close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ 60 జిల్లాలపై దృష్టి పెట్టండి

 క్షేత్రస్థాయి అధికారులతో రోజుకో గంట నేరుగా మాట్లాడండి
 రాష్ట్రాల మధ్య రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు
 ఆక్సిజన్‌కు కొరత రానిరీతిలో సమన్వయం
 కరోనాపై ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ సూచన

ఈనాడు, దిల్లీ: దేశంలో 700కి పైగా జిల్లాలున్నప్పటికీ కరోనా కేసుల సంఖ్య పరంగా ఏడు రాష్ట్రాల్లోని 60 జిల్లాలు మాత్రమే ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. అందువల్ల ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారం రోజుల పాటు రోజుకో గంట చొప్పున ఈ జిల్లాల్లోని ప్రభావిత ప్రాంత క్షేత్రస్థాయి అధికారులతో నేరుగా మాట్లాడి వైరస్‌ నియంత్రణకు అవసరమైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి నేరుగా క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడితే తప్పకుండా ఫలితం ఉంటుందని, అధికారుల్లో చిత్తశుద్ధి పెంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులతో బుధవారం ఆయన దృశ్యమాధ్యమ సదస్సు నిర్వహించారు. ముఖ్యమంత్రుల సూచనలు, సలహాలు, అభిప్రాయాలు విన్న తర్వాత ఆయన వారినుద్దేశించి మాట్లాడారు.
కరోనాకు కళ్లెం.. ఆర్థికానికి ఊతం
ఒకటి లేదా రెండు రోజులు చొప్పున స్థానిక లాక్‌డౌన్లు విధిస్తుండడం వల్ల ఎంతమేరకు ప్రయోజనం ఉంటోందని ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు ఇదేమైనా ఇబ్బందులు కలిగిస్తోందేమో యోచించాలని సీఎంలను కోరారు. రాష్ట్రాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఇప్పటివరకూ ప్రజలు చూపిన సంయమనం, సమన్వయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా రాష్ట్రాలు కృషి చేయాలని పేర్కొన్నారు. కరోనా నియంత్రణతోపాటు, ఆర్థిక పరిస్థితులను ముందుకు తీసుకెళ్లడానికీ అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని హితోపదేశం చేశారు. చిన్నచిన్న కట్టడి ప్రాంతాలపై (మైక్రో కంటెయిన్‌మెంట్‌ జోన్లపై) దృష్టి సారిస్తే వైరస్‌ వ్యాప్తికి కళ్లెం వేయడంతో పాటు సాధారణ కార్యకలాపాలు కొనసాగేలా చూడవచ్చని చెప్పారు.
భవిష్యత్తు కార్యాచరణకు ప్రణాళిక
‘‘ఈనెల 25తో ఆయుష్మాన్‌ భారత్‌ పథకం రెండేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ రెండేళ్లలో దాని ద్వారా 1.25 కోట్లమందికి ఉచిత వైద్యం లభించింది. ఈరోజు చర్చల్లో వచ్చిన అభిప్రాయాలతో భవిష్యత్తు కార్యాచరణకు స్పష్టమైన ప్రణాళిక రూపొందించడానికి అవకాశం ఏర్పడింది. రోజుకు పది లక్షల పరీక్షలు జరుపుతున్నాం. కోలుకుంటున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో అత్యుత్తమ చికిత్స విధానాలు అమలవుతున్నాయి. ఆ అనుభవాల నుంచి మరింత లబ్ధి పొందాలి. సమష్టి కృషి వల్లే కరోనా వైద్యంలో ఇప్పటివరకు పురోగతి సాధ్యమైంది. ఒకవైపు కరోనాతో ముడిపడిన మౌలిక వసతులను పెంచుకుంటూనే, మరోవైపు ట్రాకింగ్‌, ట్రేసింగ్‌కు సంబంధించి సిబ్బందికి మరింత ఉత్తమమైన శిక్షణ ఇవ్వాలి. కరోనా మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధుల లభ్యత పెంచడానికి రాష్ట్రాల విపత్తు ఉపశమన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌)పై కీలక నిర్ణయం తీసుకున్నాం. పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు కరోనా నివారణ చర్యల కోసం ఈ నిధుల నుంచి ఖర్చుచేసే మొత్తం పరిమితిని 35% నుంచి 50%కి పెంచాలని నిర్ణయించాం. దానివల్ల రాష్ట్రాలకు మరిన్ని ఆర్థిక వనరులు అందుబాటులోకి వస్తాయి.
ప్రజలకు సందేశం స్పష్టంగా ఉండాలి
తొలినాళ్లలో లాక్‌డౌన్‌ విధించడం వల్ల చాలా మేలు జరిగింది. ప్రపంచం కూడా దాన్ని అర్థం చేసుకొంది. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌, నిఘాలతోపాటు స్పష్టమైన సమాచారం అందించడంపైనా మనం తీవ్రంగా దృష్టిసారించాలి. చాలా మంది రోగుల్లో లక్షణాలే కనిపించడంలేదు కాబట్టి ప్రజలు పరీక్షల సామర్థ్యంపై అనుమానం వ్యక్తంచేసే అవకాశం ఉంది. లేదా రోగ తీవ్రతనైనా తక్కువగా అంచనావేసే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇలాంటి సమయంలో ప్రజలకు స్పష్టమైన సందేశాన్నివ్వాలి. వైరస్‌ను నియంత్రించడంలో మాస్క్‌ భూమిక చాలా ప్రధానం. దాన్ని అలవాటు చేసుకోవడం కష్టమైనా రోజూ చస్తూ బతికే జీవితంలో అది లేకుండా నిర్దేశిత లక్ష్యాన్ని సాధించలేం. ఇదే సమయంలో రాష్ట్రాలు పరస్పరం సమన్వయం, సేవాభావంతో పని చేయాలి. ఆక్సిజన్‌ రవాణా విషయంలో అడ్డంకుల్లేకుండా చర్యలు తీసుకోవాలి. వదంతులపై అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రాల మధ్య మందుల కొరత రాకుండా చూసుకోవాలి. కరోనాను నియంత్రిస్తూనే ఆర్థిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకూ పూర్తి సామర్థ్యంతో పనిచేయాలి. మన ప్రయత్నాలు విజయవంతమవుతుందని నమ్ముతున్నా’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌, కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గాబా, వైద్యఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.