టాడు. చేసేదిలేక బాధితుడు అంగీకరించాడు. జులై 31న నగేష్‌ను ఆయన ఇంట్లో కలిసి రూ. 19.50 లక్షల నగదు అందజేశాడు. అనంతరం నర్సాపూర్‌ ఆర్డీవో కార్యాలయంలో సర్వేయరు వసీంను కలవాలని, ఈ దస్త్రం చూస్తున్న ఇతర అధికారులకు కూడా లంచం ఇవ్వాలని నగేష్‌ ఆదేశించాడు. దీంతో లింగమూర్తి వసీంకు రూ. 4 లక్షలు ఇచ్చారు. అతడి సూచన మేరకు మరో రూ.లక్ష గూగుల్‌పే ద్వారా రాజీవ్‌గౌడ్‌కు బదిలీ చేశారు. ఆగస్టు 7న నగేష్‌ను ఆయన ఇంట్లో కలిసి రెండోదఫాగా రూ. 20.50 లక్షలు చెల్లించారు. కరోనా కారణంగా మిగిలిన రూ. 72 లక్షలు సమకూర్చడం కష్టంగా ఉందని లింగమూర్తి అసహాయత వ్యక్తం చేయగా నగేష్‌ ఆయన నుంచి ఎనిమిది చెక్కులు తీసుకొని జిల్లా కలెక్టరు జారీ చేసిన ఎన్వోసీ ధ్రువపత్రాన్ని ఆగస్టు 31న లింగమూర్తికి అందజేశాడు.
  లంచం పూర్తిగా ముట్టలేదని..
అయితే మిగతా లంచం సొమ్ము అందకపోవడంతో సర్వేతోపాటు రికార్డులు సరిచేసే పనుల్ని ఆపేశాడు. లంచం గురించి పదేపదే అడుగుతుండటంతో విసిగిపోయిన లింగమూర్తి అదనపు కలెక్టర్‌ నగేష్‌, ఇతరులతో జరిగిన ఫోన్‌ సంభాషణలన్నీ రికార్డు చేయడం మొదలుపెట్టారు. ఆగస్టు 14న మరోమారు నగేష్‌ను కలిసిన లింగమూర్తి కరోనా కారణంగా డబ్బు దొరకడం లేదన్నారు. దాంతో వారు కొన్న భూమిలో పదెకరాలు తన పేరిట రాయమని నగేష్‌ డిమాండు చేశాడు. బతిమిలాడటంతో ఐదెకరాలకు తగ్గాడు. తన బినామీ జీవన్‌గౌడ్‌ పేరిట ఒప్పందం సిద్ధం చేయమని చెప్పాడు. దాన్ని సిద్ధంచేసి నగేష్‌కు చూపిన లింగమూర్తి.. తర్వాత వీటన్నింటి గురించి ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేసి తన వద్ద ఉన్న ఆధారాలు చూపించారు. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి లంచగొండుల భరతం పట్టారు.
కస్టడీకి అనుమతి
ఏసీబీ అభ్యర్థనపై అదనపు కలెక్టర్‌ నగేష్‌, ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దారు సత్తార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ వసీం అహ్మద్‌, బినామీ జీవన్‌గౌడ్‌లను విచారణ కోసం ఈ నెల 21 నుంచి 24 వరకూ ఏసీబీ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. 


అదనపు కలెక్టర్‌ నగేశ్‌ సస్పెన్షన్‌

ఈనాడు హైదరాబాద్‌: లంచం కేసులో అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసిన మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయనతో పాటు నర్సాపూర్‌ ఆర్డీఓ అరుణారెడ్డి, చిలిపిచేడు ఎమ్మార్వో అబ్దుల్‌సత్తార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ వశీం అహ్మద్‌లను కూడా సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 112.21 ఎకరాల భూమికి సంబంధించి రూ.1.12 కోట్లు లంచం ఇచ్చేలా మాట్లాడుకొని రూ.40 లక్షలు తీసుకొన్న మెదక్‌ అదనపు కలెక్టర్‌తో పాటు మిగిలిన ముగ్గురిని ఈ నెల 10న ఏసీబీ అరెస్టు చేయగా ప్రత్యేక కోర్టు 24వ తేదీ వరకు రిమాండ్‌కు పంపింది. నిబంధనల ప్రకారం 48 గంటలకు మించి జ్యుడిషియల్‌ కస్టడీలో ఉంటే సస్పెండ్‌ చేయాల్సి ఉన్నందున ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 12వ తేదీ నుంచి సస్పెన్షన్‌ అమలులోకి వస్తుందని, అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ వదిలి వెళ్లరాదని ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.