close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిరవధిక వాయిదా

8 రోజుల ముందే ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
  10 రోజుల సమయంలో 25 బిల్లుల ఆమోదం
  శని, ఆదివారాల్లోనూ పనిచేసిన ఉభయ సభలు

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళనల నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభలు బుధవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 14న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలుత నిర్ణయించిన ప్రకారమైతే అక్టోబరు ఒకటో తేదీ వరకు కొనసాగాల్సి ఉంది. కొవిడ్‌-19 నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ పలువురు ఎంపీలకు, మంత్రులకు వైరస్‌ సోకిన నేపథ్యంలో 8 రోజుల ముందే సమావేశాలు ముగిశాయి. మొత్తం 18 రోజులు జరుగుతాయనుకున్న సభలు 10 రోజులపాటే నడిచాయి. ఈ వ్యవధిలోనే ఉభయ సభల్లోనూ 25 బిల్లులు ఆమోదం పొందాయి. వీటిలో కీలకమైన వ్యవసాయ, కార్మిక సంస్కరణల బిల్లులూ ఉన్నాయి. సమయం వృథాకాకుండా అత్యధిక ఉత్పాదకత సాధించటంపై ఉభయ సభాధ్యక్షులూ సంతృప్తి వ్యక్తం చేశారు. తొలుత రాజ్యసభ బుధవారం మధ్యాహ్నం నిరవధికంగా వాయిదా పడింది. అంతకుముందు ఎగువసభ కార్మిక సంస్కరణలకు ఉద్దేశించిన మూడు బిల్లులు సహా పలు కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. పది రోజుల పాటు కొనసాగిన సమావేశాల్లో 25 బిల్లులు ఆమోదం పొందాయని, మరో ఆరు బిల్లులు సభ ముందుకు వచ్చాయని రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు వెల్లడించారు.
ఆ తర్వాత సమావేశమైన లోక్‌సభలో మేజర్‌ పోర్ట్‌ అథారిటీస్‌ బిల్లును సభ్యులు ఆమోదించారు. సభాపతి ఓం బిర్లా సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ కూడా సభలో ఉన్నారు. పది రోజుల వ్యవధిలో 25 బిల్లులు ఆమోదం పొందాయని, లోక్‌సభ ఉత్పాదకత 167శాతంగా ఉందని ఓం బిర్లా తెలిపారు.
కొవిడ్‌-19 తీవ్రంగా ఉన్న సమయంలోనే మొదలైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు గతంలో ఎన్నడూ లేనివిధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టవలసి వచ్చింది. మొట్టమొదటి సారిగా ఉభయ సభలను ఒకే రోజు భిన్నమైన సమయాల్లో నిర్వహించాల్సి వచ్చింది. సురక్షిత దూరం పాటించాల్సి రావటంతో దిగువ, ఎగువ సభల ఎంపీలు రెండు సభల్లోనూ కూర్చోవాల్సి వచ్చింది. ఈసారి సమావేశాలు శని,ఆదివారాల్లో కూడా జరగటం విశేషం.
పార్లమెంటు ప్రాంగణంలో ర్యాలీ
వ్యవసాయ బిల్లుల వివాదం నేపథ్యంలో వరుసగా రెండోరోజు పార్లమెంటు సమావేశాలను ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. 18 పార్టీల ప్రతిపక్షనేతలు బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పార్లమెంటు ఆవరణలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలు కొనసాగించారు. పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ఎంపీలంతా ర్యాలీ నిర్వహించి రాజ్యాంగాన్ని రక్షించాలని నినదించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రైతులను రక్షించండి అన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందులో తెరాస ఎంపీలు కె.కేశవరావు, సంతోష్‌కుమార్‌, కేఆర్‌ సురేష్‌రెడ్డి, లింగయ్య యాదవ్‌లు పాల్గొన్నారు. రాష్ట్రపతి సందర్శనకు ఒక్కరినే అనుమతించటంతో ఈ పార్టీల నేతలందరి  తరఫున గులాంనబీ ఆజాద్‌ను పంపించాలని నిర్ణయించారు.


వ్యవసాయ బిల్లులను తిరస్కరించండి
 రాష్ట్రపతికి 18 ప్రతిపక్ష పార్టీల నేతల వినతి

ఈనాడు, దిల్లీ: వివాదాస్పదమైన మూడు వ్యవసాయ బిల్లులకు ఆమోదం తెలపవద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు 18పార్టీల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ నేతలందరి తరఫున రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ బుధవారం సాయంత్రం రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ‘బిల్లులను ఆమోదించుకునే క్రమంలో పాలకపక్షం రాజ్యాంగ నిబంధనలు, సంప్రదాయాలన్నింటినీ అపహాస్యం చేసింది. ఈ బిల్లులను సభకు వాపసు పంపి సరైన చర్చ జరిగేలా చూడండి. ప్రతిపక్షాలు ఇచ్చిన సవరణలు, తీర్మానాలపై ఓటింగ్‌ జరిగేలా ఆదేశించండి. అన్నీ సక్రమమైన పద్ధతిలో జరిగాయని నిర్ధారించుకున్న తర్వాతే బిల్లులకు ఆమోదం తెలపండి’ అని రాష్ట్రపతిని కోరారు. సమావేశానంతరం ఆజాద్‌ విలేకర్లతో మాట్లాడుతూ గత ఆదివారం రాజ్యసభలో జరిగిన పరిణామాల పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. ‘కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను స్థాయీ సంఘానికి గానీ, సెలెక్ట్‌ కమిటీకిగాని పంపించి ఉంటే రైతులకు మేలు జరిగేది. అలాంటి ప్రయత్నాలేమీ చేయనందునే బిల్లులు రాజ్యసభకు వచ్చినప్పుడు వాటికి వ్యతిరేకంగా అయిదు మిత్రపక్షాలు నోటీసు ఇచ్చాయి. ఓటింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశాయి. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపడానికి 18 పార్టీలు సుముఖత కూడా వ్యక్తం చేశాయి. ప్రభుత్వం వినిపించుకోలేదు. డిప్యూటీ ఛైర్మన్‌ చాలా తొందరపాటుతో బిల్లులు పాస్‌చేయడానికి తాపత్రయపడ్డారు. ప్రతి విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది కాబట్టే రాష్ట్రపతికి ఫిర్యాదుచేశాం’ అని చెప్పారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.