close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్‌ కన్నుమూత

గుండెపోటుతో మృతి

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావు (64) చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందారు. మూడు వారాల క్రితం దుర్గాప్రసాద్‌కు కరోనా సోకడంతో అపోలో ఆస్పత్రిలో చేరారు. కొన్నిరోజుల తర్వాత కరోనా నెగెటివ్‌ వచ్చింది. కోలుకునే సమయంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో బుధవారం సాయంత్రం 5.20 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.
28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని భీమవరంలో 1956 జూన్‌  15న  బల్లి పెంచలయ్య, రామలక్ష్మి దంపతులకు దుర్గాప్రసాదరావు జన్మించారు.  తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కావడంతో వెంకటగిరిలో స్థిరపడ్డారు. నెల్లూరు వీఆర్‌ కళాశాలలో బీఏ బీఎల్‌ చదువుకున్న దుర్గాప్రసాదరావు న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి అభిమానిగా ఉంటూ రాజకీయ అరంగేట్రం చేశారు. 28 ఏళ్లకే నెల్లూరు జిల్లా గూడూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వరుసగా అయిదుసార్లు అదే నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేశారు. 1989 మినహా మిగిలిన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెదేపా ప్రభుత్వంలో 1996 నుంచి 1998 వరకు ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అధిష్ఠానం గూడూరు టిక్కెట్‌ నిరాకరించడంతో వైకాపాలో చేరారు. మూడు రోజుల్లోనే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన్ను వైకాపా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఆయన 2,26,061 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు.
నేతల సంతాపం
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సభాపతి ఓం బిర్లాలు వేర్వేరుగా సంతాపం ప్రకటించారు.  బల్లి దుర్గాప్రసాద్‌ నాలుగు దశాబ్దాల ప్రజాజీవితంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ప్రజాసేవలో అవిరళ కృషి చేశారని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. దుర్గాప్రసాద్‌ మరణవార్త తనను బాధించిందని చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. దళితుల అభ్యున్నతికి కృషి చేసిన బల్లి దుర్గాప్రసాద్‌ మృతి బాధాకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు.
వైకాపాకు తీరని లోటు: జగన్‌
ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతి పార్టీకి తీరని లోటని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. ‘ఆయన ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని బుధవారం ట్వీట్‌ చేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.