close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జల్‌శక్తి ఝలక్‌!

6న ఒకలా.. 23న మరోలా..
కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ పరస్పర విరుద్ధ ప్రకటనలు
ఈనాడు - హైదరాబాద్‌

* కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-1 నీటి కేటాయింపులు ఉన్నవన్నీ పాత ప్రాజెక్టులే. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్‌-11లో పేర్కొన్న ప్రాజెక్టులూ పాతవే. ఈ ప్రాజెక్టుల్లో వేటికైనా నీటి కేటాయింపులు లేకపోతే ప్రస్తుత ట్రైబ్యునల్‌ నుంచి పొందాలి.

-ఈ నెల 6న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం తర్వాత కేంద్ర జల్‌శక్తి మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన

* కేంద్ర జలసంఘం సాంకేతికంగా, ఆర్థికంగా పరిశీలించని, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) ఆమోదం లేని ఏ ప్రాజెక్టయినా కొత్తదే. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టినా, పునర్విభజన తర్వాత చేపట్టినా..

-ఈ నెల 23న కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ నుంచి రెండు రాష్ట్రాలకు వచ్చిన మినిట్స్‌లో..

ఒకే అంశంపై రెండు పూర్తి భిన్నమైన వైఖరులను కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించడం నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు పంపిన మినిట్స్‌లో జల్‌శక్తి శాఖ వైఖరి కొత్త వివాదానికి తెరలేపినట్లవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం, ఈ ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు(డీపీఆర్‌) ఇమ్మని బోర్డులు లేఖలు రాయడం జరుగుతోంది. దీనిపై ఈ నెల 6న కేంద్ర జల్‌శక్తి మంత్రి ఛైర్మన్‌గా, ఇద్దరు ముఖ్యమంత్రులు సభ్యులుగా గల అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చ జరిగింది. కొత్త ప్రాజెక్టులు లేవని, అన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టినవేనని, కొత్తవి ఉంటే డీపీఆర్‌లు ఇస్తామని తెలంగాణ చాలా కాలంగా చెబుతోంది. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల కింద అదనపు నీటి వినియోగం కానీ, కొత్త ఆయకట్టు కానీ లేదు కాబట్టి దీనిని కొత్తదిగా పరిగణించవద్దని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో అసలు పాతవి, కొత్తవి ఏవి, ఏ ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలో సమావేశం తర్వాత కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది. దీని ప్రకారం పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రాజెక్టుల వరకు పాతవే. పైన పేర్కొన్న ప్రాజెక్టులలో ట్రైబ్యునల్‌ కేటాయింపులు లేకపోయినా, వాటి పరిధిని మార్చినా కొత్తవేనని, మొదటి రెండు కేటగిరీల్లో పేర్కొన్న ప్రాజెక్టులు మినహా మిగిలినవన్నీ కొత్తవిగా పేర్కొంటూ డీపీఆర్‌లు అందజేసి సాంకేతిక అనుమతులు పొందాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ప్రకటన పేర్కొంది. షెడ్యూల్‌-11లో కల్వకుర్తి, నెట్టెంపాడు, గాలేరు-నగరి, తెలుగుగంగ, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ)ను ఇందులో పేర్కొనకపోయినా ఆ జాబితాలోకే వస్తుంది. ఈ ఏడు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లభించాయి. ప్రాజెక్టు నివేదికలను బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు సమర్పించారు. వీటిపై వాదనలు జరిగాయి. తుది తీర్పులో పై ప్రాజెక్టుల్లో తెలుగుగంగకు నీటి కేటాయింపులు చేశారు. అయితే ఇది నోటిఫై కాలేదు కాబట్టి తెలుగుగంగకు కూడా నీటి కేటాయింపులు లేనట్లే. పునర్విభజన తర్వాత సంబంధిత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని చట్టంలో కేంద్రం పేర్కొంది.

మినిట్స్‌ ప్రకారం అన్నీ కొత్తవే..
ప్రస్తుతం అందిన మినిట్స్‌ ప్రకారం ఈ ఏడు ప్రాజెక్టులు కొత్తవే. ఎందుకంటే ఇవేవీ కేంద్రజలవనరుల శాఖ సాంకేతిక అనుమతి పొందలేదు. ఒకవైపు ఈ ప్రాజెక్టులకు ట్రైబ్యునల్‌లో కేటాయింపులు పొందాలని మొదట పేర్కొన్న కేంద్రం, ఇప్పుడేమో పునర్విభజనకు ముందు చేపట్టినా.. సాంకేతిక అనుమతి లేకపోతే కొత్తవిగా భావించి డీపీఆర్‌లు అందజేయాలని మినిట్స్‌లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నుంచి సాంకేతిక అనుమతి లేదు కాబట్టి బచావత్‌ ట్రైబ్యునల్‌ ముందు ప్రాజెక్టు నివేదికలు సమర్పించి నీటి వినియోగంలో ఉన్న ప్రాజెక్టులూ కొత్తవేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందని నీటిపారుదల శాఖకు చెందిన ఓ సీనియర్‌ ఇంజినీర్‌ వ్యాఖ్యానించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.