close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోలుకున్నవారు 82.52 శాతం

 రాష్ట్రంలో కొత్తగా 2,296 కేసులు
 మహమ్మారికి 10 మంది మృతి
 చికిత్స పొందుతున్నవారు 29,873 మంది

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 2,296 కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 1,77,070కి చేరుకుంది. తాజాగా 2,062 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకూ ఆరోగ్యవంతులైనవారి సంఖ్య 1,46,135కు పెరిగింది. అంటే మొత్తం పాజిటివ్‌ల్లో 82.52 శాతంమంది కోలుకున్నట్లు. ఈ విషయంలో జాతీయ సగటు 81.23 శాతంగా నమోదైంది. మహమ్మారి బారినపడి మరో 10 మంది మృత్యువాతపడగా.. కొవిడ్‌ మరణాల సంఖ్య 1,062కు చేరింది. ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్నవారు 29,873 మంది కాగా, వీరిలో 23,527 మంది వైద్యసేవలు పొందుతున్నారు. ఈనెల 22న రాత్రి 8 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసింది. తాజాగా 55,892 నమూనాలను పరీక్షించగా, మొత్తం పరీక్షల సంఖ్య 26,28,897కు చేరినట్లు వెల్లడించింది. మరో 1,388 నమూనాల ఫలితాలు రావలసి ఉందని వైద్యశాఖ తెలిపింది.
జీహెచ్‌ఎంసీలో 321 కేసులు
మంగళవారం నాటి ఫలితాల్లో జీహెచ్‌ఎంసీలో 321 కేసులు నిర్ధారణ కాగా, రంగారెడ్డిలో 217, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 173, నల్గొండలో 155, కరీంనగర్‌లో 136 పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఒక్కరోజులో 50కి పైగా కేసులు నమోదైన జిల్లాల జాబితాలో వరంగల్‌ నగర (99), సిద్దిపేట (92), నిజామాబాద్‌ (82), సంగారెడ్డి (81), భద్రాద్రి కొత్తగూడెం (77), కామారెడ్డి (77), సూర్యాపేట (73), మహబూబాబాద్‌ (72), ఖమ్మం (69), రాజన్న సిరిసిల్ల (67), జగిత్యాల (50) ఉన్నాయి.
ప్రైవేటులో తగ్గిన పడకలు
కొవిడ్‌ చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈనెల 20న 8,093 పడకలు ఉండగా.. 21నాటికి 8,821 పడకలు.. 22న 8,835 పడకలు ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. మంగళవారం నాటికి 2,525 పడకల్లో రోగులు చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం గత మూడు రోజులుగా కొవిడ్‌ పడకల సంఖ్య తగ్గినట్లు ఆరోగ్యశాఖ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. ప్రైవేటులో ఈనెల 20న 11,055 ఉండగా.. 21న అవి 10,484కు తగ్గాయి. 22న 9,486 పడకలున్నట్లుగా వైద్యశాఖ తెలిపింది. ఆదివారం నుంచి మంగళవారానికే 1,569 పడకలు తగ్గాయి. ప్రస్తుతం ప్రైవేటులో 3,821 మంది చికిత్స పొందుతున్నారు.
ఐసీయూలో రెండు విభాగాలు
ఇప్పటి వరకూ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రెగ్యులర్‌, ఆక్సిజన్‌, ఐసీయూ కేటగిరీలుగా పడకల విభజన ఉండగా.. తాజాగా ఐసీయూను రెండుగా విడగొట్టారు. వెంటిలేటర్‌ సౌకర్యం ఉన్న, లేని ఐసీయూ పడకలుగా విభజించి సమాచార నివేదికలో పొందుపరుస్తున్నారు. 


ప్రతి లక్ష మందికి.. 43 కొవిడ్‌ పడకలు
  కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా చికిత్సల కోసం ప్రతి లక్ష మందికి 43 పడకల చొప్పున అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా వెల్లడించింది. ఈనెల 18వ తేదీ నాటికి రాష్ట్రంలోని 56 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ సేవలు లభిస్తుండగా.. మొత్తం 17,386 పడకలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ప్రతి లక్ష జనాభాకు కొవిడ్‌ పడకల్లో జాతీయ సగటు 116గా పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. కొవిడ్‌తో సంబంధం లేకుండా సాధారణంగా ప్రజారోగ్యం కోసం ప్రతి లక్ష జనాభాకు 500 సాధారణ పడకలు, 25 ఐసీయూ పడకలు, 12 వెంటిలేటర్లు ఉండాలి. తెలంగాణకు ఇప్పటివరకు 13.85 లక్షల ఎన్‌ 95 మాస్కులు, 2.41 లక్షల పీపీఈ కిట్లు, 1,400 వెంటిలేటర్లను సరఫరా చేసినట్లు కేంద్ర ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. అత్యధికంగా మహారాష్ట్రకు 29.51 లక్షల ఎన్‌ 95 మాస్కులను, 12.83 లక్షల పీపీఈ కిట్లను, 4,434 వెంటిలేటర్లను సరాఫరా చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు 14.63 లక్షల ఎన్‌ 95 మాస్కులు, 2.79 లక్షల పీపీఈ కిట్లు, 3,960 వెంటిలేటర్లను అందజేసినట్లు కేంద్రం పేర్కొంది.

ఏపీలో 7,228 కొత్త కేసులు

ఈనాడు, అమరావతి: ఏపీలో కొత్తగా నమోదవుతున్న కొవిడ్‌ కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం 9 గంటల మధ్య 7,228 కేసులు రాగా... 8,291 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నాటికి మొత్తం నమోదైన 6,46,530 పాజిటివ్‌ కేసుల్లో 5,70,667 (88.26%) మందికి నయమవడం గమనార్హం. తాజాగా 45 మంది ప్రాణాలు విడిచారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.