close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మరమ్మతులే శ్రీశైలానికి రక్ష

ప్లంజ్‌పూల్‌లో భారీగా గుంతలు
అవి జలాశయం వైపు విస్తరించే ప్రమాదముందన్న నిపుణల కమిటీ

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం డ్యాంకు ప్రత్యేకించి గేట్ల నుంచి విడుదల చేసే నీరు కిందకు పడే ప్రాంతంలో (ప్లంజ్‌పూల్‌)నూ, దిగువన కుడి, ఎడమ గట్ల వైపు భారీగా మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణుల కమిటీ సూచించింది. డ్యాం గేట్ల నుంచి నీటిని విడుదల చేసినపుడు కిందపడి మళ్లీ ఎగిరి పడే చోట భారీ గుంతలు ఏర్పడ్డాయని, అవి క్రమేపీ డ్యాం వైపు విస్తరించే అవకాశం ఉన్నట్లు నిపుణుల కమిటీ పేర్కొంది. డ్యాం భద్రతకు ఎలాంటి నష్టం లేకుండా ప్లంజ్‌పూల్‌లో గుంతలు పూడ్చటంతో సహా పూర్తి స్థాయిలో అన్ని పనులూ చేయడానికి సుమారు రూ.900 కోట్లు అవసరమని సంబంధిత ఇంజినీర్లు అంచనా వేశారు. 2009లో శ్రీశైలానికి అనూహ్యంగా భారీ వరద వచ్చినపుడు దిగువన రెండు వైపులా దెబ్బతింది. అప్పటి నుంచి పలు కమిటీలు డ్యాంను పరిశీలించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌ ఎ.బి.పాండ్యా ఛైర్మన్‌గా, రాజగోపాలన్‌, వై.కె.కందా, పి.ఆర్‌.రావు, రౌతు సత్యనారాయణ, సుబ్బారావులు సభ్యులుగా ఏర్పాటు చేసిన కమిటీ ఈ ఏడాది మార్చి ఐదు నుంచి ఏడు వరకు పరిశీలించి డ్యాం భద్రతకు సంబంధించిన పలు అంశాలను గుర్తించింది.

కమిటీ ప్రస్తావనల్లో ముఖ్యాంశాలు...
ప్లంజ్‌పూల్‌లో ప్రత్యేకించి 6, 8 గేట్ల ఎదురుగా పెద్ద గుంతలు పడ్డాయి. 100 మీటర్లకు పైగా లోతు ఉన్నట్లు గుర్తించాం.
2002లో వేసిన కాంక్రీటు కూడా లేచిపోయింది. దీనిని తీవ్రంగా పరిగణించి తక్షణం పట్టించుకోవాలి.
దిగువన రెండువైపులా ఆప్రాన్‌లు దెబ్బతిన్నాయి.
రివర్‌ స్లూయిస్‌లలో లీకేజి ఉంది. పరీక్షించి బాగు చేయాలి.
ప్రధాన స్పిల్‌వే గేట్ల సీపేజి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
వచ్చే భారీ వరదను మళ్లించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలి.

ప్పటిదాకా ఏం జరిగిందంటే..
ప్లంజ్‌పూల్‌ 2009కి ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా తయారైంది అన్నదానిపైన కమిటీ సూచన మేరకు బాత్‌ మెట్రిక్‌ స్టడీ చేయించారు. 2002-2019 మధ్య ఏమేరకు నష్టం వాటిల్లిందో తెలుసుకోవడానికి ఇది దోహదపడిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అలాగే చేపట్టాల్సిన మరమ్మతులకు సంబంధించి పుణెలోని సెంటర్‌ ఫర్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చి సంస్థతో మోడల్‌ స్టడీస్‌ చేయించామని, డిజైన్ల తయారీ దశలో ఉందని, డిజైన్ల వచ్చిన తర్వాత కేంద్ర జల సంఘానికి పంపుతామని సంబంధిత వర్గాలు తెలిపాయి.
శ్రీశైలం డ్యాం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అవసరాలకు సంబంధించినది కాబట్టి మరమ్మతులకు అయ్యే ఖర్చును రెండూ భరించాలని, కేంద్రం కూడా సాయం చేయాలని ఇటీవల కేంద్ర జల్‌శక్తి మంత్రికి రాసిన లేఖలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కోరారు.

వరద తట్టుకొనే ప్రత్యామ్నాయాలపై కసరత్తు
ఒకవైపు శ్రీశైలం డ్యాం భద్రతా చర్యలు పూర్తి చేస్తూనే భారీ వరద వచ్చినపుడు మళ్లించడానికి అవసరమైన ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని కమిటీ సూచించడంతో దీనిపై కసరత్తు చేస్తున్నామని సంబంధిత ఇంజినీరింగ్‌ వర్గాలు తెలిపాయి. డ్యాంకు పైభాగంలో ఐదు కిలోమీటర్ల వద్ద మరో స్పిల్‌వే నిర్మించడం, పక్క బేసిన్‌కు వరద మళ్లించేలా కాలువ తవ్వడం లాంటివి ప్రత్యామ్నాయాల్లో ఉన్నాయి. పక్క బేసిన్‌కు మళ్లిస్తే కుందూ నది దీనికి సరిపోదనే అభిప్రాయం కూడా నిపుణుల చర్చల్లో వ్యక్తమైంది.
 2009లో 25 లక్షల క్యూసెక్కులకు పైగా వరద
డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం(ఎఫ్‌ఆర్‌ఎల్‌) 885 అడుగులు. గరిష్ఠ స్థాయి నీటిమట్టం(ఎం.డబ్ల్యు.ఎల్‌) 892 అడుగులు. స్పిల్‌వేకు 12 గేట్లు ఉండగా 13.5 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వెళ్లేలా డిజైన్‌ చేశారు. ఇంతకంటే ఎక్కువ వచ్చినా 14.5 లక్షల క్యూసెక్కుల వరద వెళ్లడానికి అవకాశం ఉంది. వెయ్యేళ్లలో ఒకసారి గరిష్ఠంగా ఎంత వరద (ప్రాబబుల్‌ మాగ్జిమమ్‌ ఫ్లడ్‌) వచ్చే అవకాశం ఉందన్నదానిపై 2006లో అధ్యయనం చేయగా 26.5 లక్షల క్యూసెక్కుల వరకు రావచ్చని అంచనా వేశారు. 2009 అక్టోబరులో 25 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చినట్టు రికార్డయింది. డ్యాం గేట్లు పైన ప్రీబోర్డు వరకు నీరు రాగా నీటిపారుదల శాఖ లెక్కల ప్రకారం అది 896.5 అడుగుల నీటిమట్టంగా ఉంది. ఆ సమయంలోనే డ్యాం భద్రతపై చర్చ జరిగింది. అప్పటి నుంచి పలు ప్రత్యామ్నాయాలపై నిపుణుల కమిటీలు అధ్యయనం చేశాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.