close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ధరణిలోనే సమస్తం

భూ సంస్కరణల్లో తెలంగాణ విప్లవం
ఆలస్యం లేకుండా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌  
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ సర్వే
15 రోజుల్లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు  
వ్యవసాయేతర ఆస్తుల వివరాలు ఇతరులు చూడకుండా ఏర్పాటు

ధరణి దేశమంతా విప్లవం రేపుతుంది. దీంతో భారత ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి వస్తుంది. ఇప్పటికే నాకు, సీఎస్‌కు ఫోన్లు వస్తున్నాయి. ఎలా చేస్తున్నారని అడుగుతున్నారు. భూములు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యాల కింద ఉన్నాయి. ధరణి సాహసం అని ఇతర రాష్ట్రాల సీఎంలు అన్నారు. సంకల్పం ఉంటే విజయవంతం అవుతుందని నేను చెప్పాను. ఒక్కరోజు కాదు.. మూడేళ్లు కష్టపడితే ఇది సాధ్యమైంది.

- సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘భూ సంస్కరణల చరిత్రలో ఇదో విప్లవం. ప్రపంచంలోనే సరికొత్త సాంకేతికతకు శ్రీకారం. ఇలాంటి చరిత్రాత్మక ఘట్టానికి మూడుచింతలపల్లి వేదికగా నిలిచింది. 1969 తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచిన వీరారెడ్డి పుట్టిన గడ్డ ఇది. అందుకే ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ధరణి పోర్టల్‌ దేశానికే ట్రెండ్‌ సెట్టర్‌’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దారు కార్యాలయంలో మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌లతో కలిసి గురువారం ఆయన ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. అనంతరం సభలో మాట్లాడారు. క్రమపద్ధతిలో సేద్యం చేయడం తెలియనప్పుడు భూమికి ప్రాధాన్యం ఉండేది కాదన్నారు. నిర్ణీత పద్ధతిలో సాగు నేర్చుకున్నాక విలువ పెరిగిందని తెలిపారు. దేశంలో షేర్షా సూరి నుంచి అక్బర్‌ ఆస్థానంలో పనిచేసిన తోడర్‌మల్లు వరకు అనేకరకాల భూ విధానాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. వాటిలో కొన్ని వికటించాయని తెలిపారు. తెలంగాణ రైతుల భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని ఐదేళ్ల క్రితం నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక, తాను సీఎం అయ్యాక, ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఏం జరగాలని ఆలోచించానని తెలిపారు. ధరణి ద్వారా పారదర్శకంగా వేగవంతమైన సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ఆయన ఏమన్నారంటే..

పూర్తి పారదర్శకమైన పోర్టల్‌
‘‘ధరణి జాబితాలో 1,45,58,000 ఎకరాల భూములు దర్శనమిస్తున్నాయి. వీటి వివరాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడినుంచైనా చూసుకోవచ్చు. ఫోన్‌లోనూ చూసుకోవచ్చు. గోల్‌మాల్‌కు అవకాశం ఉండదు. గతంలో దేవాదాయ, వక్ఫ్‌, ఫారెస్టు, ప్రభుత్వ భూములను ఎవరికి పడితే వారికి రిజిస్టర్‌ చేసేవారు. ధరణి పోర్టల్లో ఉండే వాటికి ఆటోలాక్‌ ఉంటుంది. తహసీల్దారు, కలెక్టరు కూడా తెరవలేరు. అక్రమానికి తావుండదు. దిల్లీలో సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ను కూడా ఒక ప్రబుద్ధుడు రిజిస్ట్రేషన్‌ చేసి రుణం తీసుకున్నాడు. ఇకపై అలాంటివి కుదరవు. సీఎస్‌ సహా అధికారులంతా మూడేళ్ల క్రితం ధరణి సాధ్యమా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. కరోనా రాకుంటే ఐదారు నెలల ముందే ప్రారంభించేవాళ్లం. రాష్ట్రంలోని భూముల్లో వివాదంలో ఉన్నవి ఒక్క శాతం ఉంటాయి. వాటికోసం మిగిలినవాటిని ఎందుకు పక్కన పెట్టాలన్న ఆలోచనతో ధరణి ప్రారంభించాం. వివాదాల్లో ఉన్నవి, కోర్టుల్లో ఉన్నవి పరిష్కారమయ్యాక పోర్టల్లో చేరుస్తారు. మ్యుటేషన్లు, రిజిస్ట్రేషన్ల కోసం కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి ఉండదు. పైరవీలు అవసరం లేదు. నమూనా పత్రాలు అందుబాటులో ఉన్నాయి. కొద్దిరోజుల్లో కలెక్టర్లు దస్తావేజు లేఖరులను గుర్తించి నియమిస్తారు.
15 - 20 నిమిషాల్లోనే ప్రక్రియ
ఇద్దరు వ్యక్తుల మధ్య భూమి బేరం అయ్యాక తహసీల్దారు కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి. స్టాంపు ఫీజు, మ్యుటేషన్‌ ఫీజు కట్టాలి. స్లాట్‌ బుక్‌ చేసుకున్నాక 15, 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ అవుతుంది. బ్యాంకు పాసుపుస్తకం మాదిరి మార్పులు జరుగుతాయి. పాసుపుస్తకం లేకపోతే కొత్తది ఇస్తారు. ఫీజు చెల్లిస్తే పోస్టులో ఇంటికే వస్తుంది. ఇక్కడ మనుషుల జోక్యం ఉండదు. గతంలో ఉన్న రిజిస్ట్రేషన్‌ ఛార్జీలనే అమలు చేస్తున్నాం. 60 లక్షలమంది రైతులకు ఇది మంచి అవకాశం. ఎక్కడైనా కంప్యూటర్‌ నిలిచిపోతే బెంబేలెత్తొద్దు. సాంకేతిక బృందాలు ఉంటాయి.
కిరికిరి పెట్టేవారితో జాగ్రత్త
కిరికిరిగాళ్లు, పైరవీకారులు, గెట్ల పంచాయతీలు పెట్టించేవారి బారిన పడకుంటే పల్లెలు ప్రశాంతంగా ఉంటాయి. లోపాలు వెతికే శక్తులు ఎప్పుడూ ఉంటాయి. భూ యాజమాన్య హక్కుల వారసత్వ బదిలీ (ఫౌతీ) నిర్ణయించుకునే అవకాశం ఆ కుటుంబానికే ఇచ్చాం. కుటుంబ సభ్యులు తీర్మానం చేసుకుని తహసీల్దారును కలిస్తే వారికి రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. వివాదం ఉంటే కోర్టులో తేల్చుకోవాలి.

అమెరికా కూడా మెచ్చుకునేలా..
భూ పరిపాలన, దస్త్రాల్లో స్పష్టత ఉన్న రాష్ట్రం తెలంగాణ అని అమెరికా మెచ్చుకునే పరిస్థితి రావాలని నేను కోరుకుంటున్నా. మన రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలకు ఆద్యుడు సాలార్‌జంగ్‌-1. ఖాస్రా, పహాణీ, బందోబస్తు ఆ సమయంలోనే వచ్చాయి. నిజాం కాలంలో సర్వే చేసి గెట్లు నిర్ణయించారు. అలాగే పీవీ నర్సింహారావు భూ సంస్కరణలు తెచ్చారు. ఆయన పుణ్యానే భూ పంపిణీ జరిగి రాష్ట్రంలో 93 శాతం చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. ఎన్టీఆర్‌ పటేల్‌, పట్వారీ వ్యవస్థ రద్దు చేశారు. తరువాత సీఎంలు ఎవరూ ఏమీ చేయలేదు. ఐటీ అని మాట్లాడిన సీఎం కూడా ఐటీ తేనేలేదు. మొదటిసారి దేశంలో భూ దస్త్రాల నిర్వహణలో తెలంగాణ సాంకేతిక సేవలను ప్రవేశపెడుతోంది. కొద్దిరోజుల్లో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహిస్తుంది. సంపూర్ణ భూ యాజమాన్య హక్కులు ఇవ్వాలని యోచిస్తున్నాం. సమగ్ర సర్వే పూర్తి చేశాక దీనిపై ఆలోచిస్తాం.
అప్పుడే బంగారు తెలంగాణ
నా పంతం ఒక్కటే. రైతుల బ్యాంకు ఖాతాలో రూ. రెండు, మూడు లక్షలు నిల్వ ఉండాలి. సొంత పెట్టుబడికి స్థోమత రావాలి. అప్పుడే బంగారు తెలంగాణ. కేసీఆర్‌ బతికున్నంత కాలం రైతుబంధు ఆగదు. రాష్ట్రంలో ఇటీవల 48 గంటల్లో 58 లక్షలమందికి రైతుబంధు డబ్బులు వేశాం. కాళేశ్వరంతో చెరువులు నిండాయి. ఏప్రిల్‌, మే నెలల్లో కూడా చెరువులు నింపే బాధ్యత నాది. కరోనా వచ్చి నష్టం జరిగితే కేంద్రం జీఎస్టీ డబ్బులు కూడా ఇవ్వలేదు. అయినా సంక్షేమ పథకాలు, రైతుబంధు ఆపలేదు. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వం.
సాదాబైనామాలకు మరోవారం
సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చివరిగా మరో వారం అవకాశం ఇస్తోంది. ప్రస్తుతానికి 1.64 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ధరణి అమల్లోకి వచ్చింది కాబట్టి ఇక భూమి మారకం రిజిస్ట్రేషన్ల ద్వారా మాత్రమే నడుస్తుంది. పోడు భూముల విషయంలోనూ నిర్ణయం తీసుకుంటాం.  
బాలారిష్టాలు ఉంటాయి
భారీ సంస్కరణలు తెచ్చినప్పుడు కొన్నాళ్లు బాలారిష్టాలు తప్పవు. పోర్టల్‌కు కృషిచేసిన రెవెన్యూ ఉద్యోగులందరికీ అభినందనలు. రెవెన్యూ సంఘం నాయకులు రవీందర్‌రెడ్డి, గౌతంకుమార్‌తోపాటు అనేకమంది ఎంతో కృషిచేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ప్రజలతో ప్రేమగా మాట్లాడాలి. రెవెన్యూలో కొద్దిమంది అధికారులు తప్పు చేయొచ్చు. అలా అని శాఖ మొత్తం తప్పని చెప్పలేం. వారు మన బిడ్డలే’’ అని కేసీఆర్‌ అన్నారు.

వ్యవసాయేతర ఆస్తులకు ‘హైడ్‌’ ఐచ్ఛికం  

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల సేవల ప్రక్రియ 15, 20 రోజుల్లో ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ధరణి ప్రారంభం అనంతరం ఆయన మీడియాతో ముచ్చటించారు. ఖాళీ స్థలాలతోపాటు అన్ని ఆస్తుల వివరాలను ధరణిలో నమోదు చేసుకోవాలని సూచించారు. అది యజమానులకే మంచిదన్నారు. వ్యవసాయేతర ఆస్తులు ఇతరులకు బహిర్గతం కాకుండా ‘దాచుకునే’ (హైడ్‌) ఐచ్ఛికం ప్రభుత్వం ఇస్తుందన్నారు. సమగ్ర సర్వేతో అన్నింటిపైనా స్పష్టత వస్తుందని, అనంతరం సంపూర్ణ భూ యాజమాన్య హక్కులు కల్పించేందుకు (టైటిల్‌ యాక్టు) చర్యలు తీసుకుంటామన్నారు. అందుకు రెండేళ్లు పట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

నాటి ఉద్యమ వీరుడు వీరారెడ్డికి కేసీఆర్‌ నివాళి

శామీర్‌పేట, న్యూస్‌టుడే: తెలంగాణ తొలి దశ ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డితో కలిసి కీలకంగా వ్యవహరించిన కామిడి వీరారెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరారెడ్డి 1969 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చెన్నారెడ్డితో కలిసి జైలు జీవితం గడిపారు. మేడ్చల్‌ సమితి అధ్యక్షుడిగా 12 ఏళ్ల పాటు పని చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా సేవలందించారు. బాలికల విద్యాభివృద్ధి కోసం కేశవరం గ్రామంలో దాతల సహకారంతో జూనియర్‌ కళాశాలను ప్రారంభించారు. 2003 జనవరి 28న చనిపోయారు. వీరారెడ్డిపై ఉన్న అభిమానంతో కేసీఆర్‌ 2017లో మూడుచింతలపల్లిని దత్తత తీసుకుని ప్రత్యేక మండలంగా ప్రకటించారు.

మాది వెనుకబడిన ప్రాంతం కాదు. వెనక్కు నెట్టివేయబడిన ప్రాంతం అని నేను తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పేవాడిని. కేంద్రం ప్రభుత్వం, ఆర్‌బీఐ వాళ్లు ఇది నిజమని చెప్పారు. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1.12 లక్షలు. కేవలం ఆరేళ్లలో మన తలసరి ఆదాయం రూ. 2.28 లక్షలకు చేరుకుంది. నాడు దేశంలో 14 స్థానంలో ఉండగా నేడు మనం 5వ స్థానంలో నిలిచామని గర్వంగా చెబుతున్నా .


ఏదైనా తప్పు జరిగితే అనేక తరాలు ఇబ్బందులు పడతాయి. కానీ, ఈ రాష్ట్రానికి ఒక దిశ, ఒక గమనం ఇవ్వాల్సిన బాధ్యతను నాపై, తెరాసపై ప్రజలు ఉంచారు. ఎన్నికలకు ముందు ఐదేళ్లలో శాశ్వతంగా మంచినీటి సమస్య తీర్చకపోతే పోటీ చేయబోమని చెప్పాం. సంకల్ప బలంతో నీళ్లు ఇచ్చి చూపించాం. తీసుకున్న కఠిన నిర్ణయాలతో దేశంలోనే తలసరి విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది


రూ.26 వేల కోట్లు ఖర్చు చేసి అన్ని రంగాలకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఒకప్పుడు మన పంటల దిగుబడి చూసి మన నుంచి విడిపోయిన రాష్ట్రం వాళ్లు మనల్ని ఎగతాళి చేసేవారు. నేడు పంటల దిగుబడిలో వారిని వెనక్కు నెట్టివేశాం. గతేడాది ఎఫ్‌సీఐకి అన్ని రాష్ట్రాలు 45 శాతం సరఫరా చేస్తే ఒక్క తెలంగాణ నుంచే 55 శాతం వరిధాన్యం సరఫరా చేశాం. స్వయానా మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్‌రెడ్డి అల్లుడైన ఎఫ్‌సీఐ ఛైర్మన్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.’’  

- ముఖ్యమంత్రి కేసీఆర్‌


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.