close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గ్రేటర్‌లో భాజపాకు జనసేన మద్దతు

జనసేన కార్యకర్తలకు అధినేత పవన్‌కల్యాణ్‌ సూచన
విస్తృత ప్రయోజనాల కోసమని  వెల్లడి.. త్వరలో రోడ్‌మ్యాప్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే : హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో భాజపా గెలుపునకు జనసేన మద్దతుగా నిలుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ శుక్రవారం ప్రకటించారు. హైదరాబాద్‌, తెలంగాణకు సంబంధించి విస్తృత ప్రయోజనాల దృష్ట్యా బల్దియా ఎన్నికల పోటీ నుంచి తమ అభ్యర్థులను ఉపసంహరించుకొంటున్నట్లు ఆయన తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన మద్దతు కోరుతూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌.. హైదరాబాద్‌లో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ నివాసంలో పవన్‌కల్యాణ్‌ను కలిశారు. సుమారు రెండు గంటల పాటు వారు చర్చించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. గ్రేటర్‌ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేయాలనుకున్నప్పటికీ కరోనా, అనూహ్యంగా వచ్చిన ఎన్నికల నేపథ్యంలో సాధ్యపడలేదన్నారు. జీహెచ్‌ఎంసీతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు భాజపాకు ఉంటుందని పేర్కొన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.
భాజపా విజయం కోసం పనిచేయాలి..
‘ప్రధాని నాయకత్వంలో హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుంది. జనసేన కార్యకర్తలంతా భాజపా విజయం కోసం పనిచేయాలి. తెలంగాణలో జనసేన, భాజపా రోడ్‌మ్యాప్‌ను భవిష్యత్‌లో ప్రకటిస్తాం. ఈ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేయాలని భావించిన వారంతా కొంత మేరకు నిరుత్సాహానికి లోనవుతారు. అయితే విస్తృత ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ఇది. భాజపా అభ్యర్థులను గెలిపించేలా కార్యకర్తలు మద్దతు తెలపాలి.ఇప్పటికే నామినేషన్‌ వేసిన జనసేన అభ్యర్థులు ఉపసంహరించుకోవాలి’ అని పవన్‌కల్యాణ్‌ కోరారు.
సానుకూలంగా స్పందించారు..
‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో సమావేశం అయ్యాం. ఆయన సానుకూలంగా స్పందించారు’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ‘భాజపా గెలుపు కోసం జనసేన కార్యకర్తల మద్దతు, ముఖ్యంగా పవన్‌కల్యాణ్‌ ప్రచారం అవసరం’ అని లక్ష్మణ్‌ చెప్పారు.

భాజపా నేతల ఆగ్రహం.. పార్టీ కార్యాలయం ధ్వంసం

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: కూకట్‌పల్లి నియోజకవర్గంలో భాజపా నేతలు భగ్గుమన్నారు. నాలుగు డివిజన్ల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ వారు పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. నాయకులపై విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డారు. ఫతేనగర్‌ నుంచి కంచి మహేందర్‌, బాలానగర్‌ నుంచి శంకర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, కూకట్‌పల్లి నుంచి యంజాల పద్మయ్య, బాలాజీనగర్‌ నుంచి వినోద్‌ టికెట్లు ఆశించారు. అయితే ఆ డివిజన్లకు వేరే వారి పేర్లను ప్రకటించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన వీరు తమ అనుచరులతో శుక్రవారం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కిటికీ అద్దాలు పగులగొట్టి, కుర్చీలను విరగ్గొట్టారు. ఫ్లెక్సీలను చించారు. కిషన్‌రెడ్డి, హరీశ్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న కూకట్‌పల్లి పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. అనిల్‌ అనే కార్యకర్త పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అందరినీ ఠాణాకు తరలించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.