close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రానున్న కాలంలో రెట్టింపు వర్షాలు!

ఒకేరోజు 45-50 సెం.మీ. కురవచ్చు
ముందస్తు చర్యలతోనే నష్ట నివారణ
‘ఈనాడు’తో బిట్స్‌ పరిశోధకురాలు స్వాతి

‘‘హైదరాబాద్‌లో 25 నుంచి 30 సెం.మీ వర్షపాతం నమోదైంది. భవిష్యత్తులో ఒకేరోజు 45 నుంచి 50 సెం.మీ వరకు పడే అవకాశం ఉంది. దీనికి తగ్గట్లుగా నీటి ప్రవాహ మార్గాలను, మురుగునీటి వ్యవస్థను సిద్ధం చేసుకోవాలి. గత, ప్రస్తుత వర్షాలకు తేడా ఉంది. ఇప్పుడు తక్కువ గంటల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. కేవలం ఐదారు గంటల్లోనే 25 సెం.మీలకు పైగా వాన కురిసింది. దీనికి తగ్గట్లుగా నాలాలు, డ్రెయినేజీ వ్యవస్థ లేదు. ముందస్తు చర్యలతోనే నష్టం నివారించవచ్చు’’

-స్వాతి వేముల, బిట్స్‌ పరిశోధకురాలు

ఈనాడు హైదరాబాద్‌: ప్రస్తుతం వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు.. వరదలు, ముంపు నుంచి బయట పడటానికి హైదరాబాద్‌ నగరంలో చేపట్టాల్సిన చర్యలపై బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(బిట్స్‌)కి చెందిన పరిశోధకురాలు స్వాతి వేముల పలు అంశాలను ‘ఈనాడు’కు వివరించారు. బిట్స్‌లో పీహెచ్‌డీ చేసిన ఈమె ప్రొఫెసర్‌ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో పలు పరిశోధన పత్రాలను సమర్పించారు. 2020 నాటికి 28 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని గత ఏడాది ప్రచురించిన పత్రంలో పేర్కొనడంతో పాటు 2100వ సంవత్సరం వరకు వర్షపాతాన్ని ఆమె అంచనా వేశారు. దీనిప్రకారం 2040 నాటికి 45 నుంచి 50 సెం.మీ వరకు ఒకేరోజు వర్షపాతం నమోదవ్వవచ్చని.. 2068 నాటికి 56 సెం.మీ, తర్వాత 60 సెం.మీ వరకు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇదేమీ ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదని, చెన్నైలో ఇప్పటికే 45 నుంచి 50 సెం.మీ వరకు నమోదైందని పేర్కొన్నారు.
వరద సమస్య అధిగమించవచ్చిలా..
హైదరాబాద్‌లో భారీగా వర్షం కురవడంతో పాటు భూవినియోగంలో వచ్చిన మార్పులు, పెరిగిన పట్టణీకరణ, వ్యర్థ పదార్థాలు, డ్రెయిన్లలో పూడిక పెరగడం, భూమిలో వర్షపునీరు ఇంకే అవకాశం తగ్గినందున లోతట్టు ప్రాంతాలు మునుగుతున్నాయని పరిశోధకురాలు స్వాతి చెప్పారు. గతంలో కంటే మూసీ నదిలో 2.6 రెట్లు ఎక్కువ (డెప్త్‌)గా నీరు ప్రవహించిందన్నారు. డ్రెయిన్లలో పూడిక తీయడం, వాటిని విస్తరించడం ద్వారా.. ప్రస్తుతం ఉన్న డ్రెయిన్ల సామర్థ్యాన్ని 25 నుంచి 30 శాతం వరకు పెంచడం ద్వారా వరద సమస్యను అధిగమించవచ్చన్నారు. ఇలా చేస్తే 28 సెం.మీ వరకు వర్షపాతం నమోదైనా సమర్థంగా ఎదుర్కొనవచ్చన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితి కొనసాగితే నగరంలో 51 శాతం ప్రాంతంలో నష్టం వాటిల్లుతుందని అంచనా వేశారు. వాననీటిని నిల్వ చేయడానికి ఆర్టిఫీషియల్స్‌ పాండ్స్‌ (డిటెన్షన్‌ బేసిన్స్‌) ఏర్పాటు చేయాలన్నారు. వీటివల్ల 2031 నాటికి వర్ష ప్రభావిత ప్రాంతాన్ని 9 శాతానికి తగ్గించవచ్చన్నారు. అయితే వీటికి భూమి, ఖర్చు ఎక్కువవుతుంది కాబట్టి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడం లాంటి సంఘటన 20 ఏళ్లకోసారి పునరావృతమవుతుందని చెప్పారు. 2016లో కూడా కొన్ని ప్రాంతాల్లో 16 సెం.మీ వర్షపాతం నమోదైందని, అయితే ఇప్పుడు కురిసిన వర్షపాతం, తీవ్రత రెండూ ఎక్కువని పేర్కొన్నారు. దేశంలో చెన్నై, ముంబయి, హైదరాబాద్‌ నగరాలు అత్యధిక వర్షపాతం నమోదయ్యే నగరాలుగా ఉన్నాయని స్వాతి వివరించారు.
నాలాల్లో వాటర్‌ సెన్సర్లు
భారత వాతావరణ శాఖ(ఐఎండి) ఇచ్చే ముందస్తు హెచ్చరికలను పరిగణనలోకి తీసుకొని వర్షాకాలంలో డ్రెయిన్లను సిద్ధం చేసుకోవాలి. బెంగళూరు నగరం మొత్తం నాలాల్లో వాటర్‌ సెన్సర్లు ఉన్నాయి. ఇంకో గంటలో ఆ నాలా పరిస్థితి ఏమిటో ముందుగానే సమాచారం వస్తుంది. వెంటనే ఆ ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేస్తారు. అవసరమైన చోట ఖాళీ చేయిస్తారు. ఇక్కడ హైదరాబాద్‌లో కూడా కొన్నిచోట్ల ఇలాంటివి ఉన్నాయి. అయితే నాలాల్లో ఆక్రమణలు లేకుండా చూడాలి.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.