close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆర్టీసీకి రూ.1800 కోట్ల నష్టం

 ఏపీతో ఒప్పందంపై వీడని ప్రతిష్టంభన
 ప్రభుత్వ నిర్ణయం మేరకే  హైదరాబాద్‌లో సిటీ బస్సులు
 ‘ఈనాడు’తో  రవాణా మంత్రి పువ్వాడ

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా వైరస్‌తో తెలంగాణ ఆర్టీసీ మంగళవారం వరకు రూ.1,800 కోట్లు నష్టపోయిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వెల్లడించారు. కొన్ని బస్సులు నడుపుతున్నా ఆక్యుపెన్సీ అంతంత మాత్రంగానే ఉందన్నారు. కరోనా ముందు వరకు టికెట్ల ద్వారా రోజుకు రూ.13 కోట్లు ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం రూ.2-3 కోట్ల మధ్య వస్తోందని వివరించారు. జీతాలకు ప్రతి నెల బడ్జెటు నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.వంద కోట్లు ఇస్తున్నారని తెలిపారు. బుధవారం ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు...
‘‘కర్ణాటక, మహారాష్ట్రలకు అంతర్‌ రాష్ట్ర బస్సులను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీతో ఒప్పందంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగలేదు. రెండు రాష్ట్రాల మధ్య సమాన సంఖ్యలో బస్సులు, రూట్లు, కిలోమీటర్లు ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ను కోరాం. వారి నుంచి సరైన స్పందన రాలేదు. రెండు రాష్ట్రాలు కిలోమీటర్లు తగ్గించుకుంటే ప్రయివేటు బస్సులకు లబ్ధి అన్నది సమస్యను పక్కదారి పట్టించటమే. వారు కోరినట్లు ఆంధ్రా తగ్గించుకున్న కిలోమీటర్లు తెలంగాణ పెంచితే నష్టం పెరుగుతుంది. అందుకు సిద్ధంగా లేము.
హైదరాబాద్‌లో సిటీ బస్సులు నడిపే విషయంలో ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తుంది. నగరంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అంత పెద్ద సంఖ్యలో ఆ తరహాలో ప్రయాణం చేయటం మంచిది కాదన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రభుత్వం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు బస్సులు నడిపేలా సన్నద్ధంగా ఉన్నాం. అదనపు ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్టీసీనే పెట్రోలు బంకులను నిర్వహిస్తుంది.  సొంతంగా నిర్వహిస్తున్న పార్శిల్‌, కార్గో, కొరియర్‌ సేవలకు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం రోజుకు రూ.పది లక్షల వరకు వస్తోంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లతో చర్చలు జరుగుతున్నాయి.
ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన సీసీఎస్‌, పీఎఫ్‌ సొమ్మును వారి ఖాతాల్లో జమ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. వారి బకాయిలను తీర్చేందుకు రూ.600 కోట్లు రుణం తీసుకున్నాం. కరోనా కారణంగా ఆ సొమ్మును జీతాలు, బ్యాంకుల కిస్తీలు తదితరాలకు వినియోగించాల్సి వచ్చింది. కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలూ దాఖలు అయ్యాయి. ఆయా మొత్తాలను చెల్లించేందుకు కార్యాచరణ చేయాలని ఆలోచనలో ఉన్నాం. ప్రయివేటు బస్సు ఆపరేటర్లకు మార్చి 31వ తేదీ వరకు ఉన్న బకాయిలను చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశాం. మిగిలిన వాటిని కుదురుకున్నాక చెల్లిస్తాం. పన్ను మినహాయించాలని వారు కోరుతున్నారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి నివేదించాం. నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం’’అని  మంత్రి వివరించారు.


చెరో 2.08 లక్షల కి.మీ.లు నడుపుదాం
  ఏపీ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి లేఖ

ఈనాడు, అమరావతి: ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు రోజుకు 2.08 లక్షల కి.మీ. చొప్పున బస్సులు నడిపితే మేలు కలుగుతుందని, అంతకు తగ్గితే రెండు సంస్థలు నష్టపోవాల్సి వస్తుందని పేర్కొంటూ తెలంగాణ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శికి ఏపీ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి తాజాగా లేఖ రాశారు. తెలంగాణ పరిధిలో ఏపీఎస్‌ఆర్టీసీ 1.60 లక్షల కి.మీ.లు, ఏపీ పరిధిలో టీఎస్‌ఆర్టీసీ కూడా అంతే దూరం బస్సులు నడపాలని తెలంగాణ పట్టుబడుతోంది. అలాగైతేనే అంతర్రాష్ట్ర ఒప్పందం జరుగుతుందని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరఫున రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాశారు. 1.60 లక్షల కి.మీ. మాత్రమే అనే ప్రతిపాదనపై పునరాలోచించాలని కోరారు. హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో మాత్రమే 110 బస్సులు పెంచనున్నట్లు తెలంగాణ పేర్కొంది. అలా కాకుండా ఏపీలోని అన్ని మార్గాల్లో బస్సులు నడపాలని లేఖలో ప్రస్తావించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.