close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా

వ్యవసాయ బిల్లులకు నిరసనగా పదవి నుంచి వైదొలగిన అకాలీ నేత
వెనక్కి తగ్గని మోదీ సర్కారు
లోక్‌సభలో రెండు బిల్లులకు ఆమోదం
ఎన్డీయేలో కొనసాగడంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామన్న సుఖ్‌బీర్‌సింగ్‌

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన  వ్యవసాయ రంగ బిల్లులపై రాజకీయ రగడ చెలరేగింది. విపక్షాల నుంచే కాక, ఎన్డీయే మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌ నుంచి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ అకాలీదళ్‌ నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ఏకంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయినప్పటికీ మోదీ సర్కారు వెనక్కి తగ్గలేదు. లోక్‌సభలో వాటిని గురువారం ఆమోదింపజేసుకుంది.

అన్నదాతలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించడమే తమ లక్ష్యంగా పేర్కొంటూ రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు;  రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు; నిత్యావసర సరకుల(సవరణ) బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నిత్యావసర సరకుల బిల్లు మంగళవారమే సభలో ఆమోదం పొందింది. మిగిలిన రెండు బిల్లులపై గురువారం చర్చ జరిగింది. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, బీఎస్పీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలకు నూతన నిబంధనలు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఆరోపించాయి.మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన తెలిపారు. బిల్లుల ప్రతులను పంజాబ్‌కు చెందిన కొందరు కాంగ్రెస్‌ ఎంపీలు మంటల్లో కాల్చేశారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షం అకాలీదళ్‌ కూడా నిరసన గళం వినిపించింది. కాంగ్రెస్‌, డీఎంకే తదితర సభ్యులు వాకౌట్‌ చేశారు. అనంతరం రెండు బిల్లులనూ మూజువాణీ ఓటుతో కేంద్రం ఆమోదింపజేసుకుంది.

గర్వంగా ఉంది: హర్‌సిమ్రత్‌
వ్యవసాయ బిల్లులకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు  కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి  హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ప్రకటించారు. రైతు బిడ్డగా, అన్నదాత సోదరిగా వారికి అండగా నిలుస్తూ పదవి నుంచి తప్పుకొంటున్నందుకు గర్వంగా ఉందని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ప్రధానికి  నాలుగు పేజీల రాజీనామా లేఖను పంపించారు. హర్‌సిమ్రత్‌ రాజీనామా విషయాన్ని లోక్‌సభ వేదికగా ఆమె భర్త, అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ముందే ప్రకటించారు. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా కొనసాగాలా వద్దా అనే అంశంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని విలేకర్లతో  చెప్పారు..మోదీ ప్రభుత్వం కరోనా వంటిదేనని  కాంగ్రెస్‌ నేతలు అధీర్‌ రంజన్‌ చౌధురి, రణదీప్‌ సుర్జేవాలా, గౌరవ్‌ గొగొయ్‌ విమర్శించారు.

కనీస మద్దతు ధరపై ప్రభావం పడదు: తోమర్‌
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ లోక్‌సభలో స్పందించారు. ‘కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)’ యంత్రాంగంపై నూతన బిల్లులు ప్రభావం చూపబోవు.  రాష్ట్రాల్లోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీ (ఏపీఎంసీ) చట్టాల పరిధిని అవి అతిక్రమించబోవు’ అని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించిన బిల్లులపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తుండటాన్ని భాజపా తీవ్రంగా తప్పుపట్టింది. వ్యవసాయ రంగానికి పట్టిన అతిపెద్ద చీడ కాంగ్రెస్‌ పార్టీ అని భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అభివర్ణించారు.


రైతన్నలకు లాభాలు పెరుగుతాయ్‌

తాజా బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందడం చరిత్రాత్మకం. వ్యవసాయ రంగం నుంచి దళారుల దందా, ఇతర అడ్డంకులను ఈ బిల్లులు తొలగిస్తాయి. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు సరికొత్త అవకాశాలను కల్పిస్తాయి. లాభాలను పెంచుతాయి. చాలా శక్తులు ఈ బిల్లులపై అన్నదాతలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ, నేను హామీ ఇస్తున్నా. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), ప్రభుత్వ కొనుగోళ్ల వంటి పలు ఐచ్ఛికాలు ఇక ముందు కూడా కొనసాగుతాయి.

- ట్విటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.