close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్రంలో కుంభవృష్టి

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దూరులో 24 గంటల్లో 23.3 సెంటీమీటర్లు
హైదరాబాద్‌లో 10 గంటల్లో 11 సెంటీమీటర్లు
  వేర్వేరు సంఘటనల్లో   నలుగురి మృతి
 నీటమునిగిన వేల ఎకరాలు

ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు యంత్రాంగం: అతి భారీ వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. హైదరాబాద్‌ నగరం సహా పలు జిల్లాల్లో 3 రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.  వివిధ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగుతున్నాయి. పదివేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వేర్వేరు సంఘటనల్లో నలుగురు మృతిచెందారు. మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దూరులో 23.3, తెల్కపల్లెలో 21.2, పెద్దమద్నూరు, నాగర్‌కర్నూల్‌లో 20.2, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 18.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇవన్నీ గత పదేళ్లలో సెప్టెంబరు నెల అత్యధిక వర్షపాతం రికార్డులే. హైదరాబాద్‌ షేక్‌పేటలో సుమారు పది గంటల వ్యవధిలో 11.03 సెంటీమీటర్ల వర్షం కురవగా, చందూలాల్‌ బారాదరిలో 11 సెం.మీ, అత్తాపూర్‌లో 10.53 సెం.మీ, వర్షం కురిసింది. ఇంతకుముందు 2017 సెప్టెంబరు 6న హైదరాబాద్‌లో 24 గంటల వ్యవధిలో 9 సెం.మీ. కురిసింది. కానీ బుధవారం 10 గంటల వ్యవధిలోనే కుంభవృష్టి కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.

పాలమూరును ముంచెత్తిన వానలు
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షం కురిసింది. నారాయణపేట జిల్లా ధన్వాడలో మట్టిమిద్దె కూలి రెండేళ్ల బాలుడు గౌతమ్‌ మృతి చెందాడు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం కుడికిళ్లలో మంగళవారం అర్ధరాత్రి గోడ కూలడంతో  దేవమ్మ (65) మృతి చెందింది. ఇదే జిల్లాలోని అచ్చంపేట మండలం సిద్ధాపూర్‌ గ్రామ సమీపంలో దుందుభి వాగులో చేనేత తండాకు చెందిన భార్యాభర్తలు చిక్కుకున్నారు. వారిని అర్ధరాత్రి సమయానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 10 వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఉప్పునుంతల వద్ద మూడు ట్రాక్టర్లు దుందుభి వాగులో చిక్కుకుపోయాయి. కోడేరు మండలంలో రెండు ట్రాక్టర్లు కొట్టుకుపోయాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం తిమ్మాపూర్‌ పెద్దవాగులో ముగ్గురు రైతులు చిక్కుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలకు మంజీర నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జగిత్యాల జిల్లా గ్రామీణ మండలంలోని పొలాస ఎల్లమ్మ చెరువు అలుగు దాటించే క్రమంలో 20 గేదెలు కొట్టుకుపోయి మృతి చెందాయి.

 

రాజధానిలో కొట్టుకుపోయిన వాహనాలు

హైదరాబాద్‌లో బుధవారం కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల వాహనాలు నీటిలో తేలాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. పీర్జాదిగూడ చెరువు కట్ట మీద హనుమాన్‌ దేవాలయం వద్ద ఆలయ ప్రహరీ కూలి వాహనంపై వెళ్తున్న వారిపై పèటంతో ప్రవీణ్‌కుమార్‌, మోహన్‌ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. టోలిచౌకి రిలయన్స్‌ మార్ట్‌ ముందు నడుంలోతు నీళ్లు చేరి ద్విచక్రవాహనాలు మునిగిపోయాయి. గుడిమల్కాపూర్‌లో కొన్ని వాహనాలు కొట్టుకుపోయాయి. కుషాయిగూడ ఏఎస్‌రావునగర్‌లో రోడ్డు కుంగిపోయింది. యూసఫ్‌గూడ శ్రీనగర్‌కాలనీ కృష్ణానగర్‌లను వరద ముంచెత్తింది. దుకాణాలు, ఇళ్లలోకి నీరు చేరింది. బండ్లగూడలో హెరిటేజ్‌ సూపర్‌ మార్కెట్‌లోకి వరద చేరింది. ఖైరతాబాద్‌, చార్మినార్‌ జోన్లలో ఎక్కువ నష్టం వాటిల్లింది. రాత్రి సికింద్రాబాద్‌, ఎల్బీనగర్‌లలో వాన విజృంభించింది. నగరవ్యాప్తంగా సుమారు వంద చోట్ల రోడ్లపై నీరు చేరిందని పోలీసులు పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.