నన్ను.. మీరు పిలిపిస్తారా?

ప్రధానాంశాలు

నన్ను.. మీరు పిలిపిస్తారా?

రాజ్యాంగ పదవిలో ఉన్న అధికారితో వ్యవహరించేది ఇలాగేనా?
ఏపీ సీఎం ముఖ్యకార్యదర్శి కార్యాలయంపై ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ఆగ్రహం

ఈనాడు, అమరావతి: ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేసిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తున్నారు. అది హైకోర్టు న్యాయమూర్తితో సమానమైన హోదా కలిగిన రాజ్యాంగబద్ధమైన పదవి. అలాంటి పదవిలో ఉన్న ఆయనకు.. సర్వీసులో ఆయన కంటే చాలా జూనియర్‌, ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఉన్న అధికారి కార్యాలయం నుంచి శనివారం ఒక వర్తమానం వెళ్లింది. త్వరలో జరగనున్న పార్లమెంటు ఉప ఎన్నికలు, శాసనమండలి ఉప ఎన్నికలు, స్థానికసంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 26న సీఎం క్యాంపు కార్యాలయం మొదటి అంతస్తులో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ఒక సమావేశం నిర్వహిస్తున్నారని, దానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ హాజరవ్వాలన్నది దాని సారాంశం. అది చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఘాటుగా తిరుగు సమాధానం పంపించారని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఎన్నికలకు సంబంధించి నిర్వహించే ఏ సమావేశాలకూ తన అనుమతి లేకుండా వెళ్లవద్దంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శినీ ఆదేశించారు. ప్రస్తుతం ఇది అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

హైకోర్టులోనే తేల్చుకుంటా
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఈనెల 28న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ వ్యక్తిగత కార్యదర్శి నుంచి రమేశ్‌కుమార్‌ కార్యాలయానికి శనివారం ఒక వర్తమానం వెళ్లింది. ప్రవీణ్‌ ప్రకాష్‌ ఈనెల 26న నిర్వహించే సమావేశానికి రమేశ్‌కుమార్‌ హాజరవ్వాలన్నదే దాని సారాంశమని సమాచారం. అదే విషయాన్ని రమేశ్‌కుమార్‌ వ్యక్తిగత కార్యదర్శికి.. ప్రవీణ్‌ ప్రకాష్‌ కార్యాలయ సిబ్బంది ఫోన్‌ చేసి కూడా చెప్పారు. దీనిపై రమేశ్‌కుమార్‌ తీవ్రంగా స్పందించారని, వెంటనే ఆయన తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా, ప్రవీణ్‌ ప్రకాష్‌ కార్యాలయానికి ఒక లేఖ పంపించారని ఎన్నికల కమిషన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘మీరు పంపించిన వర్తమానాన్ని ఎన్నికల కమిషనర్‌ దృష్టిలో ఉంచాను. దానిపై ఆయన ఆదేశం మేరకు మీకు ఈ ప్రత్యుత్తరం పంపిస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పోస్టు రాజ్యాంగబద్ధ పదవి. హైకోర్టు జడ్జితో సమానహోదా గల పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్‌కి.. ఒక సమావేశానికి హాజరవ్వాలని ఇలా హుకుం జారీ చేయడం తీవ్ర అభ్యంతరకరం, అసంబద్ధం. అది బెదిరింపు ధోరణిలా ఉంది. మీ వైఖరి ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతకు, సమగ్రతకు భంగం కలిగించడమే. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్‌ ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉంది. అలాంటి సమయంలో ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేసేలా వ్యవహరించిన మీ తీరును హైకోర్టు దృష్టికి తీసుకెళతాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నట్టు ఎన్నికల కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి.

ఆ వర్తమానాన్ని ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్‌ కార్యాలయానికి పంపించాలన్నది తమ ఉద్దేశమని, పొరపాటున ఎన్నికల కమిషనర్‌కు వెళ్లిందని ప్రవీణ్‌ ప్రకాష్‌ కార్యాలయం చెప్పినట్టు సమాచారం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని